రోల్డ్‌ గోల్డ్‌ ‘చిట్టీ’.. చిరు వ్యాపారం చేసే మహిళలే టార్గెట్‌!

ABN , First Publish Date - 2021-04-16T18:29:45+05:30 IST

మెడలో దట్టమైన గొలుసు, చేతికి బ్రాస్‌లెట్స్‌, వేళ్లకు ఉంగరాలు, జేబులో ఎప్పుడూ

రోల్డ్‌ గోల్డ్‌ ‘చిట్టీ’.. చిరు వ్యాపారం చేసే మహిళలే టార్గెట్‌!

  • రుణం ఇస్తానంటూ బురిడీ
  • రోల్డ్‌ గోల్డ్‌ ఇచ్చి అసలు బంగారం చోరీ
  • ఆటకట్టించిన సైబరాబాద్‌ పోలీసులు

మెడలో దట్టమైన గొలుసు, చేతికి బ్రాస్‌లెట్స్‌, వేళ్లకు ఉంగరాలు, జేబులో ఎప్పుడూ రూ. 10 వేలకు పైగా డబ్బు కనిపించేలా డాబు దర్పం ప్రదర్శిస్తాడు. బైక్‌పై తిరుగుతూ నగర శివారు ప్రాంతాల్లో పండ్లు, పూలు, ఇతర చిరు వ్యాపారాలు చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుంటాడు. వారితో  పరిచయం పెంచుకుని వ్యాపారానికి ఫైనాన్స్‌ ఇస్తానంటూ నమ్మిస్తాడు. తన మాటలతో ఏమార్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కొట్టేస్తాడు. వాటిని తాకట్టు పెట్టి జల్సాలు చేస్తాడు. సైబరాబాద్‌ పోలీసులు అతడి ఆట కట్టించారు. కటకటాల్లోకి నెట్టారు.


హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాలలో చిరు వ్యాపారాలు చేసే మహిళలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం కేశవరానికి చెందిన మేడిశెట్టి చిట్టిబాబు అలియాస్‌ నాని అలియాస్‌ చిట్టి పదో తరగతి వరకు చదివాడు. ఒక ఫార్మా కంపెనీలో వర్కర్‌గా చేరాడు. జల్సాలు, వ్యసనాలకు అలవాటుపడిన చిట్టిబాబు సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు.


రోల్డ్‌ గోల్డ్‌ ధరించి బురిడీ..

విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో తిరుగుతూ పూలు, పండ్లు, కల్లుదుకాణాలు, ఫ్యాన్సీ దుకాణాలు నడుపుతున్న ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసేవాడు చిట్టిబాబు. ఒంటి నిండా రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాలు ధరించేవాడు. జేబులో రూ.10 వేలకు తగ్గకుండా డబ్బులు కనిపించేలా పెట్టుకునేవాడు. బైక్‌పై ఆయా దుకాణాలు నడుపుతున్న మహిళల వద్దకు వెళ్లేవాడు. మెడలో బంగారు పుస్తె ల తాడు, చెవి కమ్మలు, ఇతర బంగారు ఆభరణాలు ఉన్న మహిళలను ఎంచుకునేవాడు. వారి వద్ద వస్తువులు కొంటూ తాను ఫైనాన్స్‌ వ్యాపారినని పరిచయం పెంచుకునేవాడు. రోజువారి చిట్టీ కింద రుణాలు ఇస్తాననేవాడు. అవసరమైతే 10 వేలు రుణం ఇచ్చేవాడు.


బంగారం కొట్టేసేవాడు ఇలా

మహిళల మెడలో ఉన్న బంగారంపై కన్నేసిన చిట్టిబాబు వాటిని కొట్టేయడానికి ప్లాన్‌ చేసేవాడు. ‘‘నా వద్ద కొత్త కొత్త డిజైన్స్‌లో చేయించిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. మీ మెడలో ఉన్న బంగారం పాత మోడల్‌. దాన్ని నాకు ఇస్తే ఒక్కరోజులోనే డిజైన్‌ మార్పించి, కొత్త డిజైన్‌ తయారు చేయించి ఇస్తాను’ అంటూ నమ్మించేవాడు. ‘వీుకు అనుమానం ఉంటే నా మెడలో ఉన్న బంగారం తీసుకోండి. మీ బంగారం తెచ్చి ఇచ్చిన తర్వాత నా బంగారు గొలుసు తీసుకెళ్తాను’ అని చెప్పి రోల్డ్‌గోల్డ్‌ వారికి ఇచ్చి వారి వద్ద ఉన్న అసలైన బంగారం తీసుకెళ్లి మాయమయ్యేవాడు. దొంగిలించిన బంగారం కుదువబెట్టుకుని వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు.


రెండు రాష్ట్రాల్లో 18 కేసులు..

2014 నుంచి ఇలాంటి ఘరానా మోసాలకు పాల్పడుతున్న చిట్టిబాబును 2020 ఆగస్టులో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసులు అరెస్టు చేసి రిమాండు చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లిలో ఒకసారి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన చిట్టిబాబు తన మకాంను 2021 జనవరిలో హైదరాబాద్‌కు మార్చాడు. తునిలో ఒక వ్యక్తిని తన మాటలతో నమ్మించి కొట్టేసిన బైక్‌తో హైదరాబాద్‌ చేరుకున్నాడు. రాజేంద్రనగర్‌ పరిధిలోని బుద్వేల్‌లో ఉంటూ నకిలీ నంబర్‌ ప్లేట్‌తో తిరుగుతూ అదే తరహా మోసాలకు పాల్పడుతున్నాడు. 


సైబరాబాద్‌ పరిధిలోని నార్సింగ్‌, రాజేంద్రనగర్‌, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 4 కేసులు నమోదయ్యాయి. సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో క్రైమ్స్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీసీఎస్‌ శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వాసు, నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ తన సిబ్బందితో రంగంలోకి దిగారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించి గట్టినిఘా ఏర్పాటు చేసి నార్సింగ్‌ పరిధిలోని జనవాడలో ఘరానా మోసగాడి ఆటకట్టించారు. నిందితుడిని విచారించగా ఏపీ, తెలంగాణలో మొత్తం 18 కేసులు నమోదైనట్లు తేలింది. అరెస్టు చేసి అతని నుంచి 10.4 తులాల బంగారం, బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లో పీటీ వారెంట్‌పై నిందితున్ని విశాఖ పోలీసులకు అప్పగించనున్నట్లు డీసీపీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి ఆటకట్టించిన సీసీఎస్‌, నార్సింగ్‌ పోలీసులను డీసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు. సీపీ ఆదేశాల మేరకు రివార్డులు అందజేశారు.

Updated Date - 2021-04-16T18:29:45+05:30 IST