కీసర : ఒకే రోజు రెండు ఆలయాల్లో చోరీ

ABN , First Publish Date - 2021-05-13T15:55:46+05:30 IST

ఒకే రోజు రెండు ఆలయాల్లో చోరీకి గురైన ఘటన

కీసర : ఒకే రోజు రెండు ఆలయాల్లో చోరీ

  • హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు
  • నగదు, అమ్మవారి మంగళ సూత్రం మాయం

హైదరాబాద్/కీసర రూరల్‌ : ఒకే రోజు రెండు ఆలయాల్లో చోరీకి గురైన ఘటన బుధవారం కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో  జరిగింది. ఆలయ నిర్వహకుల సమాచారం మేరకు.. కీసర మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయంలో  మంగళవారం రాత్రి  దొంగలు ఆలయంలోకి  ప్రవేశించారు. అమ్మవారి మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రంతో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు బుధవారం ఉదయం ఆలయ నిర్వాహకులు వచ్చారు. ప్రధాన ద్వారం తాళం వేసి ఉండగా, ఆల్ట్రప్‌(గొల్లెం) కోసేసి ఉంది. 


దేవాలయంలోకి వెళ్లి పరిశీలించగా సీసీ కెమెరాల వీడియో పుటేజీ రికార్డయ్యే హార్డ్‌ డిస్క్‌ను తొలగించి తీసుకెళ్లారు. దీంతో నిర్వాహకులు మరికొంత మందితో కలిసి, ఆలయ పరిసరాల్లో వెతకగా ఆలయం వెనకాల ఉన్న తోటలో హుండీ పడి ఉంది. హుండీని పగులగొట్టి అందులోని దాదాపు  4వేల నగదును ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.  నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయంలోనూ చోరీ జరిగినట్లు గ్రామస్థులు వెల్లడించారు. దాదాపు రూ.16వేలు దోచుకెళ్లారని తెలిపారు.

Updated Date - 2021-05-13T15:55:46+05:30 IST