డెంగ్యూ పేరిట దోపిడీ!

ABN , First Publish Date - 2022-09-24T05:02:47+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ దోపిడీకి పాల్పడుతున్నాయి. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్‌ వ్యాధులు ప్రబలాయి. చాలా మంది జ్వరాలతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రుల నిర్వాహకులు అధిక మొత్తంలో ఫీజులతో పాటు డెంగ్యూ పేరుతో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసి రోగుల వద్ద రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు.

డెంగ్యూ పేరిట దోపిడీ!

- రోగులను పిండేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు
- జ్వరమని వెళ్తే లేనిపోని ఆరోగ్య పరీక్షలు
- చికిత్స, మందుల కోసం రూ.వేలల్లో వసూలు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

- కొత్తూరు మండలానికి చెందిన ఓ యువకుడు ఇటీవల జ్వరంతో శ్రీకాకుళం డేఅండ్‌నైట్‌ జంక్షన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అతనికి రక్త పరీక్ష, యూరిన్‌ పరీక్ష అంటూ ఆస్పత్రి సిబ్బంది లేనిపోని టెస్టులు చేశారు. డెంగ్యూ లక్షణాలు ఉన్నాయని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. వైద్యానికి రూ.10 వేల వరకూ వసూలు చేశారు. చికిత్సకు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తించాలి. కానీ ఈ నిబంధన ఆస్పత్రిలో అమలు కాలేదు.

- ఎచ్చెర్లకు చెందిన ఓ విద్యార్థి కొద్దిరోజుల కిందట జ్వరంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యుడి వద్దకు వెళ్లాడు. రక్త పరీక్షతో మరికొన్ని టెస్టులు చేయించాలని వైద్యుడు చెప్పాడు. ఇందుకోసం ఆస్పత్రి ల్యాబ్‌ సిబ్బంది రూ.5వేలు వసూలు చేశారు. డెంగ్యూ జ్వరం కావచ్చని, ప్లేట్‌ లెట్స్‌ అవసరం పడతాయంటూ భయపెట్టి ఆస్పత్రిలో చేర్చుకున్నారు. సిలైన్స్‌, మందులతోనే వైద్యం చేసి.. రూ.15వేల వరకు వసూలు చేశారు.  

..ఇలా శ్రీకాకుళం నగరంలోనే కాకుండా జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ దోపిడీకి పాల్పడుతున్నాయి. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్‌ వ్యాధులు ప్రబలాయి. చాలా మంది జ్వరాలతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రుల నిర్వాహకులు అధిక మొత్తంలో ఫీజులతో పాటు డెంగ్యూ పేరుతో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసి రోగుల వద్ద రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా, ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌తోపాటు మరిన్ని పరీక్షలు చేయించుకురావాలని వైద్యులు సూచిస్తున్నారు. డెంగ్యూ పరీక్షకు రూ.750 నుంచి రూ.1500, మలేరియా, టైఫాయిడ్‌ పరీక్షకు రూ.400 నుంచి రూ. 800 వరకు వసూలు చేస్తున్నారు. మిగిలిన పరీక్షలకు మరో రూ.1500 లాగేస్తున్నారు. మొత్తంగా జ్వర బాధితులకు పరీక్షలకే సుమారు రూ.4 వేల నుంచి 5వేల వరకు ఖర్చవుతోంది. డాక్టర్‌ ఫీజు, మందులు, ఇతర ఖర్చులకు మరో రూ.5వేల భారం పడుతోంది.  

- అమలు కాని ఆరోగ్యశ్రీ నిబంధనలు
వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటిన వ్యాధులను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. కానీ, క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడంలేదు. వాస్తవంగా నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉచితంగా వైద్యసేవలు అందించాలి. అతికొద్ది ఆసుపత్రిలు మాత్రమే ఈ సేవలు అందిస్తుండగా, అధిక శాతం రోగుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నాయి. డెంగ్యూ అని పేర్కొంటే తప్పనిసరిగా ఉచిత సేవలు అందించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో డెంగ్యూ లైక్‌ ఫీవర్‌, వైరల్‌ ఫీవర్‌గా రిపోర్టుల్లో పేర్కొంటున్నాయి. రోగులు, వారి బంధువులకు మాత్రం డెంగ్యూగా చెబుతూనే ఫీజు వసూలు చేస్తున్నాయి. జ్వర బాధితులకు ప్లేట్‌లెట్స్‌ తగ్గుతున్నాయని, ఐదారు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని సిబ్బంది చెబుతున్నారు. ఐదు నుంచి పది రోజులపాటు ఇన్‌పేషెంట్‌లుగా చేర్చుకొని రోజుకి రూ.5వేల నుంచి రూ. 30వేల వరకు రోగుల నుంచి పిండేస్తున్నారు. వాస్తవానికి పరీక్షల ధరలు తెలుపుతూ ల్యాబ్‌ల్లో బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ, చాలా ల్యాబ్‌ల్లో ఇవి కనిపించడం లేదు.

బ్లడ్‌ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ
రోగుల బంధువులు బ్లడ్‌ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.  శ్రీకాకుళం నగరంలో ఐదు బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రక్తం కోసం ఎక్కువగా రోగుల కుటుంబ సభ్యులు బ్లడ్‌ బ్యాంకులకు వస్తుంటారు. కానీ, కొద్దిరోజులుగా కేవలం ప్లేట్‌లెట్స్‌ కోసం ఒక్కో బ్లడ్‌ బ్యాంకుకు సుమారు 20మంది వరకు వస్తున్నారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. డెంగ్యూ సోకిన వ్యక్తికి ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోతే కనీసం మూడు నుంచి నాలుగు యూనిట్లు ఎక్కించాల్సి వస్తుంది. ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.10వేల వరకు పలుకుతోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని రోగులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. అంతటా మంచి వైద్యం అందిస్తున్నాం. డెంగ్యూ బాధితుల్లో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య 50 వేల కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఎక్కించాలి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎలీసా డెంగ్యూ పరీక్షలు చేయకూడదు. ఎవరైనా నిర్వహించినట్లు ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటాం. అవసరమైతే విజిలెన్స్‌ విచారణ చేయిస్తాం.
 - డా.మీనాక్షి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి, శ్రీకాకుళం

Updated Date - 2022-09-24T05:02:47+05:30 IST