రోమన్ అబ్రమోవిచ్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్ కోసం ‘చెల్సియా’ అమ్మకం

ABN , First Publish Date - 2022-03-03T23:18:24+05:30 IST

చెల్సియా క్లబ్ రష్యన్ యజమాని రోమన్ అబ్రమోవిచ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

రోమన్ అబ్రమోవిచ్ సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్ కోసం ‘చెల్సియా’ అమ్మకం

మాస్కో: చెల్సియా ఫుట్‌‌బాల్ క్లబ్ రష్యన్ యజమాని రోమన్ అబ్రమోవిచ్ ప్రపంచాన్ని నివ్వెరపరిచే నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్ బాధితుల కోసం తన ప్రీమియర్ క్లబ్‌ను అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉక్రెయిన్ యుద్ధ బాధితులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.


2003లో చెల్సియా క్లబ్‌‌ను కొనుగోలు చేసిన ఈ బిలియనీర్.. ఉత్తమ ప్రయోజనం కోసం ఈ క్లబ్‌ను విక్రయించాలని భావిస్తున్నట్టు చెప్పాడు. క్లబ్ నియంత్రణను ట్రస్టీలకు అప్పగిస్తున్నట్టు ప్రకటించిన కొన్ని రోజులకే అబ్రమోవిచ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. తానెప్పుడూ క్లబ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటానని పేర్కొన్నాడు.


ప్రస్తుత పరిస్థితిలో క్లబ్, అభిమానులు, ఉద్యోగులు, క్లబ్ స్పాన్సర్లు, భాగస్వాములకు ఇది మేలు చేస్తుందన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రోమన్ చెప్పాడు. అబ్రమోవిచ్ కాలంలో చెల్సియా క్లబ్ 19 మేజర్ టోర్నీలను గెలుచుకుంది. ఇందులో తొలి రెండు చాంపియన్ లీగులతోపాటు ఐదు ప్రీమియర్ లీగ్ టైటిళ్లు కూడా ఉన్నాయి. అయితే, రష్యా ఇప్పుడు పొరుగు దేశమైన ఉక్రెయిన్‌పై దాడికి తెగబడడంతో 55 ఏళ్ల రోమన్ ఈ క్లబ్‌తో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Updated Date - 2022-03-03T23:18:24+05:30 IST