మళ్లీ దోపిడీ!

ABN , First Publish Date - 2022-01-22T04:44:34+05:30 IST

ప్రైవేటు ఆస్పత్రుల తీరు మారడం లేదు. కొవిడ్‌ రెండు దశల్లోనూ ప్రజల్లో ఉన్న భయాన్ని సొమ్ము చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు.. తాజాగా మళ్లీ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం కరోనా మూడో దశ విజృంభిస్తుండడంతో కొవిడ్‌ వైద్యం పేరిట అదనపు మందుల భారం మోపుతున్నారు. కొవిడ్‌ బాధితులకు అవసరం లేకపోయినా.. కొన్ని అనుకూల కంపెనీలకు చెందిన మందులను ప్రిస్కప్షన్‌పై రాసేస్తున్నారు. ఇటీవల తొలగించిన మందులను సైతం సిఫారసు చేస్తూ.. అధిక మొత్తంలో దోచేస్తున్నారు.

మళ్లీ దోపిడీ!

- ప్రైవేటు ఆస్పత్రుల్లో మారని తీరు

- కొవిడ్‌ వైద్యం పేరిట అదనపు మందులు

- తొలగించిన వాటినీ సిఫారసు చేస్తున్న వైనం

- మాత్రల కోసమే రూ.1500కుపైగా ఖర్చు

- ఈసురోమంటున్న బాధితులు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి) 

ప్రైవేటు ఆస్పత్రుల తీరు మారడం లేదు. కొవిడ్‌ రెండు దశల్లోనూ ప్రజల్లో ఉన్న భయాన్ని సొమ్ము చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు.. తాజాగా మళ్లీ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం కరోనా మూడో దశ విజృంభిస్తుండడంతో కొవిడ్‌ వైద్యం పేరిట అదనపు మందుల భారం మోపుతున్నారు. కొవిడ్‌ బాధితులకు అవసరం లేకపోయినా.. కొన్ని అనుకూల కంపెనీలకు చెందిన మందులను  ప్రిస్కప్షన్‌పై రాసేస్తున్నారు. ఇటీవల తొలగించిన మందులను సైతం సిఫారసు చేస్తూ.. అధిక మొత్తంలో దోచేస్తున్నారు. 

-----------------

కొవిడ్‌ మూడో దశ వేళ.. ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీ మళ్లీ మొదలైంది. కరోనా తొలి, రెండు దశల్లో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు రక్త పరీక్షలు, మందుల పేరిట ప్రజలను దోచుకున్నాయి. ఇప్పుడు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. నాలుగు రోజులుగా 400 నుంచి 500కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రికార్డుస్థాయిలో శుక్రవారం ఒకేరోజు 1,230 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరోవైపు ఒమైక్రాన్‌ కూడా సామాజిక వ్యాప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి శ్రీకాకుళంలో ఆస్పత్రులకు తరలివస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు మందుల పేరిట మళ్లీ దోపిడీకి పాల్పడుతున్నారు. కొవిడ్‌ రెండో దశ అనంతరం ఐసీఎంఆర్‌ కొన్ని మందులను తొలగించగా.. వాటిని కూడా బాధితులకు సిఫారసు చేస్తున్నారు. ‘ఐవర్‌మెక్టిన్‌’ మాత్రలను ఇదివరకు కొవిడ్‌ బాధితులు వినియోగించేవారు. కొద్దినెలల కిందట ఐసీఎంఆర్‌ ఆ మాత్రలను కొవిడ్‌ వైద్యం నుంచి తొలగించింది. కానీ ప్రైవేటు వైద్యులు వాటిని  ఇంకా కొనసాగిస్తున్నారు. కొవిడ్‌ వైద్యంలో వైరల్‌ లోడ్‌ తగ్గించేందుకు ‘మోల్నుపిరావర్‌ క్యాప్సిల్స్‌ 200 మిల్లీగ్రాములు’ను తెగ వినియోగించేస్తున్నారు. కొవిడ్‌ వైద్యంలో ఈ ఔషధం వినియోగంపై ఓ వైపు పరిశోధనలు జరుగుతున్నాయి. కొవిడ్‌ బాధితులు వీటిని వినియోగిస్తే వాటిల్లే దీర్ఘకాలిక దుష్ప్రభావాలు, జన్యుపరమైన సమస్యలపై చర్చలు సాగుతున్నాయి. మరోవైపు మార్కెట్‌లోకి ఇవే క్యాప్సిల్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు ఈ మాత్రలను సిఫారసు చేయడంతో కొవిడ్‌ బాధితులు తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని వినియోగిస్తున్నారు. 


