కన్నీరు మిగిల్చిన ‘గులాబ్‌’

ABN , First Publish Date - 2021-09-29T06:16:40+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ అన్నదాతకు కన్నీరు మిగిల్చింది. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి.

కన్నీరు మిగిల్చిన ‘గులాబ్‌’
రావికమతం: జి.చీడిపల్లి వద్ద రెండు రోజులుగా నీటి ముంపులోనే ఉన్న పంట పొలాలు

నీటి ముంపులో పంట పొలాలు

వందలాది ఎకరాల్లో వరి, చెరకకు నష్టం

ఆందోళనలో రైతులు


చోడవరం, సెప్టెంబరు 28: గులాబ్‌ తుఫాన్‌ అన్నదాతకు కన్నీరు మిగిల్చింది. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. దీంతో వందలాది ఎకరాల్లో వరి, చెరకుకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

చోడవరంలోని శారదా, పెద్దేరు నదుల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో పంట పొలాల్లో నీరు బయటకు పోయే మార్గం లేకపోతోంది. దీంతో కన్నంపాలెం, చాకిపల్లి, రామజోగిపాలెం, లక్ష్మీపురం, అంకుపాలెం, శ్రీరాంపట్నం, పీఎస్‌.పేట, గౌరీపట్నం, ఖండేపలి,్ల సింహాద్రిపురం తదితర ప్రాంతాల్లో వరి, చెరకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. స్థానిక మేజర్‌ పంచాయతీలో ద్వారకానగర్‌లోని గృహాల్లోకి నీరు చేరడంతో రాత్రంతా స్థానికులు ఇబ్బందులు పడ్డారు. చోడవరం-అంకుపాలెం రహదారిలో లక్ష్మీపురం చెరువు నుంచి భారీగా వరదనీరు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సర్పంచ్‌ నాగులాపల్లి రాంబాబు ఆధ్వర్యంలో స్థానికులు చెరువు నీరుకు ఉన్న అడ్డంకులు తొలగించడంతో వాహనాలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాగా, తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను సోమ, మంగళవారాల్లో జట్పీటీసీ సభ్యురాలు మారిశెట్టి విజయశ్రీకాంత్‌, ఎంపీపీ గాడి కాసు, సర్పంచ్‌ బండి నూకాలమ్మ, తహసీల్దార్‌ తిరుమలబాబు సందర్శించారు. పరిస్థితిని సమీక్షించి ఉద్యోగులను అప్రమత్తం చేశారు. అలాగే చాకిపల్లి, రామజోగిపాలెం, కన్నంపాలెం గ్రామాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయని, అధికారులు పరిశీలిచి ఆదుకోవాలని ఎంపీటీసీ సభ్యురాలు బైన కుమారి, ఈశ్వరరావు విజ్ఞప్తి చేశారు. 

బుచ్చెయ్యపేట: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో పంట నష్టం పెరిగింది. మండలంలోని 14 గ్రామాల్లో 900 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో చెరకు పంటలు నీట మునిగాయి. వరద ప్రవాహనికి మంగళాపురం ఆయకట్టుకు గండి పడింది. చినభీమవరంలో ఇళ్లు ముంపులోనే ఉన్నాయి. నీటి ముంపులో ఉన్న పంటల వివరాలను సేకరిస్తున్నామని, ముంపు నుంచి తేరుకున్న అనంతరం నష్టాలపె ౖసర్వే చేస్తామని ఏవో రాంప్రసాద్‌ తెలిపారు. 

రావికమతం: మూడు రోజులుగా కరుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు గెడ్డలు, వాగులు, చెరువులు, రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మండలంలో వందలాది ఎకరాల వరి పంట నీటి ముంపులోనే ఉంది. రావికమతం, మత్స్యపురం యర్ర చెరువు సమీపంలోను, జి.చీడిపల్లి, మేడివాడ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట మునిగింది. అపరాలు నీటిలో మునిగి కుళ్లిపోతున్నాయి. కొత్తకోటలో ఓ పెంకిటిల్లు కూలింది. రావికమతం జడ్పీ హైస్కూల్‌ ఆవరణ వర్షపు నీటితో నిండిపోయింది. తుఫాన్‌ తీవ్ర నష్టం చూపిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రోలుగుంట: గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మండలంలో వరి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి తోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు మొత్తం వరి పొలాలు ఇంకా నీటమునిగే ఉన్నాయి. తుఫాన్‌ ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారాలు అందించాలని వారు వేడుకుంటున్నారు.


Updated Date - 2021-09-29T06:16:40+05:30 IST