గజానికో గతుకు! అడుగుకో అతుకు!

ABN , First Publish Date - 2022-05-29T06:35:20+05:30 IST

నగర పరిధిలోని రహదారులు అధ్వానంగా తయారయ్యాయి.

గజానికో గతుకు! అడుగుకో అతుకు!
గోతులమయమైన గురుద్వారా - ఆర్టీసీ కాంప్లెక్స్‌ రహదారి

....ఇదీ మహా నగరంలో అత్యంత ప్రధాన మార్గాల్లో ఒకటైన గురుద్వారా-ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డు పరిస్థితి

కిలోమీటరు రహదారిలో 50కుపైగా గొయ్యిలు

పదుల సంఖ్యలో ప్యాచ్‌వర్క్‌లు

వర్షాకాలంలో చెరువులను తలపిస్తున్నాయంటున్న వాహనచోదకులు

కీలకమైన రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే... మిగిలిన వాటి సంగతి ఎలా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవాలంటున్న జనం

వాహనాలు పాడవుతున్నాయని ఆవేదన

మూడేళ్లుగా రోడ్లు నిర్వహణను పట్టించుకోని జీవీఎంసీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 


నగర పరిధిలోని రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. జీవీఎంసీ గత మూడేళ్లుగా రోడ్లను పట్టించుకోకపోవడంతో గజానికొక గతుకు, అడుగుకో అతుకు...కనిపిస్తున్నాయి. ప్రతి రహదారి పరిస్థితి దాదాపు ఇదే మాదిరిగా ఉంది. నగరంలో కీలక మార్గాల్లో ఒకటైన గురుద్వారా-ఆర్టీసీ కాంప్లెక్స్‌ రహదారి (ద్వారకానగర్‌ మెయిన్‌రోడ్డు) అత్యంత దారుణంగా ఉంది. 


అడుగుకో గొయ్యి

ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ ఫ్లై ఓవర్‌ దగ్గర నుంచి గురుద్వారా  వరకు, అక్కడి నుంచి తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకూ (రెండు వైపులా) రహదారిని పరిశీలించగా అడుగుకో గొయ్యి కనిపించింది. చిన్నా, పెద్ద కలిపి సుమారు 50కుపైగా గోతులు దర్శనమిచ్చాయి. పదుల సంఖ్యలో ప్యాచ్‌వర్క్‌లు కనిపించాయి. ప్యాచ్‌ వర్క్‌ చేసినచోట అక్కడక్కడా రాళ్లు, తారు పైకి లేవడంతో గోతులు ఏర్పడ్డాయి. గురుద్వారా నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు వెళ్లే మార్గంలో దుర్గా గణపతి ఆలయం ఎదురుగా రెండు పెద్ద గొయ్యిలు ఉన్నాయి. ఈ మార్గంలోనే ఏవీఆర్‌ స్టోరేజీ ట్యాంక్‌ వద్ద (సీతంపేట జంక్షన్‌ దగ్గర్లో) ఒక పెద్ద గొయ్యితోపాటు మరో రెండు చిన్న గోతులు కనిపించాయి. అలాగే టైటాన్‌ షోరూమ్‌ ఎదురుగా ఆరు పెద్ద గొయ్యిలు ఏర్పడి రోడ్డు మొత్తం పూర్తిగా పాడైంది. వర్షాకాలంలో ఇక్కడ పెద్ద చెరువును తలపించేలా నీరు నిలిచిపోతుందని, దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎంవీపీ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి శివశంకర్‌ వెల్లడించారు. అలాగే, ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి గురుద్వారా వైపు వచ్చే మార్గంలో 20కుపైగా గొయ్యిలు ఉన్నాయి. బీవీకే కళాశాల దాటిన తరువాత ఏర్పడిన పెద్ద గొయ్యిలో పడి వాహనదారులు అనేకమార్లు ప్రమాదాలకు గురయ్యారని ఆటో డ్రైవర్‌ రాజేశ్వరరావు తెలిపారు. రోడ్డు అంచులు కూడా కోతకు గురికావడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, రాత్రివేళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని మరో వాహనదారుడు లోకేష్‌కుమార్‌ తెలిపారు. 


స్మార్‌ సిటీ రోడ్డులేనా..

స్మార్ట్‌ సిటీగా చెబుతున్న నగరంలో రహదారులు ఇంత అధ్వానంగా వుంటే ఎలా అని పలువురు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లుగా రోడ్లు నిర్వహణను పట్టించుకోకపోవడం దారుణమని మధురవాడ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు రామకృష్ణ అన్నారు. నగరం నడిబొడ్డున, కీలకమైన రహదారి పరిస్థితే ఈ విధంగా ఉందంటే...ఇతర ప్రాంతాల్లో రోడ్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని క్యాబ్‌ డ్రైవర్‌ విష్ణు ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుడప్పుడు వచ్చే వాహనదారులతో పోలిస్తే రోజూ ఈ మార్గంలో ప్రయాణాలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు ఎక్కువని, వాహనాలు పాడవుతున్నాయని అన్నారు.


ఎవరికి చెప్పాలో తెలియడం లేదు

- కనకల ఈశ్వరరావు, ఆటో డ్రైవర్‌

రోడ్డు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ గోతుల వల్ల ఆటో ముందు భాగంలో ఉండే పొట్టు పిండి రాలిపోతోంది. సాధారణంగా ఒకసారి మార్చితే మూడేళ్ల పాటు వస్తుంది. కానీ, రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఐదారు నెలలకు మార్చుకోవాల్సి వస్తోంది. వర్షాకాలంలో అయితే మా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదు. ఈ మార్గంలో జీవీఎంసీ అధికారులు రోజూ ప్రయాణాలు సాగిస్తారు. పరిస్థితి వాళ్లకు తెలిసినా ఎందుకో పట్టించుకోవడం లేదు. 


ప్రయాణికుల్లో అసంతృప్తి

- కె.అప్పారావు, ఆటో డ్రైవర్‌

రోడ్డు సరిగా లేకపోవడం, గోతులతో కుదుపులు ఎక్కువ అవుతున్నాయి. ఆటో ఎక్కిన ప్రయాణికులు కుదుపులు వచ్చిన ప్రతిసారీ తిడుతుంటారు. ఇంత ఘోరంగా రోడ్లు ఉంటే పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదో అంటుంటారు. వాహనాలు పాడవ్వడంతోపాటు వెన్ను నొప్పి కూడా వస్తోంది. ఉన్నతాధికారులు రహదారులు వేయాలి. 


వాహనాలు పాడవుతున్నాయి

- త్రిశాంత్‌, ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌

రోడ్లపై గోతులు ఏర్పడడం వల్ల బైక్‌పై వెళుతుంటే ఉయ్యాల ఊగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఎక్కడికక్కడే గోతులు, ప్యాచ్‌వర్క్‌లతో బైక్‌ స్వింగ్‌ అవుతోంది. రోడ్లు అధ్వానంగా ఉంటే వాహనాలు వేగంగా పాడవుతాయి. ఈ మార్గంలో వారానికి కనీసం నాలుగుసార్లు వస్తుంటా. పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్యాచ్‌వర్క్‌లు కూడా సరిగా చేయడం లేదు. కొత్త రోడ్లు వేస్తే బాగుంటుంది. 



Updated Date - 2022-05-29T06:35:20+05:30 IST