Abn logo
Jul 25 2021 @ 01:17AM

శృంగారం, పోర్న్‌ ఒకటి కాదు.. మా ఆయన అమాయకుడు: శిల్పాశెట్టి

ముంబై, జూలై 24: తన భర్త అమాయకుడని, హాట్‌షాట్స్‌ యాప్‌లోని కంటెంట్‌ ఏమిటన్న వివరాలు తనకు తెలీదని శిల్పాశెట్టి ముంబై పోలీసులకు తాజాగా స్పష్టం చేశారు. నీలి చిత్రాల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలతో ఆమె భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ కేసులో ఆమె పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు శిల్పాశెట్టిని విచారించారు. ఈ సందర్భంగా ఆమె తనకేమీ తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘రాజ్‌ కుంద్రాకు వరసకు బావ అయ్యే ప్రదీప్‌ బక్షి హాట్‌షాట్స్‌ యాప్‌ను చూసుకుంటున్నారు. కుంద్రా నీలి చిత్రాలను(పోర్న్‌) తీయలేదు. శృంగారానికి, పోర్న్‌కు చాలా వ్యత్యాసం ఉంది’’ అని శిల్ప పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా..ఈ కేసులో ఇప్పటి వరకూ రూ. 7.5 కోట్లను, సుమారు 48 టెరాబైట్లు ఉన్న అశ్లీల చిత్రాలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.