 అనుకూల కంపెనీల మందులే...

కరోనా వైరస్‌ వ్యాప్తి నుంచి ముప్పు లేకుండా ఉండేందుకు వైద్యులు డాక్సీసైక్లిన్‌ విత్‌ లాక్టిక్‌బాసిల్లస్‌, ఎజిత్రోమైసిన్‌ వంటి యాంటీబయోటిక్‌ మందులను బాధితులకు సిఫారసు చేస్తున్నారు. వాటితోపాటు ఐవర్‌మెక్టిన్‌, మోల్నుపిరావర్‌, పాంటాప్రజోల్‌, లివోసెట్రజన్‌ వంటివి కూడా సూచిస్తున్నారు. వీటిలో ప్రముఖ కంపెనీలకు చెందిన బ్రాండెడ్‌ మందులను ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు పెద్దగా సిఫారసు చేయడం లేదు. బ్రాండెడ్‌ ధరలతో సమానంగా ఉండే తమకు అనుకూలమైన ఇతరత్రా కంపెనీలకు చెందిన మందులను సిఫారసు చేస్తున్నారు. ఆ మందుల కంపెనీ ప్రతినిధులతో ఆర్థిక సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. పరోక్షంగా బాధితులను దోచుకుంటున్నారు. ఒక్కో కొవిడ్‌ బాధితుడు ఐదు రోజులకు వినియోగించాల్సిన మందుల కోసం రూ.1,500కుపైగా బిల్లు వేస్తున్నారు. 


 రక్తపరీక్షల పేరిట.. 

రక్త పరీక్షల పేరిట కొవిడ్‌ బాధితులను ప్రైవేటు వైద్యులు పిండేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల ల్యాబ్‌ల్లో రక్తపరీక్షల దోపిడీపై ఇప్పటికే ‘ఆంధ్రజ్యోతి’లో పలు కథనాలు వెలువడ్డాయి. ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక కొవిడ్‌ పరీక్ష కోసం నిర్దిష్ట ధర తీసుకోవాల్సి ఉండగా.. చాలా ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు చేసి.. పాజిటివ్‌ లేదా నెగిటివ్‌ అనేది నోటిమాటతోనే చెబుతున్నారు. రాతపూర్వకంగా రిపోర్టు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్‌, జేసీలు, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు  ప్రైవేటు ఆస్పత్రుల్లో పకడ్బందీగా తనిఖీలు చేపట్టాల్సి ఉంది. ఐసీఎంఆర్‌ సూచించిన మందులను కొవిడ్‌ బాధితులకు సిఫారసు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లాప్రజలు కోరుతున్నారు. 


చర్యలు తీసుకుంటాం 

కొవిడ్‌ బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యం అందజేయాలి. అవసరం లేకపోయినా కొవిడ్‌ బాధితులకు ప్రైవేటు వైద్యులు సిఫారసు చేస్తున్న మందుల విషయమై పరిశీలిస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇటీవల ఐవర్‌మెక్టిన్‌ వినియోగం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల కోసం ఉచితంగానే మెరుగైన వైద్యం అందుతోంది. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దు. అంతటా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కొవిడ్‌ పరీక్షలు చేయాలి. 

- బి.జగన్నాథరావు, డీఎంహెచ్‌వో

Updated Date - 2022-01-22T04:44:34+05:30 IST