రహదారుణం

ABN , First Publish Date - 2022-05-09T07:37:43+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రహదారులు నెత్తురోడుతున్నాయి. వాహనాలతో రోడ్లపై వెళ్లాలంటేనే ఇరు జిల్లాల ప్రజలు జంకుతున్నారు. ఎక్కడి నుంచి ఏ వాహనం ఢీకొంటుందోనని భయాందోళన చెందుతున్నారు.

రహదారుణం
ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృత దేహాలు

ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోట చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు

ప్రతిరోజూ సగటున మూడు చొప్పున ప్రమాదాలు, ముగ్గురు చొప్పున మృత్యువాత 

గత మూడు నెలల్లోనే 23కుపైగా ప్రమాదాలు.. 35 మందికిపైగా మృత్యువాత

మాచారెడ్డి ఘటన మరవకముందే ఎల్లారెడ్డిలో మరో సంఘటన

అన్నాసాగర్‌ తండా వద్ద జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

మరో 17 మందికి గాయాలు.. ఇందులో మరో ఇద్దరి పరిస్థితి విషమం 

మృతులంతా పిట్లం మండలం చిల్లర్గ గ్రామానికి చెందినవారు

చిల్లర్గ గ్రామంలో నెలకొన్న విషాదం 

అతివేగం.. నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం


కామారెడ్డి (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ఎల్లారెడ్డి/ నిజాంసాగర్‌/బాన్సువాడ/ పిట్లం, మే8:  ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రహదారులు నెత్తురోడుతున్నాయి. వాహనాలతో రోడ్లపై వెళ్లాలంటేనే ఇరు జిల్లాల ప్రజలు జంకుతున్నారు. ఎక్కడి నుంచి ఏ వాహనం ఢీకొంటుందోనని భయాందోళన చెందుతున్నారు. మృత్యువు ఏ మార్గంలో వస్తుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం అధికంగా ప్రాణ నష్టం జరగడం మరి ంత ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసు, రెవెన్యూ, రోడ్డు రవాణా శాఖలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ రెండు నుంచి మూడు చొప్పున ప్రమాదా లు చోటు చేసుకుంటుండడం ఈ ఘటనల్లో నలుగురు చొప్పున మృతి చెందడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో నెలరోజుల కిందట మాచారెడ్డి, ఘన్‌పూర్‌ చౌర స్తా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరవకముందే ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం చోటు చేసుకున్న సంఘటన ఉమ్మడి జిల్లా వాసులను మరింత కలచివేస్తోంది. అన్నాసాగర్‌ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొ మ్మిది మంది మృతి చెందారు. వీరంతా దగ్గరి బంధువులు కావడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. 

ప్రమాదాలకు నెలవుగా జిల్లా రహదారులు

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో పలు రహదారుల్లో రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లి, ఇందల్‌వాయి జాతీయ రహదారితో పాటు బోధన్‌, ఆర్మూర్‌ రహదారుల్లోనూ ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు ఇటీవల జరిగిన సంఘటనలే నిదర్శనం. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్‌ నుంచి మొదలుకొని సదాశివనగర్‌, దగ్గి వరకు గల జాతీయ రహదారిపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మద్నూర్‌ నుంచి నిజాంసాగర్‌ వరకు ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ రహదారిపైన సైతం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నాలుగు నెలల కిందట పెద్ద కొడప్‌గల్‌వద్ద ఆగి ఉన్న లారీని క్వాలీస్‌ ఢీకొన్న సంఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కామారెడ్డి నుంచి మాచారెడ్డి వైపు వెళ్లే రహదారిలోనూ ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెలకిందట ఘన్‌పూర్‌ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌ నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇలా ఉమ్మడి జిల్లాలో తరచూ ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మూడు నెలల కాలంలో 23 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 35 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 

