రోడ్ల నిధులూ దారి మళ్లాయ్‌!

ABN , First Publish Date - 2022-04-23T05:53:29+05:30 IST

కందుకూరు నియోజకవర్గంలోని 11, పొరుగునే ఉన్న కొండపి నియోజకవర్గ పరిధిలోని 22 గ్రామీణ రహదారుల అభివృద్ధికి ూ.45 కోట్ల ఏఐఐబీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.

రోడ్ల నిధులూ దారి మళ్లాయ్‌!
అధ్వానంగా కేపీ రోడ్డు - కాకుటూరు (కంచరగుంట) రహదారి

కందుకూరులో 11 గ్రామీణ రోడ్ల అభివృద్ధి

రూ.15 కోట్లు మంజూరు చేసిన  ఏఐఐబీ

నిధులు వెనక్కి లాగేసుకున్న ప్రభుత్వం 

బిల్లులు మంజూరుకాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

అరకొర పనులతో ప్రజలకు తప్పని గతుకుల ప్రయాణం


పల్లె ప్రగతికి రహదారులే కీలకం. అలాంటి పనులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. కొత్త పనులు చేపట్టకపోగా, మంజూరైన పనులకు కేటాయించిన నిధులను సైతం వెనక్కి లాగేసుకుంటోంది. కందుకూరు నియోజకవర్గంలోని పలు గ్రామీణ రహదారుల అభివృద్ధికి గత ప్రభుత్వంలో మంజూరైన ఏషియన్‌ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) నిధులను ప్రస్తుత ప్రభుత్వం దారి మళ్లించింది. ఇంకేముంది.. ఆ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించకపోవడంతో చేతులెత్తేశాడు. దీంతో ఎక్కిడి పనులు అక్కడ ఆగిపోగా, చేసిన పనుల ఆనవాళ్లు కోల్పోయి, రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. 


కందుకూరు, ఏప్రిల్‌ 22 : కందుకూరు నియోజకవర్గంలోని 11, పొరుగునే ఉన్న కొండపి నియోజకవర్గ పరిధిలోని 22 గ్రామీణ రహదారుల అభివృద్ధికి ూ.45 కోట్ల ఏఐఐబీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రావెల్‌ రోడ్లుగా ఉన్న ఈ రహదారులను తారు, సిమెంటు రోడ్లుగా అభివృద్ధి చేయాలి. ఇందులో కందుకూరు పరిధిలోని 11 రహదారులకు రూ.15 కోట్లు మంజూరయ్యాయి. 2018, అక్టోబరులో టెండర్లు పిలవగా, ఒకే కాంట్రాక్టరు పనులన్నీ దక్కించుకున్నారు. ఆ వెంటనే పనులు ప్రారంభించి కొంతమేర పూర్తయ్యాక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది.. ఆ నిధులను దారిమళ్లించడంతో చేసిన పనులకు బిల్లులు రాలేదని కాంట్రాక్టరు పనులు చేయకుండా చేతులు ఎత్తేశాడు. దీంతో మూడేళ్లుగా పనులు ముందుకు సాగక చేసిన పనులు ఆనవాళ్లు కోల్పోయి దర్శనమిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం  2019 చివరికల్లా పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఇప్పటికి 40 శాతం కూడా పనులు పూర్తికాలేదు. ప్రభుత్వం మాత్రం పనుల పూర్తికి తాజాగా 2023, డిసెంబరు వరకు గడువు పొడిగించింది. అయితే ప్రస్తుతం ఈ పనులు పూర్తి చేయాలంటే అంచనాలు భారీగా పెరిగిపోవటంతో గడువు ఎన్నేళ్లు పొడిగించినా ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు.  


అభివృద్ధి చేయాల్సిన రోడ్లు..

పామూరు రోడ్డు (కేపీరోడ్డు) నుంచి కాకుటూరు వరకు సిమెంటు రోడ్డు, కోవూరు అడ్డరోడ్డు నుంచి నరిశెట్టివారిపాలెం మీదుగా కొండికందుకూరు వరకు తారు రోడ్డు, లింగసముద్రం రోడ్డు నుంచి ఆర్‌ఆర్‌ పాలెం వరకు తారు రోడ్డు, కోవూరు నుంచి యస్‌టి కాలనీ వరకు తారు రోడ్డు, అనంతసాగరం రోడ్డు, మాచవరం సమీపంలోని వడ్లమూడివారిపాలెం నుంచి పరకొండపాడు మీదుగా కొండారెడ్డిపాలెం వరకు తారు రోడ్డు, కేపీఎన్‌ఎం రోడ్డు నుంచి పాత దప్పళంపాడు రోడ్డు, నాయుడుపాలెం రోడ్డు, కేజీటీ రోడ్డు నుంచి మాచవరం ఎస్టీ కాలనీ రోడ్డు తదితర రహదారులను తారు రోడ్లుగా అభివృద్ధి చేయాలి.  వీటిలో కొన్ని రోడ్లకు పనులు ప్రారంభించకపోగా అధికశాతం రోడ్లకు కేవలం జీఎస్పీ లేయరు వేసి వదిలేశారు.  


రూ.3 కోట్లు చెల్లించాం

రూ.15 కోట్లలో అప్పటి అంచనాల ప్రకారం 6 కోట్ల వరకు పనులు పూర్తవగా, బిల్లులు పెట్టాం. రంఎడేళ్ల తర్వాత రూ.3 కోట్లు కాంట్రాక్టరు ఖాతాకు జమ అయ్యాయి. రోడ్డు పనులు పూర్తి చేసేందుకు 2023, డిసెంబరు వరకు గడువు పొడిగించారు. ఈ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు త్వరలో ఏఐఐబీ ప్రతినిధి బృందం వస్తున్నట్లు సమాచారం అందింది. వారు వచ్చి వెళ్లాక పనులు వేగవంతం అవుతాయని భావిస్తున్నాం. 

- హనుమంతరావు, పంచాయతీరాజ్‌ ఏఈ

Updated Date - 2022-04-23T05:53:29+05:30 IST