అధ్వాన రోడ్లకు మోక్షం!

ABN , First Publish Date - 2022-06-27T06:48:22+05:30 IST

రాష్ట్రంలో మూడేళ్లుగా రోడ్ల మరమ్మతులు జరగకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది.

అధ్వాన రోడ్లకు మోక్షం!

పునరుద్ధరణకు రూ.105 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 

వార్డుకు రూ.కోటి చొప్పున కేటాయింపు

ప్రధాన, అనుసంధాన రహదారులకు ప్రాధాన్యం

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంజనీర్లు

నిధులు విడుదల కాగానే టెండర్‌ ప్రక్రియ 


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో మూడేళ్లుగా రోడ్ల మరమ్మతులు జరగకపోవడంతో  పరిస్థితి అధ్వానంగా  మారింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జీవీఎంసీ పరిధిలో రోడ్ల పునరుద్ధరణకు రూ.105 కోట్లు కేటాయించనున్నట్టు ఇటీవల ప్రకటించింది. దీంతో వార్డుకి రూ.కోటి చొప్పున కేటాయించి, నగరంలోని అన్ని ప్రఽధాన రహదారులు,  అనుసంధాన వీధిరోడ్లను పునరుద్ధరించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు వార్డుల వారీగా ప్రతిపాదనలు తయారుచేసే పనిలో ఇంజనీరింగ్‌ అధికారులు నిమగ్నమయ్యారు.

నగరంలో దెబ్బతిన్న రోడ్ల నుంచి వాహనచోదకులకు ఎట్టకేలకు విముక్తి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు గాను జీవీఎంసీకి రూ.105 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, జీవీఎంసీ అధికారులకు సమాచారం వచ్చింది. ఇప్పటికే నగరంలో రోడ్లన్నీ అధ్వాన స్థితిలో ఉన్నాయి. దీనిపై వాహన చోదకులతోపాటు నగరవాసులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో జీవీఎంసీ అధికారులు చలించారు. తాత్కాలిక పరిష్కారంగా గోతులను పూడ్చాలని నిర్ణయించారు. రూ.8.28 కోట్లతో 51 కిలోమీటర్ల మేర రోడ్లపై ఏర్పడిన 6,679 గోతులను పూడ్చివేసే పని ప్రారంభించారు. ఇప్పటివరకూ నాలుగువేల గోతులను పూడ్చివేశారు. దీనివల్ల కొంతవరకూ సమస్య పరిష్కారమైనప్పటికీ , చిన్నచిన్న గోతులను పూడ్చే అవకాశం కనిపించలేదు. వాహనాల రాకపోకల సమయంలో ఇవి పెద్దవై సమస్య మొదటికొచ్చింది. అలాకాకుండా దెబ్బతిన్న రోడ్లపై కొత్తగా లేయర్‌ వేస్తేనే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు గుర్తించారు. అయితే నిధుల లేమితో అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధుల విడుదల సుముఖత వ్యక్తం చేయడంతో వార్డుకి రూ.కోటి చొప్పున కేటాయించాలని, మిగిలిన నిధులతో నగరంలోని ప్రధాన రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు వార్డుల వారీగా పునరుద్ధరించాల్సిన రోడ్ల వివరాలతోపాటు అందుకు అయ్యే ఖర్చుతో ప్రతిపాదనలు తయారుచేయాలని జీవీఎంసీలోని పబ్లివర్క్‌ విభాగంలోని ఏఈలు, డీఈలకు చీఫ్‌ ఇంజనీర్‌ రవికృష్ణరాజు ఆదేశాలు జారీచేశారు. నిధులు విడుదల కాగానే పనులకు టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. 

Updated Date - 2022-06-27T06:48:22+05:30 IST