గర్జించిన గ్రీన్‌ అంబాసిడర్లు

ABN , First Publish Date - 2022-08-03T05:31:03+05:30 IST

పెండింగ్‌ జీతాలు కోరుతూ గ్రీన్‌ అంబాసిడర్లు గర్జించారు. గత 18 నెలల నుంచి జీతాలు పెండింగ్‌లో ఉండడంతో తాడోపేడో తేల్చుకోవాలని భావించి సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.

గర్జించిన గ్రీన్‌ అంబాసిడర్లు
నిరసన వ్యక్తం చేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లు


పెండింగ్‌ జీతాలు మంజూరు చేయాలంటూ కలెక్టరేట్‌ వద్ద నిరసన
ఎన్టీఆర్‌ విగ్రహాం వద్ద మానవహారం
కలెక్టరేట్‌, ఆగస్టు 2:
పెండింగ్‌ జీతాలు కోరుతూ గ్రీన్‌ అంబాసిడర్లు గర్జించారు. గత 18 నెలల నుంచి జీతాలు పెండింగ్‌లో ఉండడంతో తాడోపేడో తేల్చుకోవాలని భావించి సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ముందుగా అనుకున్న ప్రకారం మంగళవారం భారీ సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. గేటు ముందు బైఠాయించి సమస్య పరిష్కరించే వరకూ కదిలేది లేదంటూ భీష్మించారు. తమ సమస్య పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. తొలుత సంఘ నాయకుడు టి.సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో చాలా మందికి ఆరు నెలల నుంచి 18 నెలల వరకూ జీతాలు ఇవ్వాల్సి ఉందని, పెండింగ్‌ జీతాలు మంజూరుకాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. జీతాలు పెంచుతామని చెప్పి ఇంతవరకూ పెంచిన జీతాలు ఇవ్వలేదన్నారు. రాజకీయ వేధింపులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. నిరసన సమయంలో కలెక్టరేట్‌ నుంచి ఒక్క అధికారీ బయటకు రాకపోవడంతో వారంతా స్థానికంగా ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాం వద్దకు వెళ్లి మానవహారంగా ఏర్పడ్డారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు గంటపాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని కలెక్టరేట్‌ సి.సెక్షన్‌కు చెందిన పర్యవేక్షకులు శ్రీకాంత్‌కు సమస్యను విన్నవించారు. ఆయన వచ్చి సమస్యను విన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు.


Updated Date - 2022-08-03T05:31:03+05:30 IST