‘అ’క్రమబద్ధీకరణ

ABN , First Publish Date - 2020-10-20T08:57:30+05:30 IST

కాలనీల్లో నిలువెత్తు నీళ్లు! ఇళ్లల్లోకి కూడా దూసుకొచ్చిన వరద! రోజుల తరబడి నీళ్లలోనే కాలనీలు! ఇందుకు కారణం...

‘అ’క్రమబద్ధీకరణ

  • రోడ్లు, డ్రైనేజీలు లేని లే అవుట్లు
  • అందుకే వరదలు వస్తే కాలనీలు మునక
  • రాజకీయ అండదండలతోనే లే అవుట్లు
  • భవిష్యత్తు మరింత భయం.. భయం

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజోతి): కాలనీల్లో నిలువెత్తు నీళ్లు! ఇళ్లల్లోకి కూడా దూసుకొచ్చిన వరద! రోజుల తరబడి నీళ్లలోనే కాలనీలు! ఇందుకు కారణం.. కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం!

ఓ లే అవుట్‌లో సరైన రోడ్లు లేవు! డ్రైనేజీ వ్యవస్థ అసలే లేదు! అయినా, ప్లాట్లు అమ్మేశారు! ఇళ్లు కట్టేశారు! కాలనీ ఏర్పడింది! ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంలో సక్రమం కూడా అయిపోయింది!



రాష్ట్రంలో.. మరీ ముఖ్యంగా మహా నగరమైన హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితి ఇది. రోడ్లు లేకుండా.. మురుగునీటి పారుదల వ్యవస్థ లేకుండా.. పార్కులు లేకుండా అక్రమంగా లే అవుట్లు వేస్తూనే ఉన్నారు. కాసుల కక్కుర్తితో ప్రభుత్వాలు వాటికి అనుమతులు ఇస్తూనే ఉన్నా యి. ఐదేళ్ల కిందట తెలంగాణ వచ్చిన తర్వాత 2015లోనే ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని తీసుకొచ్చింది. అప్పుడు 4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 70 శాతానికి పైగా పరిష్కారం కూడా అయ్యాయి. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఎల్‌ఆర్‌ఎ్‌సని ప్రభుత్వం ప్రకటించిం ది. ఇప్పుడు దానికి వచ్చిన దరఖాస్తులను చూస్తే దిమ్మ తిరిగిపోతోంది. ఇప్పటికే 20.5 లక్షలు దాటాయి. తాజాగా ప్రభుత్వం గడువును నెలాఖరు వరకూ పొడిగించింది. అప్పటికి దరఖాస్తుల సంఖ్య 25 లక్షలకు చేరవచ్చన్నది అంచనా. ఇప్పటికి దాఖలైన దరఖాస్తులను పరిశీలించినా.. మూడింట రెండు వంతులు అంటే 14 లక్షల దరఖాస్తులు కార్పొరేషన్‌, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దరఖాస్తుకు సంబంధించి నలుగురు కుటుంబ సభ్యుల ను లెక్క వేసుకున్నా.. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి అక్రమ లే అవుట్లతో సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది.


అంటే.. రాష్ట్ర జనాభాలో మూడో వంతు మంది ఇందులో పాలుపంచుకున్నట్లే. అంతేనా.. ఐదేళ్లు తిరిగేసరికే ఏకంగా దాదాపు 25 లక్షల దరఖాస్తులు వస్తున్నాయంటే ప్రభుత్వ, అధికారుల పనితీరును అర్థం చేసుకోవచ్చు. అనధికార లే అవుట్లకు ఎటువంటి అభ్యంతరం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో రియల్టర్లు దేని పరిధిలోని భూమిలోనైనా ప్లాట్లు చేసేస్తున్నారు. వాటిని జనాలకు అంటగడితే ఆ తరువాత వారి తిప్పలు వారే పడతారని, ఏదో ఒక సమయంలో ప్రభుత్వమే క్రమబద్ధీకరిస్తుందని భావిస్తున్నారు. అక్రమంగా లే అవుట్లు అడ్డగోలుగా పెరిగిపోవడానికి ఇదే కారణం. ఊరు, వాడా తేడా లేకుండా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఇలా... అన్ని చోట్ల నుంచి లక్షలాది దరఖాస్తులు వచ్చాయి. అంటే గడిచిన ఐదేళ్లలో లక్షలాదిగా అక్రమ లే అవుట్లు, ప్లాట్లు వెలిసినట్లు దరఖాస్తులే చెబుతున్నాయి.


