రహ‘దారుణం’!

ABN , First Publish Date - 2021-09-29T05:35:51+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ జిల్లాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. 12 మండలాల్లో 237 గ్రామాలు.. 3 పట్టణాల్లో అధిక ప్రభావం చూపిందని అధికారులు నిర్ధారించారు. అత్యధికంగా ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.32కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. తుఫాన్‌ ప్రభావానికి జిల్లాలో పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి.

రహ‘దారుణం’!
వంగర : కొప్పరలో కొట్టుకుపోయిన రహదారి

తుఫాన్‌ ప్రభావానికి కొట్టుకుపోయిన రహదారులు

ఆర్‌అండ్‌బీకి రూ.32కోట్ల మేర నష్టం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/వంగర)

గులాబ్‌ తుఫాన్‌ జిల్లాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. 12 మండలాల్లో 237 గ్రామాలు.. 3 పట్టణాల్లో అధిక ప్రభావం చూపిందని అధికారులు నిర్ధారించారు. అత్యధికంగా ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.32కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. తుఫాన్‌ ప్రభావానికి జిల్లాలో పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా వంగర మండలంలో మడ్డువలస రిజర్వాయర్‌ నీరు.. గ్రామాల్లోకి ప్రవహిస్తుండడంతో రహదారులు దెబ్బతిన్నాయి. కొత్తవలస-కొప్పర రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. కొత్తవలస-కొండచాకరాపల్లి గ్రామాల మధ్య రహదారి కూడా గోతులమయమైంది. శ్రీహరిపురం, బాగెమ్మపేట రహదారులు కూడా కోతకు గురికావడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోడ్లకు గండ్లు పడ్డాయి.  ఆర్‌అండ్‌బీ సీడీఆర్‌(సైక్లోన్‌ డామేజ్డ్‌ రిపేర్‌/రోడ్డు) ఏడు చోట్ల పాడయ్యాయి. ఆర్‌అండ్‌బీకి చెందిన 29 చెట్లు కూలిపోయాయి. ఆరురోడ్లలో ప్రజారవాణాకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. మూడు రోడ్లపై నీటి ప్రవాహం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం రూ.32.07కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గణాంకాలు సిద్ధం చేశారు.  పంచాయతీరాజ్‌కు చెందిన రోడ్లకు ఎంతమేర నష్టం వాటిల్లిందన్నదీ ఇంకా లెక్కతేల్చలేదు. భారీ వర్షాలు కురుస్తుండడం... వివిధ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో భారీగానే నష్టం వాటిల్లే అవకాశముంది. 


 రెండోస్థానంలో విద్యుత్‌శాఖ 

తుఫాన్‌ ప్రభావంతో ఆర్‌అండ్‌బీ తర్వాత విద్యుత్‌శాఖకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, భారీవర్షానికి 33 కేవీ ఫీడర్స్‌ - 58, 11 కేవీ ఫీడర్స్‌ 405 పాడయ్యాయి. 104 విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లకు నష్టం వాటిల్లింది. వాటితోపాటు 33 కేవీ విద్యుత్‌ స్తంభాలు 50, లెవెన్‌ కేవీ విద్యుత్‌ స్తంభాలు 158, ఎల్‌టీ స్తంభాలు 305 కూలిపోయాయి. మొత్తం రూ. 5.3 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆశాఖ తేల్చింది. 


 30వీధి లైట్లు ధ్వంసం... 

ఈదురుగాలుల ప్రభావంతో మూడు మునిసిపాల్టీల్లో మొత్తం 30 వీధిదీపాలు పాడయ్యాయి. వీటి మరమ్మతుల కోసం  రూ.1.4లక్షలు అవసరమని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. తుఫాన్‌  ఒక మత్స్యకారుడు మృతిచెందాడు. ఒక బోటు పూర్తిగా, మరొకటి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రూ.1.5లక్షలు నష్టం వాటిల్లినట్లు మత్స్య శాఖ నివేదిక సిద్ధం చేసింది. 

Updated Date - 2021-09-29T05:35:51+05:30 IST