హైదరాబాద్‌లో కలకలం.. నడుస్తూ వెళ్తున్న యువకుడిని అడ్డగించి.. రూ.8.5 లక్షలు..

ABN , First Publish Date - 2020-05-26T16:22:41+05:30 IST

మీర్‌పేట పీఎస్‌ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ యువకుడిని అడ్డగించి అతని వద్ద ఉన్న రూ. 8.5 లక్షల బ్యాగుతో ఉడాయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన అచ్చిరెడ్డి విస్తరాకులు తయారు చేసే చిన్న పరిశ్రమ నడుపుతుంటాడు.

హైదరాబాద్‌లో కలకలం.. నడుస్తూ వెళ్తున్న యువకుడిని అడ్డగించి.. రూ.8.5 లక్షలు..

మీర్‌పేటలో దారి దోపిడీ

కలెక్షన్‌ బాయ్‌ నుంచి రూ.8.5 లక్షలు కొట్టేసిన ముగ్గురు కేటుగాళ్లు

నిందితుల కోసం పోలీసుల గాలింపు 


సరూర్‌నగర్‌, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): మీర్‌పేట పీఎస్‌ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ యువకుడిని అడ్డగించి అతని వద్ద ఉన్న రూ. 8.5 లక్షల బ్యాగుతో ఉడాయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన అచ్చిరెడ్డి విస్తరాకులు తయారు చేసే చిన్న పరిశ్రమ నడుపుతుంటాడు. తయారుచేసిన విస్తరాకులను నగరంలోని వివిధ వ్యాపారులకు విక్రయిస్తుంటాడు. అందుకు సంబంధించిన డబ్బులు వసూలు చేయడానికి నెలలో రెండు, మూడు సార్లు నగరానికి వస్తుంటాడు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో గత రెండు నెలలుగా కలెక్షన్‌కు రాలేదు. నిబంధనలు సడలించడంతో సోమవారం నగరానికి వచ్చి డబ్బులు కలెక్షన్‌ చేసుకున్నారు. 


ముందుగా సూరారం, అంబర్‌పేట ప్రాంతాలకు వెళ్లిన అచ్చిరెడ్డి అక్కడ రావాల్సిన రూ. 8.5 లక్షలు వసూలు చేసుకొని బ్యాగులో పెట్టాడు. చివరగా మధ్యాహ్నం 3 గంటలకు మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గుర్రంగూడకు వెళ్లాడు. అక్కడ  రావాల్సిన రూ. 26,500లు తీసుకొని తిరిగి కోదాడకు బయల్దేరాడు. బస్సు కోసం ఎల్‌బీనగర్‌కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. గుర్రంగూడ నుంచి నాదర్‌గూల్‌ మెయిన్‌రోడ్డు వద్దకు రాగానే... గుర్తుతెలియని ముగ్గురు యువకులు తెల్లటి బైక్‌ (టీఎస్‌0806)పై వచ్చి అచ్చిరెడ్డిని అడ్డగించారు. అతని వద్ద రూ. 8.5లక్షలతో ఉన్న బ్యాగును లాక్కొని బైక్‌పై నాదర్‌గూల్‌ వైపు ఉడాయించారు. సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు రంగంలోకి దిగి నిందితులకోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2020-05-26T16:22:41+05:30 IST