ఎన్నాళ్లీ వేదన

ABN , First Publish Date - 2022-06-26T06:06:08+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా- మన్యం జిల్లా అనుసంధాన రహదారికి మోక్షం కలగడం లేదు. నిధులున్న సమయంలో రహదారి నిర్మాణానికి అటవీశాఖ అభ్యంతరాలు చెప్పింది.

ఎన్నాళ్లీ వేదన
ఇరగాయి నుంచి పాచిపెంట వెళ్లే మార్గం

- ముందుకు సాగని అంతర్‌ జిల్లా రహదారి నిర్మాణ పనులు

- పదేళ్ల క్రితం ప్రారంభిస్తే అటవీ శాఖ అభ్యంతరం

- నాలుగేళ్ల క్రితం అనుమతులు వస్తే నిధుల కొరత

- 24 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే రెండు జిల్లాల మధ్య రాకపోకలకు మార్గం సుగమం


అల్లూరి సీతారామరాజు జిల్లా- మన్యం జిల్లా అనుసంధాన రహదారికి మోక్షం కలగడం లేదు. నిధులున్న సమయంలో రహదారి నిర్మాణానికి అటవీశాఖ అభ్యంతరాలు చెప్పింది. అటవీశాఖ అనుమతులు ఇచ్చిన తరువాత నిధుల లేమితో పనులు పునఃప్రారంభం కాలేదు. లోతేరు నుంచి అలూరు వరకు 24 కిలో మీటర్ల మేర రహదారి నిర్మిస్తే రెండు జిల్లాల మధ్య రాకపోకలకు వీలుగా ఉంటుంది. కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని అరకులోయ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అరకులోయ, జూన్‌ 25: అంతర్‌ జిల్లా రహదారి నిర్మాణానికి నిధుల కొరత వేధిస్తోంది. గతంలో అటవీ శాఖ అనుమతులు లేక ఈ రోడ్డు పనులు నిలిచిపోతే, ఆ తరువాత అనుమతులు వచ్చినా నిధుల కొరత వల్ల పనులు ముందుకు సాగడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో లోతేరు నుంచి పాచిపెంట రహదారి నిర్మాణానికి సుమారు పదేళ్ల క్రితం అప్పటి కేంద్ర గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, అరకు ఎంపీ కిశోర్‌చంద్రదేవ్‌ రూ.5 కోట్లు మంజూరు చేశారు. పనులకు సంబంధించి లోతేరులో అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించి సుమారు 5 కిలో మీటర్ల మేర మట్టి రోడ్డు వేశారు. ఈలోగా అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అడవి మార్గం నుంచి రహ దారి నిర్మించాల్సి ఉన్నందున కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు పొందాలని  పనులను నిలిపివేశారు. దీంతో అప్పటి నుంచి పనులు నిలిచి పోయాయి. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. కానీ నిధులు లేని కారణంగా పనులు ప్రారంభం కాలేదు. 

నిధులు మంజూరైతే..

పార్వతీపురం ఐటీడీఏకి సరిహద్దు, పాడేరు ఐటీడీఏకి చివర గ్రామం అలూరు. లోతేరు నుంచి అలూరు వరకు 24 కిలో మీటర్ల మేర రహదారిని పాడేరు ఐటీడీఏ నిర్మించాల్సి ఉంది. ఈ అంతర్‌ జిల్లా రహదారిని అభివృద్ధి చేస్తే పార్వతీపురం, విజయనగరం, అల్లూరి జిల్లాకు రాకపోకలకు వీలుంటుంది. సాలూరు, పార్వతీపురం, పాచిపెంట నుంచి వయా లోతేరు, అరకులోయకు రహదారి సౌకర్యం ఏర్పడుతుంది. అటవీశాఖ అనుమతులు సైతం వచ్చినందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారి అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పార్వతీ పురం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం వంటి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు ఈ రహదారి ఎంతగానో  ఉపయోగపడుతుంది.

24 కిలో మీటర్ల మేర రహదారి నిర్మిస్తే..

లోతేరు నుంచి మొర్రిగుడ, ఇరగాయి, తోటవలస, బుర్రచింత, పెదగరువు, చోర్‌పొదోర్‌, గాతపాడు మీదుగా అలూరు వరకు 24 కిలో మీటర్ల మేర రహదారి నిర్మించాల్సి ఉంది. ఈ గ్రామాలన్నీ పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న లోతేరు- ఇరగాయి పంచాయతీ పరిధి గ్రామాలు. పార్వతీపురం ఐటీడీఏ పరిధికి వచ్చే అలూరు వరకు తారురోడ్డును పార్వతీపురం ఐటీడీఏ నిర్మించింది. లోతేరు నుంచి అలూరు వరకు తారురోడ్డు వేస్తే 55 కిలో మీటర్లు ప్రయాణిస్తే పాచిపెంట, మరో 5 కిలోమీటర్లు వెళితే సాలూరు చేరుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రహదారి నిర్మాణానికి కలెక్టర్‌, ఐటీడీఏ పీవో కకృషి చేయాలని అరకులోయ వాసులు కోరుతున్నారు.

Updated Date - 2022-06-26T06:06:08+05:30 IST