ఖేల్‌రత్నకు రోహిత్‌

ABN , First Publish Date - 2020-05-31T09:03:16+05:30 IST

హిట్‌మ్యాన్‌గా ఖ్యాతికెక్కిన టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను క్రీడల్లో అత్యున్నతమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి భారత....

ఖేల్‌రత్నకు రోహిత్‌

నీరజ్‌ చోప్రా కూడా.. 

అర్జునకు ధవన్‌, ఇషాంత్‌, దీప్తి పేర్లు సిఫారసు

న్యూఢిల్లీ: హిట్‌మ్యాన్‌గా ఖ్యాతికెక్కిన టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను క్రీడల్లో అత్యున్నతమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) నామినేట్‌ చేసింది. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌, స్పీడ్‌స్టర్‌ ఇషాంత్‌ శర్మతోపాటు మహిళా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ పేర్లను అర్జున అవార్డుకు బోర్డు సిఫారసు చేసింది. 33 ఏళ్ల రోహిత్‌ గతేడాది వన్డే ప్రపంచక్‌పలో ఏకంగా ఐదు శతకాలు నమోదు చేసి  విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా రికార్డుకెక్కిన రోహిత్‌.. ఇప్పటిదాకా 224 వన్డేలాడి 9115 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలున్నాయి. 32 టెస్టుల్లో ఆరు సెంచరీలతో కలిపి 2141 రన్స్‌ చేసిన రోహిత్‌.. 108 టీ20లాడి 4 శతకాలతో 2773 రన్స్‌ కొట్టాడు. ‘అంకితభావం, మెరుగైన నాయకత్వ లక్షణాలు, అంతకుమించి అద్భుత ప్రతిభ కలిగిన రోహిత్‌.. ఖేల్‌రత్న అందుకునేందుకు అన్ని విధాలా అర్హుడని భావిస్తున్నా’ అని బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ఇక.. 34 ఏళ్ల ధవన్‌ 2018లో మహిళా క్రికెటర్‌ స్మృతి మంథానతో కలిసి అర్జునకు నామినేట్‌ అయినా.. అవార్డు మాత్రం దక్కించుకోలేకపోయాడు. మరోసారి అతని పేరును సిఫారసు చేయడంతో ఈసారి కచ్చితంగా పురస్కారం వస్తుందన్న ఆశాభావంతో ధవన్‌ ఉన్నాడు.


ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో వరుసగా రెండుసార్లు గోల్డెన్‌ బ్యాట్‌ను అందుకున్న గబ్బర్‌.. అరంగేట్ర టెస్టులో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. 136 వన్డేల్లో 5688 (17 సెంచరీలు) పరుగులు చేసిన ధవన్‌.. 34 టెస్టులాడి 2315 రన్స్‌, 61 టీ20ల్లో 1588 రన్స్‌ బాదాడు. సుదీర్ఘకాలంగా టెస్టుల్లో రాణిస్తున్న 31 ఏళ్ల ఇషాంత్‌.. ఉపఖండం వెలుపల అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌గా ఘనత సాధించాడు. అతను 97 టెస్టులాడి 297 వికెట్లు పడగొట్టాడు. 54 వన్డేలు, 48 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించిన 24 ఏళ్ల దీప్తి ఆల్‌రౌండర్‌గా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. 188 రన్స్‌తో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి రికార్డుల్లో కొనసాగుతోంది. రెండు ఫార్మాట్లలో కలిపి 1840 రన్స్‌ చేసిన దీప్తి.. 117 వికెట్లు తీసింది.  


అథ్లెటిక్స్‌ నుంచి ఒక్కడే..

స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాను ఖేల్‌రత్న పురస్కారానికి జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎ్‌ఫఐ) సిఫారసు చేసింది. 22 ఏళ్ల చోప్రా ఈ అవార్డుకు నామినేట్‌ అవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. 2018లో కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన నీరజ్‌.. అదే ఏడాది అర్జున అవార్దు అందుకున్నాడు. 

Updated Date - 2020-05-31T09:03:16+05:30 IST