చినుకు పడితే.. చెరువులే..

ABN , First Publish Date - 2022-06-29T05:38:33+05:30 IST

చినుకుపడితే రహదారులు చెరువులను తలపిస్తాయి.

చినుకు పడితే.. చెరువులే..
బ్రాహ్మణ చెరువు – వీరవాసరం రహదారి

పెనుమంట్ర / ఆకివీడు / పెంటపాడు, జూన్‌ 28: చినుకుపడితే రహదారులు చెరువులను తలపిస్తాయి. రహదారులపై గోతులు నీటితో నిండి వాహనదారులే కాదు పాదచారులు సైతం పడిపోవాల్సిందే. పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు – వీరవాసరం రహదారిలో పొలమూరు – నవు డూరు మధ్య రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గత ఏడాది మరమ్మతుల కు రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు ఇటీవల పెనుమంట్ర మండల పరిషత్‌ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఏఈ ప్రసాద్‌ చెప్పారు. దీనితో పొలమూరు ఎంపీటీసీ పెచ్చేటి నరసింహమూర్తి రోడ్డు మరమ్మతులకు పది లక్షలా అంటూ ఆక్షేపించారు. పనులు చేసి  ఏడాదైంది. వర్షం వస్తే మళ్లీ గోతులు పడతాయని అధికారులు సెలవిచ్చారు. ఆకివీడులో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు నానా అవస్థలు పడ్డారు. పెంటపాడు మండలంలో వర్షానికి పలు రహదారులు చిత్తడిగా మారాయి. గోతుల మయంగా ఉన్న రహదారులలో భారీగా వర్షం నీరు చేరిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్తిపాడు నుంచి రాచర్ల, అలంపురం రహదారులు, పడమర విప్పర్రు, బీ.కొండేపాడు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రత్తిపాడు వై.జంక్షన్‌ నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ రహదారి అద్వానంగా తయారైంది. మిల్లులు, గోదాములు ఉండడంతో భారీ వాహనాల కారణంగా రహదారి పూర్తిగా దెబ్బతింది. ప్రత్తిపాడు – రాచర్ల రహదారి మరింత అధ్వానంగా మారింది. ుుగల్తూరులో పల్లపు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులపై వర్షం నీరు నిలిచిపోవడంతో గ్రామస్థులతో పాటు వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. మొగల్తూరు – భీమవరం రోడ్డులో పెద్ద గొల్లగూడెం నుంచి వర్షపునీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.



Updated Date - 2022-06-29T05:38:33+05:30 IST