Abn logo
Jul 26 2021 @ 23:13PM

రహ‘దారుణాలు’

బుట్టాయగూడెంలో చెరువును తలపిస్తున్న రహదారి

రోడ్డుపై చెరువులు..  ప్రయాణం భయం భయంబుట్టాయగూడెం, జూలై 26: భారీ వర్షాలతో రోడ్లు అస్తవ్యస్తం అయ్యాయి. రహదారులు చెరువులు, కాల్వలను తలపిస్తున్నాయి. అడుగుకో గొయ్యితో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు గగ్గోలు పెడుతున్నా రు. బుట్టాయగూడెం హైస్కూలు సెంటరు నుంచి కృష్ణాపురం వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కొమ్ముగూడెం సెంటరు, కృష్ణాపురం ప్రాంతాల్లో రోడ్లపై గోతులు చెరువులనే తలపిస్తున్నాయి. గోతుల్లో తట్టెడు మట్టిని వేసినవారే లేరని స్థానికులు, వాహనదారులు ఆవేదన  చెందుతు న్నారు. నిత్యం ప్రయాణించే ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లను ఆక్రమించి కట్టడాలు చేపట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని పలువురు  ఆరోపిస్తున్నారు. రోడ్ల నిర్మాణం ఎలా ఉన్నా కనీసం మరమ్మతులు చేయిం చి ప్రమాదాలు నివారించాలని  పలువురు కోరుతున్నారు.

పోతవరం రహదారిపై గోతులు

నల్లజర్ల: మండలంలో రహదారులన్నీ గోతులతో దర్శనం ఇస్తున్నాయి. ప్రకాశరావుపాలెం నుంచి పోతవరం వరకు రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. నిత్యం వందలాది మంది ద్విచక్ర వాహనదారులు గోతుల్లో పడి గాయపడుతున్నారు. దూరప్రాంతాల వారు నీరు నిలిచిఉన్న గోతులు గమనించలేక అమాంతం పడిపోతున్నారు. పోతవరం శ్రీశ్రీ కళ్యాణమండపం వద్ద కాలినడకన వెళ్లే జాగా కూడా లేకుండా పోయింది. గోతులతోపాటు మట్టి బురద ఏర్పడడంతో జారి పడిపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు సైతం కిందపడి గాయలపాలవుతున్నారు. ప్రజలు అర్‌అండ్‌బీ అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదని వాపోతున్నారు.