నేటి నుంచి రోహిణికార్తె

ABN , First Publish Date - 2022-05-25T06:18:17+05:30 IST

వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. బుధవారం నుంచి రోహిణి కార్తె మొదలు కావడంతో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్నాయి. రోహిణి రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. అకాల వర్షాలతో వాతావరణం చల్లబడినట్లు కనిపించినా వేడి, ఉక్కపోతతో సతమతమవుతున్నా రు.

నేటి నుంచి రోహిణికార్తె

-  మండుతున్న ఎండలు 

- దుక్కులు దున్నుతున్న రైతులు 

 వానాకాలం సాగు లక్ష్యం 2.44 లక్షల ఎకరాలు

- ఆయిల్‌పాంపై ఆసక్తి 


(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) 

వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.  బుధవారం నుంచి రోహిణి కార్తె మొదలు కావడంతో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్నాయి. రోహిణి రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. అకాల వర్షాలతో వాతావరణం చల్లబడినట్లు కనిపించినా వేడి, ఉక్కపోతతో సతమతమవుతున్నా రు. జిల్లాలో మేలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుస్తున్నాయి. రోహిణి కార్తెతో కొంత వాతావరణం చల్లబడాల్సి ఉన్నా ఎండల జోరు మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుంటూనే వ్యవసాయానికి కావాల్సిన విత్తనా లు, ఎరువులు, సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు దుక్కులు దున్నుకుంటున్నారు. నారు మడులను సిద్ధం చేసుకునే పనుల్లో నిమగ్నమ య్యారు. రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టడానికి  పల్లెల్లో దళారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. విత్తనాల కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నకిలీ గుర్తింపు తదితర అంశాలపై  టాస్క్‌ఫోర్స్‌, పోలీసు బృందాలు ప్రచారం చేస్తున్నాయి. వాతావరణ శాఖ ఈ సారి  వర్షాలు సకాలంలో ఉంటాయని చెప్పడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు జిల్లాలో కాళేశ్వరం, ఎల్లంపల్లి జలాలతో చెరువుల్లో నీళ్లు ఉండడం, భూగర్భజలాలు పెరగడంతో ఇబ్బందులు ఉండవని రైతులు భావిస్తున్నారు. మరోవైపు వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసింది.  

కనుమరుగైన రోహిణీకార్తె సంబరం

రోహిణీ కార్తె వచ్చిందంటే సంప్రదాయ బద్ధంగా రైతులు చేసే సంబరాలు కనుమరుగవుతున్నాయి.  ఒకప్పుడు రోహిణీ కార్తెకు వాతావరణమంతా చల్లబడి మబ్బులు కమ్ముకునేవని.  ఎండ వేడితో  దుక్కుల తోనే సరిపెడుతున్నారు. రోహిణీకార్తెకు చిన్నపాటి రైతులు కూడా పెద్ద పండుగలా  జరుపుకునే వారు. ఇప్పుడు రోహిణీకార్తె వచ్చినా సిరిసిల్లకు కూలీ పనులకు పోతున్నారు. ఆరేడు ఎకరాలు ఉన్న వారు కూడా ఊరువదిలి పట్టణాల్లో కూలీనాలి చేసుకునే పరిస్థితి. కార్తె కార్తెకు తీరొక్క విత్తనాలు వేసేవాళ్లు. ఇప్పుడు కార్తెలనే పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.  

వానాకాలం సాగు లక్ష్యం 2.44 లక్షల ఎకరాలు 

జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఈసారి 2 లక్షల 44,355 ఎకరాల్లో  వివిధ పంటలు సాగు చేస్తారనే లక్ష్యంగా వ్యవసాయ శాఖ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. గత వానాకాలం సీజన్‌ కంటే ఈసారి 22 వేల ఎకరాల్లో పంట విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేశారు. ఈసారి రైతులు ఆయిల్‌పాంపై అసక్తి చూపుతున్నారు. 800 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు కానున్నట్లుగా అంచనా వేశారు. ప్రస్తుత వానాకాలం సాగు ప్రణాళికలో వరి 1,50,400 ఎకరాలు, మొక్కజొన్న 3,940, పెసర 845, కంది 5,020, పత్తి 80,900, ఇతర పంటలు 1650 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు అంచనా వేశారు. గత వానాకాలంలో 2.22 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వరి 1.45 లక్షల ఎకరాలు, పత్తి 69,225 ఎకరాల్లో  వేశారు.  వానాకాలం సాగులో జనుము, జీలుగు విత్తనాలను 65 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు 3022 క్వింటాళ్ల జీలుగు, 25 క్వింటాళ్ల జనుము, విత్తనాలను కేటాయించారు. 

 58 వేల మెట్రిక్‌ టన్నులు ఎరువులు  

వానాకాలం సాగుకు 58 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లాలో 10,870 మెట్రిక్‌టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయి. వానాకాలం సాగుకు కావాల్సిన ఎరువుల్లో యూరియా 32 వేల  మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా, డీఎపీ 5 వేల మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 6 వేల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 15 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా 7500 మెట్రిక్‌ టన్నులు, డీఎపీ 250 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 3 వేల మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 120 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి. 

రూ.259.66 కోట్ల రైతుబంధు సాయం 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2021-22లో వానాకాలం, యాసంగి సీజన్‌లో 2 లక్షల 39 వేల 491 మంది రైతులు రూ.259.66 కోట్ల రైతు బంధు సాయాన్ని అందుకున్నారు. వానాకాలం సాగులో 1,17,577 మంది రైతులు రూ.129.25 కోట్లు, యాసంగిలో 1,21,914 మంది రైతులు రూ.130.41 కోట్ల సాయాన్ని అందుకున్నారు.  ప్రస్తుత వానాకాలం సాగుకు సంబంధించిన రైతు బంధు జూన్‌ మొదటి వారంలో విడుదల అవుతాయని భావిస్తున్నారు. 


Updated Date - 2022-05-25T06:18:17+05:30 IST