 తద్వారా, ప్రభుత్వ వైఫల్యం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇవన్నీ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, ప్రధాన ర హదారులకు సుదూరంగానో వెలిసినవి కూడా కావు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులు, గ్రామాలు-పట్టణాల శివార్లలో వెలిసినవే. నిత్యం రద్దీగా ఉండే.. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం తిరిగే ప్రాంతాల్లోనే ఇవన్నీ వెలుస్తున్నాయి. అయినా, చర్యల్లేవు. అంతేనా, ప్రజా ప్రతినిధుల జోక్యం, సహకారం.. అధికార యంత్రాంగం అవినీతి ఇందుకు కారణం. మూడేళ్ల కిందట హైదరాబాద్‌లో కొంత భాగం, ఇటీవల వరంగల్‌ నగరం, ఇప్పుడు హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మునుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రకృతిసిద్ధంగా ఉన్న నీటి ప్రవాహాలను అడ్డుకోవడం.. కాలనీల్లోని నీరు బయటకు వెళ్లేందుకు మార్గాలు లేకపోవడమేనని నిపుణులు విశ్లేషించారు. 


నాలాలు, చెరువుల ఆక్రమణలో..

నాలాలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్నా కూడా సంబంఽధిత అధికార యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. మూడేళ్ల కిందట హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఆ సందర్భంగా, నగరంలోని నాలాలు, చెరువులను ఆక్రమించిన నిర్మాణాలపై అధికార యంత్రాంగం చేసిన ఒక సర్వేలో దాదాపు 28 వేల అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. వీటిని కూల్చేందుకు హడావుడి కూడా చేశారు. కానీ, అంతలోనే, వెంటనే నిలిపి వేశారు.  అక్రమ ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డుకట్ట వేయలేరా? అనే ప్రశ్న తరచూ ఉత్పన్నమవుతోంది. ఏదో విధంగా క్రమబద్ధీకరించుకోవచ్చు? ఎల్‌ఆర్‌ఎస్‌ మళ్లీ వస్తుంది? అనే ధీమా, నమ్మకం అక్రమ లే అవుట్లకు పురిగొల్పుతోంది. వీటికి ప్రజా ప్రతినిధుల అండ ఉండడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతోంది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారిపైనే పలు ఆరోపణలు వస్తున్నాయి. లే అవుట్‌ చేసినప్పుడు, కొనుగోళ్లు జరిగినప్పుడు స్పందించకుండా.. కొన్నేళ్ల తర్వాత ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పేరిట క్రమబద్ధీకరించుకుంటూ పోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక ఈ బాదుడేంటి?

2015లో ఎల్‌ఆర్‌ఎ్‌సను మునిసిపాలిటీలకే పరిమితం చేయగా.. ఈసారి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ వర్తింపజేశారు. కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ప్లాట్లను కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నారు. ఇది జరిగి ఏళ్లు గడిచింది. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ రూపంలో ఈ బాదుడేమిటని మధ్యతరగతి జనం వాపోతున్నారు. 


బీఆర్‌ఎ్‌సనూ ప్రవేశపెట్టినా..

2015లో ఎల్‌ఆర్‌ఎ్‌సతోపాటు బీఆర్‌ఎ్‌సను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిఽధిలోనే 1,27,754 దరఖాస్తులొచ్చాయి. వీటిలో నాలాలు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలతోపాటు అనుమతికి మించి అంతస్తులు, పార్కింగ్‌ ఏరియాల్లో నిర్మాణం, ఇళ్లకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాలను కలిపేసుకోవడం వంటివీ ఉన్నాయి. దీంతో, బీఆర్‌ఎ్‌సపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. నాలుగున్నరేళ్లుగా బీఆర్‌ఎస్‌ నిలిచిపోయింది.

Updated Date - 2020-10-20T08:57:30+05:30 IST