మూడో‘సారీ’!

ABN , First Publish Date - 2021-08-03T05:42:01+05:30 IST

గతేడాది నివర్‌ తుఫాన్‌ దెబ్బకు జిల్లాలోని ప్రధాన రోడ్లు భాగా దెబ్బతిన్నాయి. వీటిని బాగుచేయాలని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

మూడో‘సారీ’!
పొదలకూరు - సైదాపురం మధ్య దెబ్బతిన్న ఎండీఆర్‌ రోడ్డు

రోడ్ల నిర్మాణాలకు ఆర్‌అండ్‌బీ టెండర్ల ఆహ్వానం

32 రోడ్లు.. రూ.162 కోట్లు

మూడో కాల్‌లో కూడా నో రెస్పాన్స్‌!

పనులు చేసేందుకు ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు

బిల్లుల చెల్లింపుపైనే అనుమానాలు

ఇప్పుడేం చేయాలి : ప్రభుత్వాన్ని కోరిన అధికారులు



ఎక్కడా.. ఎప్పుడూ చూడని పరిస్థితి ఇది. ఒకటి కాదు.. రెండు కాదు..  మూడు సార్లు టెండర్లు పిలిచినా ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టర్‌ కూడా ముందుకు రాలేదు. పోనీ ఆ పనులేమైనా మారుమూల ప్రాంతాల్లోనివా అనుకుంటే పొరపాటే. జిల్లాలోని కీలకమైన రోడ్డు పనులు.  వీటికోసం ఒకప్పుడు పోటీపడ్డ కాంట్రాక్టర్లే ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఇప్పటికే భారీగా బిల్లులు పెండింగ్‌ ఉండటం, పనులు చేసినా సకాలంలో బిల్లులు  వస్తాయో రావేమోనన్న అనుమానం కాంట్రాక్టర్లలో నెలకొంది. దీంతో గతుకుల రోడ్లపై ప్రయాణించే దుస్థితి నుంచి ప్రజలకు మోక్షం లభించడం లేదు. 


నెల్లూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : గతేడాది నివర్‌ తుఫాన్‌ దెబ్బకు జిల్లాలోని ప్రధాన రోడ్లు భాగా దెబ్బతిన్నాయి. వీటిని బాగుచేయాలని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు  పంపారు. పలు రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో దెబ్బతిన్న మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లు (ఎండీఆర్‌), రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసేందుకు ఏప్రిల్‌ నెలలో మొదటిసారి ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్లు పిలిచారు. 21 ఎండీఆర్‌ రోడ్లకు రూ.87 కోట్లతో, 11 రాష్ట్ర రహదారులకు రూ.75 కోట్లతో టెండర్లు పిలిచారు. మొదటి కాల్‌ టెండర్లు పిలిచినా ఎవరూ ముందుఉ రాకపోవడంతో రెండోసారి మళ్లీ ఆహ్వానించాల్సి వచ్చింది. మే 17వ తేదీతో గడువు ముగిసినా కాంట్రాక్టర్లు ఆసక్తి కనబరచకపోవడంతో గడువును నెలాఖరు వరకు పొడగించారు. రెండో కాల్‌లో కూడా ఎవరూ టెండర్లు వేయలేదు. ఇక చేసేది లేక మరోమారు ముచ్చటగా మూడోసారి గత నెలలో టెండర్లు పిలిచారు. నెలాఖరుతో గడువు ముగిసినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లభించలేదు. ఈ పరిస్థితిని చూసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకు రుణం ద్వారా ఈ వర్కులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే రుణం మంజూరు కాలేదని, తర్వాత ఎలా బిల్లులు చెల్లిస్తారన్నదానిపై స్పష్టత లేదని కాంట్రాక్టర్ల వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరోసారి అనిశ్చిత పరిస్థితుల్లో పనులు చేస్తే ఇబ్బందులు రెట్టింపవుతాయని కాంట్రాక్టర్లు అంటున్నారు. కాగా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాకపోవడంతో అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. 


డబ్బులు డిపాజిట్‌ చేస్తేనే..!

జిల్లాలో ఎంతోమంది పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నప్పటికీ వారు టెండర్లు వేయకుండా ఇంతటి కఠినమైన నిర్ణయానికి ఎందుకొచ్చారా అని ఆరా తీస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి భారీగా బిల్లులు పెండింగ్‌ ఉండటం, పనులు చేస్తే సకాలంలో బిల్లులు రాకపోతుండడంతో కాంట్రాక్టర్లు ఆందోళనలో ఉన్నారు. ముందు పెట్టుబడి పెట్టి పనులు చేసినా నిర్ణీత సమయంలో బిల్లులు చెల్లించక పోతుండడంతో మిగిలే ఆదాయం వడ్డీకి కూడా సరిపోవడం లేదని వాపోతున్నారు. పైగా ప్రభుత్వ తీరుతో అప్పులు నెత్తినేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి అప్పులు తెచ్చి పనులు చేయడం సాహసమేనని పలువురు కాంట్రాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఆర్‌అండ్‌బీలో పనులు చేస్తే బిల్లులు వస్తాయో. .రావోనన్న అనుమానంతోనే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని ఇటు అధికార, అటు  కాంట్రాక్టర్ల వర్గాలు చర్చించుకుంటుండడం గమనార్హం. కాగా టెండర్లు వేయాలంటే తమకు బిల్లుల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని పట్టుబడుతున్నారు. డబ్బులను ముందుగా చీఫ్‌ ఇంజనీర్‌ దగ్గర డిపాజిట్‌ చేస్తే పనులు చేసేందుకు తమకు ఇబ్బంది లేదని అంటున్నారు. మరి ఇప్పటికే మూడు సార్లు టెండర్లు పిలవడం, నెలల సమయం వృథా అవుతుండడంతో తదుపరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా.. అన్నది ఆసక్తిగా మారింది. కాగా జిల్లాలోని మెజారిటీ రహదారులు దారుణంగా దెబ్బతినడంతో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితులను అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. 


మూడో కాల్‌లోనూ నో రెస్పాన్స్‌ 

రోడ్ల నిర్మాణాలకు సంబంధించి పిలిచిన మూడో కాల్‌ టెండర్లలోనూ రెస్పాన్స్‌ రాలేదు. పనులు చేస్తే బిల్లుల చెల్లింపుపై కాంట్రాక్టర్లు స్పష్టత కోరుతున్నారు. తదుపరి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. 

- భరత రత్న, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ 

Updated Date - 2021-08-03T05:42:01+05:30 IST