చితికిపోతున్న బీటీ రోడ్లు

ABN , First Publish Date - 2020-11-22T05:27:19+05:30 IST

చితికిపోతున్న బీటీ రోడ్లు

చితికిపోతున్న బీటీ రోడ్లు
బీటీరోడ్డుపై నుంచి కేజీవీల్స్‌తో వెళుతున్న ట్రాక్టర్‌

  • ట్రాక్టర్ల ఇనుప చక్రాల కింద ధ్వంసమవుతున్న వైనం  
  • అనతి కాలంలోనే మరమ్మతులు చేపట్టాల్సిన దుస్థితి  
  • వృథా అవుతున్న ప్రజాధనం 


మేడ్చల్‌:  గ్రామాల్లో ప్రజల ప్రయాణ సౌకర్యాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం మండలంలోని మారు మూల గ్రామాలకు బీటీ రోడ్డులను ఏర్పాటు చేసింది. లక్షలాది రూపాయలు వెచ్చించి బీటీ రోడ్లను వేసినప్పటికీ కొందరి నిర్లక్ష్యంతో మూన్నాళ్లకే మరమ్మతులు చేపట్టాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. బీటీరోడ్లు పాడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతను మరిచి కొందరి నిర్లక్ష్యం శాపంగా మారిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రోడ్లు పాడైపోవడానికి ప్రధానంగా ట్రాక్టర్‌ కేజీవీల్స్‌ కారణమని వాపోతున్నారు. స్థానిక రైతులు వ్యవసాయ భూమిని దున్నడానికి తీసుకెళ్లే ట్రాక్టర్‌కు కేజీవీల్స్‌ను అమర్చుకుని కనీస భద్రతచర్యలు చేపట్టకుండా బీటీరోడ్డుపై వెళ్లడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. రోడ్డు పాక్షికంగా దెబ్బతిని పెచ్చులు ఊడి అనతికాలంలోనే రోడ్డుకు గుంతలు ఏర్పడుతున్నాయి. చాలా మంది రైతులు తమ పొలాల వద్ద ట్రాక్టర్‌ వాడకం ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి ట్రాక్టర్‌కు కేజీవీల్స్‌ బిగించి పొలంలో దున్నుకుంటున్నారు. అనంతరం పని ముగించుకొన్న వెంటనే తిరిగి ఇనుప కేజీవీల్స్‌ను తొలగించి తిరిగి టైర్‌ చక్రాలను బిగించుకుంటారు. కానీ కొంతమంది రైతులు నేరుగా ఇంటి వద్ద నుంచి ఇనుప చక్రాలను బిగించుకుని రోడ్డు గుండా వ్యవసాయ పొలాల వరకు వెళ్తున్నారు. దీంతో రోడ్డు మొత్తం పాడైపోతున్నది. ఈ విషయం గుర్తించి స్థానిక గ్రామాల అధికారులు, ప్రజాప్రతినిధులు అంతగా పట్టించుకోక పోవటంతో ఇనుపచక్రాలతో వెళ్లే ట్రాక్టర్‌లకు అడ్డ్డూఅదుపు లేకుండా పోయింది. మండలంలోని రాజబొల్లారం, డబీల్‌పూర్‌, నూతన్‌కల్‌, శ్రీరంగవరం, రావల్‌కోల్‌తండా, రాయిలాపూర్‌, గిర్మాపూర్‌, బండమాదారం గ్రామాలకు కోట్లరూపాయలు వెచ్చించి ప్రభుత్వం బీటీ రోడ్లు వేయించింది. ప్రస్తుతం ఈ రోడ్లు ట్రాక్టర్ల ఇనుప చక్రాలతో దెబ్బతిన్నాయి. డబీల్‌పూర్‌ నుంచి శ్రీరంగవరం వరకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు వేసిన రోడ్డు ప్రస్తుతం కనీసం ద్విచక్రవాహనాలు కూడా నడవని విధంగా మారింది. అతికష్టంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చి వేయిస్తున్నా వాటి సంరక్షణపై తగిన చర్యలు తీసుకోకపోవటంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ట్రాక్టర్లపై ఆంక్షలు విధించి ప్రజాధనం వృథా కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. 


జరిమానాలు విధించాలి


బీటీ రోడ్లపై ట్రాక్టర్‌ కేజీవీల్‌ చక్రాలతో నడుపుతున్న వారిని గుర్తించి జరిమానా విధించాలి. ఒక్కసారి రోడ్లు పాడైతే తిరిగి మరమ్మతులు చేపట్టాలంటే ఏళ్లు పడుతుంది. ఉన్న రోడ్లను కాపాడుకుంటేనే బాగుంటుంది. గ్రామాలను కలిపే లింకు రోడ్లు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.   

- పద్మారెడ్డి, గిర్మాపూర్‌


Updated Date - 2020-11-22T05:27:19+05:30 IST