Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వ్యూహాత్మకంగా MLA ROJA ఎదురుదాడి.. ఏం జరుగుతుందో..!

twitter-iconwatsapp-iconfb-icon
వ్యూహాత్మకంగా MLA ROJA ఎదురుదాడి.. ఏం జరుగుతుందో..!

  •   ప్రత్యర్థి వర్గాన్నిఇరుకున పెట్టిన వైనం

తిరుపతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నగరి నియోజకవర్గంలో తనను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రోజా ఎదురుదాడికి దిగారు. అసంతృప్తి వర్గ నేతల ఆరోపణలను తిప్పికొట్టడం, లేదా వారిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం వంటి చర్యల జోలికి పోలేదు. తన మద్దతుదారులైన నేతలందరినీ వెంటబెట్టుకుని వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని మీడియాకూ బహిర్గతపరిచారు. ఈ ఫిర్యాదు విషయంలో ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ‘నగరి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక తరలిస్తుంటే, అక్రమ రవాణా అంటూ కొందరు సొంత పార్టీ నేతలే సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల అటు సీఎం జగన్‌కు, పార్టీకి అప్రతిష్ఠ ఎదురవుతోంది’ అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసేందుకు ఈ చర్యలు ఉపకరిస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు ఇసుకకు సంబంధించిన శాఖా మంత్రిని, ఇసుక తవ్వకాలు, రవాణాను నియంత్రించే అధికార యంత్రాంగాన్ని అవమానించేలా వీరి అసత్య ప్రచారం ఉందని పేర్కొన్నారు. ఇలా, నేరుగా ప్రభుత్వానికి, జిల్లా మంత్రులకు కూడా ముడిపెట్టి ఫిర్యాదు ఇవ్వడంతో దాన్ని కాదనే పరిస్థితి పార్టీలో ఏ స్థాయిలోనూ లేకుండా పోతోంది.


తద్వారా తన ప్రత్యర్థులను ఆమె వ్యూహాత్మకంగా ఇరుకున పడేశారన్న భావన పార్టీ వర్గాల్లో నెలకొంటోంది. జిల్లాలోని కొందరు ముఖ్యనేతల అండతోనే అసమ్మతి నేతలు తమకు వ్యతిరేకంగా బహిరంగ కార్యకలాపాలకు దిగుతున్నారని రోజా వర్గం భావిస్తున్నట్టు సమాచారం. అందుకే తమ ప్రత్యర్థివర్గ చర్యలు మంత్రులను కించపరిచినట్టవుతోందని ఎస్పీకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా అసమ్మతి నేతలకు సహకరించకుండా, మద్దతివ్వకుండా మంత్రులకే బంధనాలు వేశారన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. పనిలో పనిగా తన నియోజకవర్గంలో అసమ్మతి నేతల కార్యకలాపాలు పార్టీని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయని, టీడీపీ బలపడేందుకు ఉపకరిస్తున్నాయని అధిష్ఠానం దృష్టికి వెళ్లేలా చేయడంలో ఆమె సఫలీకృతురాలైనట్టు భావిస్తున్నారు.

వ్యూహాత్మకంగా MLA ROJA ఎదురుదాడి.. ఏం జరుగుతుందో..! వైసీపీ నాయకులతో కలిసి ఎస్పీకి వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే రోజా

మరోవైపు సొంత పార్టీ నేతలు కొందరిని కోవర్టులంటూ ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది. రోజా దూకుడు జిల్లా ముఖ్యనేతలను సైతం కలవరిపరిచేలా ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తమ్మీద రోజా పుట్టించిన కాక కొత్త సంవత్సరంలో జిల్లా వైసీపీపై ఎంతోకొంత ప్రభావం చూపనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజా తనదైన శైలిలో దూకుడుగా వేసిన ఈ అడుగుతో నగరిలో వర్గ పోరుకు ఫుల్‌స్టాప్‌ పడుతుందా లేదా మరింత జోరందుకుంటుందా అన్నది వేచి చూడాలి. 


అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలు చేపట్టండి..

టీడీపీని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తూ జిల్లాకు చెందిన మంత్రులపైన, తనపైనా సోషల్‌ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసేవారిపై చర్యలు చేపట్టాలని నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆమె చిత్తూరులో ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. జగనన్న కాలనీల్లో పేదలు ఇళ్లు కట్టుకునే ప్రక్రియను ఆపడానికి వైసీపీలోని కొందరు కోవర్టులు టీడీపీతో చేతులు కలపడం దురదృష్టకరమన్నారు.  నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన నగరిలోని రీచ్‌ నుంచి పేదల ఇళ్లకు ఇసుక తీసుకెళ్తున్నారన్నారు. దీనిని రాజకీయం చేస్తూ, ఇసుక అక్రమంగా తరలిస్తున్నారంటూ వాట్సప్‌ గ్రూపుల్లో పెట్టడం, వీడియో తీసి క్లిప్పింగులు పెట్టడం వంటి పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. ఇది జిల్లా మంత్రితో పాటు అధికారులను కించపరచడమేనన్నారు.


వైసీపీకి చెందిన వారైతే గనుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేవారని, అలా చేయడం వల్ల నిజానిజాలు తేలేవని పేర్కొన్నారు. డీజీపీని కలిసిన ఫొటోనూ తమ అసత్య ప్రచారాలకు పావుగా వాడుకొన్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని డీజీపీకి వివరించామని, ఆయన సూచనల మేరకే ఇలాంటి కార్యక్రమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా సంబంధితులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఎస్పీని కోరామన్నారు. పార్టీలో ఎవరైనా తప్పుచేస్తే శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ఆమె వెంట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.