కరోనా సేవలకు రోబో!

ABN , First Publish Date - 2020-06-01T05:30:00+05:30 IST

కరోనా వైర్‌సతో సాగుతున్న పోరాటంలో వైద్యులు అలుపెరగని యోధుల్లా పోరాడుతున్నారు. ఇటువంటి సమయంలో వారికి రక్షణను అందించే రోబోను రూపొందించారు త్రిపుర యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హర్జీత్‌ నాథ్...

కరోనా సేవలకు రోబో!

  • కరోనా వైర్‌సతో సాగుతున్న పోరాటంలో వైద్యులు అలుపెరగని యోధుల్లా పోరాడుతున్నారు. ఇటువంటి సమయంలో వారికి రక్షణను అందించే రోబోను  రూపొందించారు త్రిపుర యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హర్జీత్‌ నాథ్‌. ఆయనకు ఈ ఆవిష్కరణ ఆలోచన ఎలా వచ్చిందంటే...


కరోనా సోకిన వారికి వైద్యసిబ్బంది నేరుగా ఆహారం, మాత్రలు, ఇతర అత్యవసర వస్తువులు అందిస్తుంటారు. ఈ క్రమంలో వారు కూడా వైర్‌సకు గురైన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే అలా జరగకుండా వివిధ దేశాల్లో ‘కొవిడ్‌-19’ చికిత్సలో డాక్టర్లు రోబోల సాయం తీసుకుంటున్నారని ఒకరోజు ఆన్‌లైన్‌లో చూశారు హర్జీత్‌. ప్రాణాలను అడ్డేసి కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న యోధులను వైరస్‌ బారిన పడకుండా చూడాలనే లక్ష్యంతో ఒక రోబో తయారుచేయాలనుకున్నారు. కరోనా రోగుల వద్దకు నర్సులు వెళ్లకుండానే వారికి ఆహారం, మాత్రలు అందించేందుకు రోబోను అందుబాటులోకి తెచ్చారీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. 


రోబో పనిచేస్తుందిలా...

త్రిపుర యూనివర్సిటీలో ‘కెమికల్‌ అండ్‌ పాలిమర్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌’లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అయిన హర్జీత్‌ అందరిలా ప్రభుత్వానికి విరాళం ఇవ్వలేదు. తను చేసే సాయం వైద్యుల ప్రాణాలు నిలిపేలా ఉండాలనుకున్నారు. అందుబాటులో ఉన్న విడిభాగాలు, మూడు మోటార్లు, రెండు రీచార్జ్‌ చేసుకొనే వీలున్న లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీలు, ట్రాన్స్‌మీటర్‌, రిసీవర్‌, యూఎ్‌సబీ పరికరంతో రోబోకు రూపం తీసుకొచ్చారు హర్జీత్‌. దానికి ‘కొవిడ్‌-19 వార్‌బోట్‌’ అని పేరు పెట్టారు.ఇందులో అమర్చిన వైఫై నియంత్రణలో ఉండే కెమెరా, మైక్రోఫోన్‌, స్పీకర్‌... వైద్యులు, నర్సులు, కరోనా రోగులు నేరుగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉపయోగపడతాయి. దీనిపై 10-15 కిలోల బరువు ఉంచవచ్చు. 15-20 మీటర్ల పరిధిలోనే రోబో పనిచేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 135 వాట్స్‌. ఇందుకుగాను ఆయన వెచ్చించింది రూ. 25వేలు మాత్రమే. 


పేటెంట్‌ కోసం 

‘‘ఈ రోబోలోని పరిజ్ఞానంతో వైద్యులు, నర్సులు తరచుగా పేషెంట్లను దగ్గరకు వెళ్లి చూడడం తగ్గుతుంది. అంతేగాక తమ ఫోన్‌, కంప్యూటర్‌లో డాక్టర్లు, నర్సుల రోగులతో నేరుగా మాట్లాడవచ్చు. పేషెంట్లు డాక్టర్లు చెప్పేది విని అందుకు తగ్గట్టుగా ఉంటే సరి. ఈ రోబో ‘కొవిడ్‌-19’ చికిత్స కేంద్రాల్లో సేవలు అందిస్తున్న వైద్యసిబ్బందికి ఎంతో ఉపయోగపడతుందని భావిస్తున్నా. నాభార్య కూడా ఈ ప్రాజెక్ట్‌లో నాకు సాయం అందించింది. అయితే నాకు ఎదురైన సమస్య ఏమంటే మా రాష్ట్రంలో మేలైన గ్యాడ్జెట్స్‌ లభించకపోవడంతో స్థానికంగా దొరికే విడిభాగాల మీదనే ఆధారపడాల్సిరావడం. ప్రభుత్వానికి నా ఆవిష్కరణ గురించి మెయిల్‌ చేశాను. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈలోగా పేటెంట్‌ కోసం దరఖాస్తు చేయాలనే ఆలోచనలో ఉన్నాను’’ అంటున్న హర్జీత్‌ ప్రస్తుతం వ్యర్థాలతో నీటిని శుద్ధిచేయడం మీద పరిశోధన చేస్తున్నారు.


Updated Date - 2020-06-01T05:30:00+05:30 IST