‘రోడ్డు’కు టెండర్‌

ABN , First Publish Date - 2020-09-19T09:24:14+05:30 IST

రోడ్ల పనుల్లో నాణ్యత ఉండాలి. రోడ్డు స్థిరంగా, భద్రంగా ఉండాలి. అంటే... పెద్ద కాంట్రాక్టర్లు రావాలి. నేషనల్‌ హైవేల పరిధిలో రూ.500-1500 కోట్ల పనులు జరుగుతున్నాయి. అందులో అర్హత ఉన్నవారు చాలామంది ఉన్నారు.

‘రోడ్డు’కు టెండర్‌

  • ఎన్‌డీబీ పనుల్లో అన్నీ 2 టెండర్లే
  • 12 ప్యాకేజీల్లో పారిన ‘పథకం’
  • అన్నీ ‘ప్రముఖుల’కు చెందినవే
  • ముగ్గురు ప్రముఖులకే తొమ్మిది
  • ప్యాకేజీలు దక్కేలా ‘ప్రణాళిక’!?
  • బ్రిక్స్‌ దేశాల కంపెనీలూ పాల్గొనవచ్చునని
  • గొప్పగా అధికారుల ప్రకటనలు
  • కానీ ఉమ్మడి రాష్ట్రాన్ని దాటని టెండర్లు
  • ఇతర రాష్ట్రాల నుంచీ ఒక్కటీ లేదు
  • శ్రీకాకుళంలో సింగిల్‌ టెండర్‌... రద్దు

అవి... వందల కోట్ల విలువైన ‘న్యూ డెవల్‌పమెంట్‌  బ్యాంక్‌’ నిధులతో వేసే రహదారి పనుల టెండర్లు! అదేం చిత్రమో కానీ... ఏ జిల్లాలో చూసినా అవే కంపెనీలు! ఒక్కో పనికి లెక్కపెట్టినట్లుగా  రెండంటే రెండు టెండర్లు! భారత్‌తోపాటు బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాకు చెందిన కాంట్రాక్టర్లు కూడా టెండర్లలో పాల్గొనే అవకాశమున్నప్పటికీ... ఈ టెండర్లేవీ ఉమ్మడి రాష్ట్రాన్ని దాటలేదు. అందులోనూ ఒకే ఒక్క కంపెనీ... హైదరాబాద్‌కు చెందినది. మిగిలినవి నవ్యాంధ్రవే! ఏమిటీ చిత్రం, ఎప్పుడూ లేని చోద్యం!?


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘రోడ్ల పనుల్లో నాణ్యత ఉండాలి. రోడ్డు స్థిరంగా, భద్రంగా ఉండాలి. అంటే... పెద్ద కాంట్రాక్టర్లు రావాలి. నేషనల్‌ హైవేల పరిధిలో రూ.500-1500 కోట్ల పనులు జరుగుతున్నాయి. అందులో అర్హత ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారు ఎన్‌డీబీ టెండర్లలో పాల్గొనవచ్చు.  ఇది విదేశీ ఆర్థిక సహాయ ప్రాజెక్టు! అందువల్ల బ్రిక్స్‌ దేశాల కాంట్రాక్టర్లూ టెండర్లలో పాల్గొనవచ్చు’’ ఇదీ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉవాచ! అంటే... టెండర్ల విషయంలో ఎంత పోటీ ఉందో, ఎన్నెన్ని కంపెనీలూ రంగంలోకి దిగాయో, అందులో దేశానికి చెందినవి ఎన్నో, విదేశాలవి ఎన్నో అని అనుకుంటే... కంకరలో కాలేసినట్లే! మొత్తం 13 జిల్లాల పరిధిలో తొలి దశ కింద రూ.1820 కోట్ల విలువైన రహదారుల పనులకు మూడు విడతలుగా టెండర్లు పిలిచి... టెక్నికల్‌ బిడ్ల పరిశీలన పూర్తి చేసేసరికి 13 కంపెనీలు మాత్రమే రంగంలోకి ఉన్నాయి. అదికూడా ఎవరో మాట్లాడుకుని, ఎంపిక చేసుకుని, వ్యూహం ప్రకారం అడుగులు వేసినట్లుగా ఒక్కో జిల్లా పనుల్లో రెండంటే రెండు కంపెనీలు మాత్రమే బరిలో నిలిచాయి.


అందులోనూ... భారీ విలువ ఉన్న మూడు ప్యాకేజీలు రాయలసీమకు చెందిన ఒక మంత్రి కుటుంబానికి చెందిన కంపెనీకి, మరో మూడు పనులు కడప జిల్లాకు చెందిన నేత దగ్గరి బంధువుకు, మరో మూడు ప్రధాన పనులు కడప జిల్లాకే చెందిన ఒక ప్రముఖుడి కంపెనీ పంచుకునేలా టెండర్లు పడ్డాయి. చివరికి దశకు వచ్చేసరికి... ఆ ప్యాకేజీ బరిలో ఉన్న రెండో కంపెనీ ‘మాయం’ అవుతుందని, ముందుగా ‘ఎంపిక చేసిన’ సంస్థకే పని దక్కుతుందని తెలుస్తోంది. ఇక... కేవలం రూ.36 కోట్ల విలువైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోడ్డు ప్యాకేజీకి మాత్రం ఒకే టెండరు పడటంతో... అది రద్దయింది.


అంతా ‘పద్ధతి’గా

న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంకు ఆర్థిక సహాయంతో రాష్ట్రంలో  చేపట్టనున్న రోడ్డు పనుల టెండర్‌ ఎవరికి వెళ్లాలో ముందే నిర్ణయిం చి... సాంకేతిక సమస్య రాకుండా మరో కంపెనీతో ‘నామ్‌కే వాస్తే’  బిడ్‌లు వేయిస్తున్న విన్యాసాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే వెలుగులోకి తెచ్చింది. అయితే...  ఇదంతా అబద్ధమని కృష్ణబాబు తేల్చేశారు. దేశ విదేశాల కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనవచ్చని చెప్పారు. కానీ, చివరికి జరిగింది వేరు.  రీజనబుల్‌గా పెద్ద కాంట్రాక్టర్లే రావాలనుకుంటే దేశంలో ప్రఖ్యాత కంపెనీలెందుకు బిడ్డింగ్‌లో పాల్గొనలేదు? వాటికి టెండర్‌ సమాచారం వెళ్లలేదా? చివరికి ప్రతి ప్యాకేజీలో రెండు కంపెనీలే ఎందుకు మిగిలాయి? అందులోనూ... మూడు ‘ముఖ్యమైన’ కంపెనీలే తొమ్మిది ప్యాకేజీల్లో ఎలా నిలిచాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు?  ప్రభుత్వంలో  పలుకుబడి ఉన్న కంపెనీలు మాత్రమే రావడం, అందులోనూ  ప్రతి ప్యాకేజీలో ఇద్దరే పాల్గొని వారిలో  ఒక్కరికి పనులు దక్కేలా వ్యూహరచన చేసినట్లుగా వీటిని పరిశీలిస్తే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

Updated Date - 2020-09-19T09:24:14+05:30 IST