దారి వెతుక్కోవాల్సిందే..

ABN , First Publish Date - 2022-09-19T04:36:18+05:30 IST

అసలే సింగిల్‌ లైన్‌ రోడ్డు. దానికితోడు భారీ గోతులు. వర్షం పడితే వాహనానికి దారి వెతుక్కోవాల్సిందే. ఈ రోడ్లు బాగు చేయరా, ఎలా ప్రయాణించేదంటూ చింతలపూడి నగర పంచాయతీలోని భట్టువారిగూడెం బీసీ కాలనీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

దారి వెతుక్కోవాల్సిందే..
భట్టువారిగూడెం రోడ్డు

రహదారులు, కాలనీలు అధ్వానం

 భట్టువారిగూడెం బీసీ కాలనీ దుస్థితి

చింతలపూడి, సెప్టెంబరు 18: అసలే సింగిల్‌ లైన్‌ రోడ్డు. దానికితోడు భారీ గోతులు. వర్షం పడితే వాహనానికి దారి వెతుక్కోవాల్సిందే. ఈ రోడ్లు బాగు చేయరా, ఎలా ప్రయాణించేదంటూ చింతలపూడి నగర పంచాయతీలోని భట్టువారిగూడెం బీసీ కాలనీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నగర పంచాయతీ నుంచి బాలువారిగూడెం వెళ్ళే ఐదు కిలోమీటర్ల రోడ్డు అంతా గోతులమయంగా మారింది. భట్టువారిగూడెం గ్రామం వద్దకు వచ్చేసరికి వాహనాలు కూడా వర్షం పడితే దారి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీధి లైట్లు వెలగవు. గోతులు, బురద వలన ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక బీసీ కాలనీలోని ఒక వీధిలో గతంలో సిమెంటురోడ్డు వేశారు. డ్రైనేజీ కట్టలేదు. పక్కనే ఉన్న ఖాళీ స్థలం భూ యజమాని తన స్థలం మెరక చేయడంతో పడిన వర్షం నీరు సిమెంటు రోడ్డుపైకి చేరుతుంది. దీంతో ఆ రోడ్డులో ఉన్న పక్కా గృహాల ప్రజలు నడవడానికి వీలు లేకుండా బురద పేరుకుపోవడంతో దారి లేకుండా పోయింది. దీనికితోడు ఈ బురదతో దోమలు కూడా వ్యాపిస్తున్నాయని ఆ వీధిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


అమ్మో.. తిమ్మాపురం రోడ్డా !

ద్వారకాతిరుమల, సెప్టెంబరు 18: గ్రామీణ రహదారులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మండలంలోని తిమ్మాపురం నుంచి రామన్నగూడెంకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఎక్కడికక్కడ కంకర రాళ్లు పైకిలేచిపోయి దర్శనమిస్తున్నాయు. వర్షాలు పడితే ఈ రోడ్డు మరీ దారుణంగా తయారవుతోంది. రాత్రివేళల్లో ఈ గోతుల్లో పడి పలువురు గాయపడిన సందర్భాలూ ఉన్నాయి. దాదాపు ఆరు కిలోమీటర్ల మేర కంకర తేలి ఉంది. ఇకనైనా అధికారులు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


  రహదారులకు తూట్లు

 పోలవరం సెప్టెంబరు 18 : కొత్తరోడ్లు వేసి ఏడాది గడ వక మునుపే రోడ్లు గుంతలు పడి ఛిద్రంగా మారడంతో వాహనాదారులు పోలవరం నుంచి కొవ్వూరు రాకపోకలు సాగించ డానికి బెంబేలెత్తిపోతున్నారు. పోలవరం కన్నాపురం అడ్డరోడ్డు నుంచి పోలవరం వరకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం, బంగారమ్మపేట , యడ్లగూడెం జంక్షన్‌, పోలవరం నాలుగురోడ్ల జంక్షన్‌ సమీపాల్లో రోడ్లపై అడుగు లోతున భారీ గోతులు ఏర్పడ్డాయి. ఆ గోతుల్లో వర్షపునీరు నిలిచి ఏది రోడ్డో, ఏది గొయ్యో తెలియని పరిస్థితుల్లో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గూటాల నుంచి కన్నాపురం వరకు గత ఏడాది వేసిన నూతన రోడ్లకు రోడ్ల మార్జిన్‌లలో గ్రావెల్‌, మట్టిలతో బెర్ములు ఏర్పాటు చేయకపోవడం వల్ల, సగ్గొండ  ఫ్యాక్టరీ నుంచి, పోలవరం ప్రాజెక్టు నుంచి వస్తున్న భారీ వాహనాలు ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో మార్జిన్‌లపైకి వెళ్ళి రోడ్లు ఛిద్రం చేస్తున్నారు. సగ్గొండ ఫ్యాక్టరీకి గజ్జరం నుంచి వెళ్ళే రోడ్డు మార్గం మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లే భారీ ట్యాంకర్లు, ముడి సరుకు వాహనాలను పోలవరం కన్నాపురం అడ్డరోడ్డు నుంచి హుకుంపేట మీదుగా మళ్ళిస్తుండడంతో మార్జిన్‌లు సరిలేక ఎదురొచ్చిన ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. గడిచిన నెలరోజుల్లో పండు అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలవరం బెస్తావీధికి చెందిన బొర్రా సీతారామస్వామి గౌడ్‌ అనే యువకుడు చేయి విరిగి ఆస్పత్రి పాలయ్యాడు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్లు మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ విషయంపై జంగారెడ్డిగూడెం ఆర్‌అండ్‌బీ డీఈ హరికృష్ణను వివరణ కోరగా కన్నాపురం అడ్డరోడ్డు నుంచి పోలవరం వరకు రోడ్ల మరమ్మతుల కోసం రూ.18 లక్షల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి నివేదిక పంపించామని, నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.



Updated Date - 2022-09-19T04:36:18+05:30 IST