కష్టాలు తీరుస్తాం.. తలరాతలు మారుస్తాం..

ABN , First Publish Date - 2022-07-06T16:13:15+05:30 IST

దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు చలామణి అవుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది

కష్టాలు తీరుస్తాం.. తలరాతలు మారుస్తాం..

సాధువుల ముసుగులో దోపిడీ.. ఏడుగురి అరెస్టు

రూ. 8.30 లక్షలు,కౌంటింగ్‌ మిషన్లు స్వాధీనం

నిందితులు రాజస్థాన్‌లోని సిరోహికి చెందిన వారు


హైదరాబాద్‌ సిటీ/కొత్తపేట: దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు చలామణి అవుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది ప్రజలను మోసం చేస్తున్నారు. కష్టాలు తీరుస్తాం.. తలరాతలు మారుస్తాం.. దోష నివారణకు పూజలు చేస్తాం.. అంటూ రూ. లక్షలు దోచేస్తున్నారు. ఈ క్రమంలో భువనగిరికి చెందిన ఓ వ్యాపారిని మోసం చేసి రూ 37.71 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు రాచకొండ పోలీసులను ఆశ్రయించడంతో ముఠా ఆటకట్టించారు. ఏడుగురిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఎల్‌బీనగర్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌ సిరోహికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి సాధువుల పేరుతో సర్పదోష, నాగదోష నివారణ పూజలు చేస్తామంటూ అమాయకులను దోచుకుంటున్నారు.


కష్టాలను దూరం చేసి తలరాతలు మారుస్తామని నమ్మిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన సంజునాఽథ్‌, ఘోరక్‌నాథ్‌ భువనగిరికి చెందిన వ్యాపారి కొండల్‌రెడ్డిని పరిచయం చేసుకున్నారు. సర్పదోషం ఉందని.. నివారణ పూజలు చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. భయపడ్డ కొండల్‌రెడ్డి అంగీకరించడంతో వారిద్దరూ మిగతా ముఠా సభ్యులైన రామ్‌నాథ్‌, జొన్నాథ్‌, గోవింద్‌నాథ్‌, అర్జున్‌నాథ్‌తో కలిసి సర్పదోష నివారణ పూజలు చేశారు. అందుకుగాను కొండల్‌రెడ్డి వద్ద రూ. 41 వేలు తీసుకున్నారు. అప్పటినుంచి పరిచయం కొనసాగిస్తూ, ఆయనతో ఫోన్‌లో టచ్‌లో ఉంటూ వచ్చారు. కొండల్‌రెడ్డి కుటుంబసభ్యులపై కూడా చెడు ప్రభావం ఉందని, రాజస్థాన్‌లోనూ దోషనివారణ ప్రత్యేక పూజలు చేస్తున్నామని నమ్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పూజలు చేసి రూ 37.71 లక్షలు దోచుకున్నారు.


సదరు డబ్బు దశలవారీగా హవాలా ఏజెంట్ల ద్వారా చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. చివరకు వారి చేతిలో మోసపోయినట్టు గుర్తించిన కొండల్‌రెడ్డి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాలతో భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు నిందితులు రామ్‌నాథ్‌(40), సహా జొన్నాథ్‌(33), గోవింద్‌నాథ్‌ (28), అర్జున్‌నాథ్‌ (22), పూనారామ్‌ (37), వాస్నారామ్‌ (22), ప్రకాష్‌ జోటా(27)ను ఘట్‌కేసర్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. సంజునాథ్‌, ఘోరక్‌నాథ్‌, ప్రకాష్‌ ప్రజాపతి, రమేష్‌ ప్రజాపతి పరారీలో ఉన్నారు. 


మాయమాటలు నమ్మొద్దు : సీపీ మహేష్‌ భగవత్‌

సాధువుల ముసుగులో చెప్పే మాయమాటలు నమ్మొద్దని సీపీ మహే్‌షభగవత్‌ అన్నారు. దోష నివారణ పేరిట రూ. లక్షలు కాజేసిన దొంగ సాధువులపై విచారణ కొనసాగుతుందన్నారు. వీరి వల్ల మోసపోయిన బాధితులు మరికొందరు ఉండవచ్చని, సిరోహి అంతర్రాష్ట్ర ముఠా కార్యకలాపాలపై దృష్టిపెడతామని, ప్రత్యేక పోలీసు బృందాన్ని రాజస్థాన్‌కు పంపుతున్నట్టు చెప్పారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన వారు 9490617111 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, ఎస్‌ఓటీ డీసీపీ మురళీధర్‌, ఏసీపీలు వెంకట్‌రెడ్డి, వెంకటన్న నాయక్‌, ఇన్‌స్పెక్టర్‌ రాములు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T16:13:15+05:30 IST