పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ

ABN , First Publish Date - 2020-07-08T11:11:49+05:30 IST

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో నియోజకవర్గంలో ఎమ్మెల్యేతోపాటు స్థానిక వైసీపీ నాయకులు దోపిడీకి తెగబడ్డారని టీడీపీ నాయకులు దొడ్డా వెంకట

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ

దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు


కనిగిరి, జూలై 7 : పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో నియోజకవర్గంలో ఎమ్మెల్యేతోపాటు స్థానిక వైసీపీ నాయకులు దోపిడీకి తెగబడ్డారని టీడీపీ నాయకులు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, రాచమల్ల శ్రీనివాసులరెడ్డిలు ఆరోపించారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో జూమ్‌ యాప్‌ ద్వారా ముఖాముఖీ సమావేశంలో ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కనిగిరి మండలంలో 7 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో మార్కెట్‌ ధర కంటే మూడున్నర రెట్లు అధికంగా చెల్లించి వైసీపీ నేతలు భూ దోపిడీకి పాల్పడటం వారి అవినీతికి నిదర్శమన్నారు. సీఎ్‌సపురంలో 162/1, 162/2 సర్వే నెంబర్లలో 64 ఎకరాల్లో 1200 మందికి ప్లాట్లు ఇచ్చేందుకు భూమిని చదును చేసినట్లు తెలిపారు.


ఆ భూమి పశువుల బీడు కావడంతో స్థానికులు కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చినప్పటికీ వాటిని వైసీపీ నాయకులు బేఖాతరు చేస్తూ ప్లాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. వెలిగండ్ల మండలంలో గణే షుని కండ్రికలో పదేళ్ల క్రితం 10 మంది ఎస్సీలకు భూమిని సాగు చేసుకొని జీవించేందుకు పట్టాలు ఇచ్చారన్నారు. వారిలో నలుగురు టీడీపీ సానుభూతిపరులనే ఉద్దేశంతో వారి భూముల్లో మాత్రమే ప్లాట్లు పేరుతో దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. రామగోపాలపురం, రామలింగాపురం గ్రామాల్లో శ్మశాన స్థలాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారని తెలిపారు. కనిగిరి పట్టణానికి సమీపంలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్‌ గృహకల్ప పథకం కింద 900 మందికి జీప్లస్‌ త్రి నిర్మాణాలు కట్టించి ఇచ్చామని, వాటిని లబ్ధిదారులకు కేటాయించారని వివరించారు.


నియోజకవర్గంలో వైసీపీ నాయకులు భూదందా ప్రజలకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బొబ్బూరి రమేష్‌, షేక్‌ అబ్దుల్లా, ఇంద్రభూపాల్‌రెడ్డి, బ్రహ్మం గౌడ్‌, చిన్నపిచ్చయ్య, అహ్మద్‌, యోహాన్‌, ఇమాం, జంషీర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-08T11:11:49+05:30 IST