రోహిత్‌శర్మ ఖాతాలో మరో రికార్డు!

ABN , First Publish Date - 2021-03-05T23:13:23+05:30 IST

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఇప్పటికే పలు రికార్డులను

రోహిత్‌శర్మ ఖాతాలో మరో రికార్డు!

అహ్మదాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఇప్పటికే పలు రికార్డులను తన పేరుపై లిఖించుకున్న ఈ స్వాష్‌బక్లింగ్ ఓపెనర్ ఇంగ్లండ్‌తో నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో మరో ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన రోహిత్.. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో 1000 పరుగులు సాధించిన తొలి ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 948 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ 848 పరుగుతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు డొమినిక్ సిబ్లీ (841), టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ (810) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 


ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ తరపున అజింక్య రహానే అత్యధిక పరుగులు (1095) చేయగా, రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. భారత జట్టులో మిగతా ఎవరూ 1000 పరుగులు మార్కును చేరుకోలేకపోయారు. ఇక, టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన తొలి ఆసియా ఆటగాడిగానూ రోహిత్ రికార్డు సృష్టించాడు. కేవలం 17 ఇన్నింగ్స్‌లలోనే రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ రికార్డును అధిగమించాడు. మయాంక్ 19  ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు పూర్తి చేయగా, రోహిర్ రెండు ఇన్సింగ్స్‌ల ముందే ఆ ఘనత అందుకున్నాడు. 


ఈ జాబితాలో ఓవరాల్‌గా రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు హెర్బెర్ట్ సట్‌క్లిఫ్ 13 ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకోగా, లెన్ హటన్ 16 ఇన్సింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌తో కలిసి రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు.  

Updated Date - 2021-03-05T23:13:23+05:30 IST