గాయం గొడవపై నోరు విప్పిన రోహిత్!

ABN , First Publish Date - 2020-11-21T23:26:12+05:30 IST

ఐపీఎల్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గాయపడటం క్రీడాలోకంలో పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటన జరిగిన రెండు మూడ్రోజుల్లోనే రోహిత్ మళ్లీ మైదానంలో అడుగు పెట్టాడు.

గాయం గొడవపై నోరు విప్పిన రోహిత్!

బెంగళూరు: ఐపీఎల్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గాయపడటం క్రీడాలోకంలో పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటన జరిగిన రెండు మూడ్రోజుల్లోనే రోహిత్ మళ్లీ మైదానంలో అడుగు పెట్టాడు. అయితే అప్పటికే ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే భారత జట్టు ఎంపిక జరిగిపోయింది. ఆ జట్టులో రోహిత్ పేరు లేకపోవడంతో కల్లోలం రేగింది.  గాయం కారణంగా రోహిత్‌ను పక్కన పెట్టినట్లయితే అతను ఐపీఎల్ ఎలా ఆడగలడని అభిమానులు ప్రశ్నించారు. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఈ విషయంలో బీసీసీఐ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత రోహిత్‌ను టెస్టు జట్టులో చేరుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో తొలిసారి ఈ వివాదంపై రోహిత్ నోరు విప్పాడు. తాను బీసీసీఐ, ముంబై జట్టుతో టచ్‌లోనే ఉన్నానని, మిగతా వాళ్లంతా ఏం మాట్లాడుకుంటున్నారో తనకు తెలియదని రోహిత్ వెల్లడించాడు. 



పొట్టి ఫార్మాట్ కాబట్టి గాయం అయిన తర్వాత కూడా ఆడగలననే నమ్మకం తనకుందని, జట్టుతో అదే చెప్పానని, ఆ తర్వాత ఆటపైనే దృష్టి పెట్టానని చెప్పాడు. ప్రస్తుతం తను దాదాపు కోలుకున్నానని, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నానని వివరించాడు. సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్ ఆడటానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, అందుకోసమే ఎన్సీఏకు వచ్చానని పేర్కొన్నాడు. తన గాయం విషయంలో ఎవరెన్ని మాటలు అన్నా తను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశాడు. తాను ఆడగలనా? లేదా? అనే విషయంపైనే దృష్టి పెడతానని, మిగతావి అంత ఇంపార్టెంట్ కాదని తేల్చిచెప్పాడు.

Updated Date - 2020-11-21T23:26:12+05:30 IST