అవినీతికి అడ్డ‘దారి’

ABN , First Publish Date - 2022-07-20T06:03:47+05:30 IST

అవినీతికి అడ్డ‘దారి’

అవినీతికి అడ్డ‘దారి’
రోడ్డుపై లారీల పార్కింగ్‌

ఆటోనగర్‌-కానూరు రోడ్డంతా అస్తవ్యస్తం

అంతటా అనధికారిక పార్కింగ్‌, షెడ్ల నిర్మాణం

80 అడుగుల నుంచి 30 అడుగులకు కుదింపు

మామూళ్ల మత్తులో అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు

నెలకు రూ.అరకోటిపైనే వసూళ్లు


విజయవాడ నగరానికి చెంతన, వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీలో భాగంగా ఉన్న కానూరులోని ఈ రోడ్డు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నెలవారీ మామూళ్ల రూపంలో సుమారు రూ.అరకోటి వరకూ అధికారుల జేబుల్లోకి చేరుతోంది. ఏమిటా రోడ్డు కథ అంటారా..!


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : తాడిగడప మున్సిపాలిటీలో అతిపెద్ద ప్రాంతం కానూరు. సుమారు మూడు లక్షల జనాభా ఉన్న ఈ మున్సిపాలిటీలో మూడో వంతు జనాభా కానూరులోనే నివసిస్తున్నారు. విజయవాడ నగరం నుంచి ఊర్లోకి వెళ్లేందుకు ఆటోనగర్‌-కానూరు రహదారి ప్రధానమైనది. సుమారు రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మాస్టర్‌ ప్లాన్‌లో 80 అడుగుల వెడల్పు రోడ్డుగా ఉండగా, క్షేత్రస్థాయిలో 30 అడుగులు కూడా కనిపించదు. రోడ్డు పొడవునా లారీలు అనధికారికంగా పార్కింగ్‌ చేయడమే ఇందుకు కారణం. కొందరు ఏకంగా రోడ్డును ఆక్రమించి లారీ షెడ్డులే నిర్మించేసుకున్నారు. ఈ రహదారి వెంబడే నవత ప్రధాన కార్యాలయంతో పాటు క్రాంతి, వీఆర్‌ఎల్‌ వంటి లారీ ట్రాన్స్‌పోర్టు సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు చెందిన భారీ రవాణా వాహనాలు నిత్యం వందల సంఖ్యలో తిరుగుతుంటాయి. వీటి కారణంగా ఈ రోడ్డు మోకాలు లోతు గుంతలతో నామరూపాల్లేకుండా పోయింది. అధ్వాన రహదారికి తోడు ఆక్రమణలకు గురై కుచించుకుపోతోంది. రహదారిపై ఉన్న గుంతలో వాహనం పడి గత ఏడాది ఓ వ్యక్తి మృతిచెందాడు. తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అటు అధికారులు కానీ, ఇటు ట్రాఫిక్‌ పోలీసులు కానీ పట్టించుకోవట్లేదు. ఆటోనగర్‌-కానూరు రహదారి పొడవునా లారీ షెడ్లు నిర్మించేయడంతో 80 అడుగుల రోడ్డు కాస్త ఆక్రమణలపాలై 30 అడుగులకు చేరింది. వాస్తవానికి నవత రోడ్డు మొత్తం నివాస ప్రాంతమే. కానీ, మామూళ్ల మత్తులో మునిగితేలుతున్న అధికారులు ఈ విషయాన్ని విస్మరించి లారీ షెడ్లకు అనుమతులు ఇస్తున్నారు. లారీ షెడ్డు యజమానులేమో ఇదే అదునుగా రోడ్డునే ఆక్రమించి షెడ్లు నిర్మిస్తున్నారు, లారీలను పార్కింగ్‌ చేస్తున్నారు. 

పొంచి ఉన్న ముప్పు

ఈ రహదారిలో రెండు పేరొందిన పాఠశాలలు, ఓ జూనియర్‌ కళాశాల ఉన్నాయి. గుంతలు పడటంతో పాటు భారీ వాహనాల రాకపోకల కారణంగా ఏ క్షణాన్నైనా ప్రమాదం ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నేడు రోడ్డుకు శంకుస్థాపన 

కానూరు-ఆటోనగర్‌ రోడ్డును సుమారు రూ.1.20 కోట్లతో బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. కానూరు చిన్న చెరువు నుంచి ఆటోనగర్‌ వరకు అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులకు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే సుమారు లక్షమంది ప్రజల కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. అయితే, ఆక్రమణలను తొలగించని పక్షంలో బీటీ రోడ్డు అందుబాటులోకి వచ్చినా ప్రయోజనం ఉండదని స్థానికులు చెబుతున్నారు.

అసలు కథ ఇదీ.. 

ఈ ఒక్క రోడ్డు నుంచే సుమారు రూ.అరకోటి వరకు నెలవారీ మామూళ్లు అధికారులు, ట్రాఫిక్‌ పోలీసుల జేబుల్లోకి చేరుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. రహదారులను ఆక్రమించి లారీ షెడ్లు నిర్మించుకుంటున్నా మున్సిపల్‌ అధికారులు వాటిని తొలగించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. భారీ వాహనాల కారణంగా ఈ రహదారిపై నిత్యం గంటలకొద్దీ ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఎవరైనా వాహనదారులు పెనమలూరు ట్రాఫిక్‌ పోలీసులకు ఫోన్‌చేసి పరిస్థితి వివరించినా ‘ఆ రోడ్డులో అలాగే ఉంటుంది. బందరు రోడ్డు నుంచి వెళ్లండి’ అని ఉచిత సలహా ఇస్తున్నారు. బందరు రోడ్డు నుంచి కానూరు ఆర్చి మీదుగా ఊర్లోకి రావాలంటే కనీసం నాలుగు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. 






Updated Date - 2022-07-20T06:03:47+05:30 IST