గది

ABN , First Publish Date - 2020-02-17T11:24:07+05:30 IST

గదులన్నీ ఆ గదిలోకే ప్రవహిస్తాయి. దేహంలోని రక్తం చలనాలు గుండెవైపు సాగుతున్నట్టు, సముద్రంలోని ఉపరితలకెరటాలు అడగుకు చేరుకుంటున్నట్టు నేను రోజూ గదిలోకి ప్రవేశిస్తాను.

గది

గదులన్నీ 

ఆ గదిలోకే ప్రవహిస్తాయి.

దేహంలోని రక్తం చలనాలు

గుండెవైపు సాగుతున్నట్టు,

సముద్రంలోని ఉపరితలకెరటాలు

అడగుకు చేరుకుంటున్నట్టు

నేను రోజూ గదిలోకి ప్రవేశిస్తాను.

గోడలు కట్టి

పేర్లు పెడతాంగాని

ఏ గదిలో ఉండాల్సిన వస్తువులు

అక్కన్నే స్థిరంగా ఉండవు

అప్పుడప్పుడు ఈ గదిలోనే

ప్రత్యక్షమవుతాయి.

ర్యాక్‌లో అశాంతిగా కదిలే పుస్తకం

దిండు పక్కన చేరుతుంది.

డ్రాయింగ్‌ రూంలోని మొనాలిసాబొమ్మ

మనసులో మెదిలి

భావాలు మారిపోతుంటాయి.

కల

ఒక శృంఖలగా మారుతుంది

అరటిగెల

తీయని ఊయెలగా ఊగుతుంది

నిద్రానిద్రలమధ్య

ఒక విచిత్రమైన వల పరుచుకుంటుంది.

ఇది వొట్టిగదికాదు

ప్రేమ తక్కువైనప్పుడు

తలపోతకు ఉక్కపోస్తుంది

ఆస్తుల విస్తీర్ణం పెరిగినప్పుడల్లా 


మనస్సు ఇరుకౌతుంది.

స్పష్టంగా ఉండాల్సిన సారాంశం

సంక్లిష్ట ఛాయావృతమౌతుంది.

ఇది వొట్టిగది కాదు

ఆత్మ ద్రవీభవించే నది

నాకు నేను కనిపిస్తున్న పెన్నిధి

ఎన్‌. గోపి


Updated Date - 2020-02-17T11:24:07+05:30 IST