అన్నాసాగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ తండా వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న టాటాఎస్‌ని బియ్యం లారీ ఢీకొనడంతో టాటాఎస్‌లోని తొమ్మిది మంది మృతి చెందారు. చౌదర్‌పల్లి లచ్చవ్వ(48), డ్రైవర్‌ సాయిలు(35) సంఘటన స్థలం వద్దనే అక్కడికక్కడే మృతి చెందగా చౌదర్‌పల్లి వీరమణి(38), చౌదర్‌పల్లి సాయవ్వ(40), అంజవ్వ(40), ఎల్లయ్య(46), ఈరమ్మ(58), పోచయ్య (46), గంగవ్వ(51) వీరిని బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పిట్లం మండలం చిల్లర్గ గ్రామానికి చెందిన చౌదర్‌పల్లి మాణిక్యం నాలుగు రోజుల కిందట మృతి చెందడంతో ఆయన భార్య చౌదర్‌పల్లి లచ్చవ్వతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మొత్తం 26 మంది టాటాఎస్‌  శనివారం సాయంత్రం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి నిద్ర చేసేందుకు వెళ్లారు. ఆదివారం ఉదయం ఎల్లారెడ్డి పట్టణంలో అంగడి ఉండ డంతో పరిసర ప్రాంతాల్లోనే వీరంతా స్థానికంగానే పర్యటించి ఓ దేవస్థానంలో సేద తీరారు. అనంతరం మధ్యా హ్నం 3 గంటల సమయంలో ఎల్లారెడ్డి పట్టణం నుంచి టాటాఎస్‌లో 26మంది చిల్లర్గ గ్రామానికి తిరుగు ప్రయా ణం అయ్యారు. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ తండా వద్ద నిజాంసాగర్‌ నుంచి ఎల్లారెడ్డికి వస్తున్న పీడీఎస్‌ బియ్యం లోడ్‌ లారీ ఢీకొంది. లారీ అతివేగంగా ఉండడం తో టాటాఎస్‌ని బలంగా ఢీకొనడం వల్ల ప్రమాదంలో టాటాఎస్‌ నుజ్జునుజ్జయింది. అదే సమయంలో లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ప్రమాదంలో టాటాఎస్‌ నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్‌ సాయిలు, లచ్చవ్వలు ముందు సీటు భాగంలో ఉండడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి సీఐ గణేష్‌, నిజాంసాగర్‌ ఎస్‌ఐ రాజు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే బాన్సూవాడ, ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా వీరమణి, సాయవ్వ ఇద్దరు మార్గమధ్యలో చనిపోయారు. ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా అంజవ్వ, నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా ఎల్లయ్య, ఈరమ్మ, పోచయ్య, గంగవ్వ మార్గమధ్యలో మృతి చెందారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో పది మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండగా ఇందులో కార్తిక్‌, వీరవ్వ, సాయిలు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను బాన్సువాడ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు.

అతి వేగమే ప్రమాదానికి కారణం


ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ తండా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటనలో అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డి వైపు పీడీఎస్‌ బియ్యం లోడ్‌తో వస్తున్న లారీ అతివేగంగా వస్తుండడం, డ్రైవర్‌కు లారీ కంట్రోల్‌ కాకపోవడంతోనే ఎదురుగా వస్తున్న టాటాఎస్‌ని ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో అధిక ప్రాణ నష్టం కావడానికి టాటాఎస్‌లో ఎక్కువ మంది ఉండడం మరో కారణమని తెలుస్తోంది. టాటాఎస్‌లో పది మంది ప్రయాణికులు కూర్చునే కెపాసిటి మాత్రమే ఉంటుంది. అలాంటి వాహనంలో డ్రైవర్‌ 26 మందిని ఎక్కించి వస్తుండగా అతివేగంతో లారీ ఢీకొనడంతో ఎక్కువగా ప్రాణ నష్టం వాటిల్లినట్లు సంఘటన స్థలాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. 

మృతులంతా బంధువులే..


ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు, క్షతగాత్రులంతా దగ్గరి బంధువులే. పిట్లం మండలం చిల్లర్గ గ్రామంలో నాలుగు రోజుల క్రితం మృతి చెందిన మాణిక్యం సోదరీమణులు సాయవ్వ, అంజవ్వలు వీరిద్దరు సైతం ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరితో పాటు చౌదర్‌పల్లి లచ్చవ్వ, వీరమణి ఇద్దరు అత్తాకోడళ్లు ఒకే కుటుంబంలోని ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం స్థానికులను మరింత కలచివేసింది. అదేవిధంగా సాయిలు సైతం దగ్గరి బంధువులు కావడం వీరి కుటుంబాల్లో విషాదం నెలకొంది. వీరంతా పిట్లం మండలం చిల్లర్గ గ్రామానికి చెందినవారు కావడం ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన జరగగానే గ్రామంలో మృతుల ఇళ్ల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.

సంఘటన స్థలం వద్ద కనిపించని పోలీసు అధికారులు

అన్నాసాగర్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంఘటన స్థలం వద్ద జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కనబడకపోవడం గమనార్హం. ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం, 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ సంఘటన స్థలానికి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చేరుకోకపోవడం.. జరిగిన సంఘటనపై ఆరా తీయకపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కేవలం ఇద్దరు ఎస్‌ఐలు మాత్రమే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనంలోని క్షతగాత్రులను బయటకు తీయడంలోనూ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం నెలకొంది. సమయానికి పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించి ఉంటే కొందరి ప్రాణాలైనా దక్కేవని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఇలాంటి పెద్ద ఘటన జరిగినపుడు స్థానిక సీఐ, డీఎస్పీలు చేరుకుని వారి ఆధ్వర్యంలో విచారణ జరపాల్సి ఉంటుంది. ప్రమాదంలో క్షతగాత్రులైన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాల్సి ఉంటుంది. కానీ అధికారులు సంఘటన స్థలం వద్ద కనిపించకపోవడం గమనార్హం. 

Read more