Abn logo
Sep 27 2020 @ 10:51AM

వరంగల్ అర్బన్ : దుర్గామాత ఆలయంలో చోరీ

వరంగల్ అర్బన్/బచ్చన్నపేట : బచ్చన్నపేట దుర్గామాత ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయం దక్షిణం వైపున్న ఫెన్సింగ్‌ వైరును కట్‌ చేసి లోనికి చొరబడ్డారు. దుర్గామాత గుడిలోని రెండు హుండీలను పగులగొట్టి డబ్బులను ఎత్తుకెళ్లారు. ఆలయంలోకి ప్రవేశించే గేటు తాళంను పగులగొట్టి అమ్మవారి వెండి కిరీటం, ఇతర ఆభరణాలు చోరి చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అవుతుందన్న అనుమానంతో మానిటర్‌ను, మెమోరీ బాక్స్‌ను సైతం ఎత్తుకెళ్లారు. గతంలో ఇదే ఆలయంలో మూడు దఫాలుగా చోరీ జరిగింది.

దీంతో ఆలయంలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే మూడోసారి చోరీ జరిగిన సమయంలో సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఈ దఫా సీసీ కెమెరాల కంటపడకుండా దుండగులు జాగ్రత్తపడ్డారు. శనివారం ఉదయం చోరీ జరిగిన విషయాన్ని ఆలయ నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా, ఎస్‌ఐ రఘుపతి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వరంగల్‌ నుంచి క్లూస్‌టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. కాగా, ఈ ఘటన వెనుక గతంలో ఈ ఆలయంలో చోరీ చేసిన వారి హస్తం ఉంటుందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎంత సొమ్ము చోరీకి గురై ఉంటుందనే విషయంలో పోలీసులు ఆలయ నిర్వాహకులతో చర్చించి అంచనా వేస్తున్నారు.


Advertisement
Advertisement