Abn logo
Jun 13 2021 @ 03:00AM

గదుల సులభతర రిజిస్ర్టేషన్‌ ప్రారంభం

తిరుమల, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదుల కోసం పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకునే సులభతర విధానాన్ని టీటీడీ శనివారం ప్రారంభించింది. తిరుమలలోని సీఆర్వో వద్ద టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పూజలు నిర్వహించి కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులకు త్వరితగతిన పేర్ల నమోదు, గదుల కేటాయింపునకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందులో భాగంగా సీఆర్వో, బాలాజీ బస్టాండ్‌, కౌస్తుభం, రాంభగీచ బస్టాండ్‌, ఎంబీసీ, జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద రెండు కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఈ కౌంటర్ల ద్వారా పేర్లు రిజిస్ర్టేషన్‌ చేసుకున్న తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా వారికి కేటాయించిన గదుల సమాచారం తెలియజేస్తామని, ఉప విచారణ కార్యాలయాల వద్ద రుసుం చెల్లించి గదులు పొందవచ్చన్నారు.