మరో 24 గంటల్లో టీ20, టెస్టు జట్ల ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్!

ABN , First Publish Date - 2021-11-09T23:54:39+05:30 IST

న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న టీ20, టెస్టు సిరీస్ కోసం మరో 24 గంటల్లో బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది

మరో 24 గంటల్లో టీ20, టెస్టు జట్ల ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్!

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న టీ20, టెస్టు సిరీస్ కోసం మరో 24 గంటల్లో బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. టీ20 కెప్టెన్సీని రోహిత్ శర్మ అందుకోబోతున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కివీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అతడే సారథ్యం వహిస్తాడని చెబుతున్నారు.


విశ్రాంతి కారణంగా న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్టుకు కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఆ టెస్టుకు బాధ్యతలను కూడా రోహిత్ చూసుకుంటాడని తెలుస్తోంది. అయితే, రెండో టెస్టుకు మాత్రం కోహ్లీ అందుబాటులో ఉంటాడని, ఆ టెస్టుకు అతడే నాయకత్వం వహిస్తాడని చెబుతున్నారు.  


జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీతోపాటు కోహ్లీ కూడా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానాన్ని హర్షల్ పటేల్‌తో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఫామ్ కోల్పోయి తంటాలు పడిన రహానేకు మరో చాన్స్ దక్కొచ్చు. టీ20 సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం ఉంది. 


టీ20 ప్రపంచకప్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్‌కు టీ20 ప్రధాన జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో నమీబియాతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన రాహుల్ చాహర్‌ ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా 30 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, యుజ్వేంద్ర చాహల్‌ పునరాగమనంపై ఎలాంటి వార్తలు లేకపోవడంతో రాహుల్‌ స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు.


న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఈ నెల 17న ప్రారంభమవుతుంది. జైపూర్, రాంచీ, కోల్‌కతాలో మ్యాచ్‌లు జరుగుతాయి. టెస్టు సిరీస్ 25 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్టుకు కాన్పూరు, రెండో టెస్టుకు ముంబై ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 

Updated Date - 2021-11-09T23:54:39+05:30 IST