పైకప్పు కూలినా.. పట్టింపు కరువు

ABN , First Publish Date - 2021-05-17T06:29:49+05:30 IST

చుట్టు పక్కల పదిహేను గ్రామాలకు పైగా పాడి రైతులు తమ తమ పశువులకు ఏ ఆపద వచ్చిన వచ్చేది ఆ పశువుల దవాకాణాకే.. గత 40 ఏళ్లకు పైగా ఈ ఆసుపత్రి కేంద్రంగానే మండలంలోని పాడి రైతులకు నిరంతరం సేవలు అందుతున్నాయి. ఇటువంటి ఆ

పైకప్పు కూలినా.. పట్టింపు కరువు
ఏడాది క్రితం కూలిపోయిన ఆసుపత్రి పైకప్పు

శిథిలావస్థకు చేరిన సత్తన్‌పెల్లి గ్రామీణ పశువైద్యశాల భవనం
వర్షం కురిస్తే మందులు నీటిపాలు కావాల్సిందే
40 ఏళ్లకు పైగా పదిహేను గ్రామాలకు నిరంతర సేవలు
వర్షాలు ప్రారంభమైతే పూర్తిగా కూలుతుందేమోనని సిబ్బంది ఆందోళన
నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పాడి రైతుల డిమాండ్‌

ఖానాపూర్‌, మే 16: చుట్టు పక్కల పదిహేను గ్రామాలకు పైగా పాడి రైతులు తమ తమ పశువులకు ఏ ఆపద వచ్చిన వచ్చేది ఆ పశువుల దవాకాణాకే.. గత 40 ఏళ్లకు పైగా ఈ ఆసుపత్రి కేంద్రంగానే మండలంలోని పాడి రైతులకు నిరంతరం సేవలు అందుతున్నాయి. ఇటువంటి ఆసుపత్రి భవనం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఆ ఆసుపత్రిలో కూర్చోవడానికి సిబ్బంది అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహించాల్సిందే. గత యేడాది నుండి ఏక్షణం ఏ ప్రమాదం జరుగుతుందో అంటూ భయం భయంగా విధులు నిర్వహించి న సిబ్బందికి కొద్ది నెలల కిత్రం అనుకున్నట్లే అయ్యింది. కళ్ళెదురుగానే ఆసుపత్రి పైకప్పు కుప్ప కూలడంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రక్క గదిలోకి పరుగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదం తా ఖానాపూర్‌ మండలంలోని సుమారు పదిహేను గ్రామాలకు పెద్ద దిక్కుగా ఉన్న సత్తన్‌పెల్లి గ్రామీణ పశువైద్యశాల దుస్థితి.
40 ఏళ్లకు పైగా పదిహేను గ్రామాలకు పెద్దదిక్కు
40 ఏళ్లుగా ఖానాపూర్‌ మండలంలోని ఎల్లాపూర్‌, గోసంపల్లె, దిలావార్‌పూర్‌, తర్లాపాడ్‌, రాంరెడ్డిపల్లే, సేవ్యానాయక్‌తండా, అడవిసారంగాపూర్‌, పాతతర్లాపాడ్‌, బాదన్‌కుర్తి, సుర్జాపూర్‌, మస్కాపూర్‌, మేడంపెల్లి తదితర గ్రామాలకు చెందిన పాడి రైతులకు సంబందించి ఏ పశువు అనారోగ్యం బారిన పడిన పెద్దదిక్కుగా ఉన్న సత్తన్‌పెల్లి గ్రామీణ పశువైద్యశాలపై పాలకుల పట్టింపు కరువయ్యింది. ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం జేవివోతో పాటు ఒక ఆఫిస్‌ సబ్‌ఆర్డినేట్‌ అందుబాటులో ఉన్నారు. ఆసుపత్రిలో అన్నీ సౌకర్యాలు కల్పిస్తే తమకు మేలు జరుగుతుందని మండలంలోని పాడి రైతులు చెబుతున్నారు.
పశువైద్యశాలపై పాలకుల పట్టింపు కరువు
ఆసుపత్రికి సరైన మందులను సరాఫరా చేయకపోవడంతో రైతులు ప్రైవేటు మెడికల్‌లలో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో కనీసం నీటి సౌకర్యం లేదు. మలమూత్రశాలలు లేవు. ఇన్నాళ్లు అరకొర సౌకర్యాలతోనే కాలం వెల్లదీసిన ఇక్కడి అధికారులు, సిబ్బందికి ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గత ఏడాది క్రితం సిబ్బంది ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఆసుపత్రిలోని ఓ గది పైకప్పు పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పక్క గదిలోకి పరుగుతు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ యేడు వర్షాకాలం వస్తే పూర్థిస్థాయిలో భవనం నేలమట్టం అయ్యేలా ఉందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరడంతో కొద్దిపాటి వర్షం కురిసిన మందులు పూర్తిగా తడిచిపోయే పరిస్థితి ఉంది. పాడిపరిశ్రమ అభివృద్దికి చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం కనీసం పశువుల ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఏడాది కాలంగా చెబుతున్న ఆసుపత్రి నూతన భవనానికి నిధులు మంజూరీ చేయడం లేదని ఈ ప్రాంత ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు.  ఖానాపూర్‌ మండలంలోని మెజారిటి గ్రామాలకు పెద్దదిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రిపై పాలకులు శ్రద్ధచూపి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-17T06:29:49+05:30 IST