రోడ్డెక్కిన బొప్పాయి రైతులు

ABN , First Publish Date - 2021-07-30T05:29:27+05:30 IST

బొప్పాయి ధరలు భారీగా తగ్గడంతో ఆగ్రహించిన రైల్వేకోడూరు నియోజకవర్గ రైతులు గురువారం పట్టణంలోని టోల్‌గేట్‌ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా

రోడ్డెక్కిన బొప్పాయి రైతులు
జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు

దళారులతో ధరలు తగ్గాయంటూ ఆగ్రహం

ప్రభుత్వానివి కల్లబొల్లి మాటలు

రైతుల వద్దకు వచ్చి కొనేది ఎప్పుడు?

జాతీయ రహదారిపై బైఠాయింపు.. స్తంభించిన ట్రాఫిక్‌

రైల్వేకోడూరు రూరల్‌, జూలై 29: బొప్పాయి ధరలు భారీగా తగ్గడంతో ఆగ్రహించిన రైల్వేకోడూరు నియోజకవర్గ రైతులు గురువారం పట్టణంలోని టోల్‌గేట్‌ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జూనలో బొప్పాయి ధర ఒక టన్ను రూ.18 వేలు ఉండేదని తెలిపారు. జూలై నాటికి రూ.13 వేలకు చేరిందని, గురువారం నాటికి రూ.8 వేలకు పడిపోయిందని అన్నారు. బొప్పాయి కాయలు రాజస్ధాన, మధ్యప్రదేశ, హర్యానాలో టన్ను రూ.30 వేలు పలుకుతోందని తెలిపారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో బొప్పాయి దళారీలు సిండికేట్‌గా ఏర్పడి ధరలను భారీగా తగ్గిస్తున్నారని ఆరోపించారు. ఎకరాకు 50 నుంచి 70 వేల రూపాయల ఖర్చు వస్తుందని తెలిపారు. కనీసం గిట్టుబాటు ధర లేకుండా కాయలు ఎలా అమ్ముకోవాలని ప్రశ్నించారు. ధరలు బాగా తగ్గిపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురువుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్దకే వచ్చి పంట కొనుగోలు చేస్తుందని కల్లబొల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కరోనా దెబ్బతో పూర్తిగా కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు దళారులతో రోడ్డున పడాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థ నశించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతులు జాతీయ రహదారిపై బైఠాయించడంతో సుమారు గంట పాటు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సమాచారం తెలుసుకున్న రైల్వేకోడూరు సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ పెద్ద ఓబన్నతో కలిసి సంఘటన స్ధలానికి వెళ్లి రైతులతో చర్చించారు. అనంతరం రైతులను, దళారులను పోలీసు స్టేషనకు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. ధర్నాలో రైతులు శ్రీనివాసులు, రెడ్డెయ్య, రాజా, సుబ్బరాయుడు, చౌదరి, జనార్ధన, మురళి, లక్ష్మి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T05:29:27+05:30 IST