దారి దయనీయం.. సాగని ప్రయాణం

ABN , First Publish Date - 2022-08-05T03:56:14+05:30 IST

అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారి. దానిమీదుగానే ప్రయాణికులు నానా కష్టాలు పడి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.

దారి దయనీయం.. సాగని ప్రయాణం
ఓవర్‌ లోడ్‌ లారీల వల్ల పడిన గుంతలు

ఓవర్‌ లోడ్‌ లారీలతో గోతుల మయంగా రోడ్డు

నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులు

ఇదీ బోనకల్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డు దుస్థితి

బోనకల్‌, ఆగస్టు 4: అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారి. దానిమీదుగానే ప్రయాణికులు నానా కష్టాలు పడి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అయితే ఇటీవల ఈ మార్గంలో ఓవర్‌ లోడ్‌ లారీలు వెళ్తుండటంతో రహదారి గుంతల మయంగా మారింది. దీంతో ప్రయాణికులు నరకం చూస్తన్నారు. ఖమ్మం బస్టాండ్‌ సెంటర్‌ నుంచి బోనకల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు అర కిలో మీటరు దూరం ఉంటుంది. రైళ్ల ద్వారా రాకపోకలు జరిపే ప్రయాణికులు గతంలో రోడ్డు మార్గం సరిగ్గా లేక, రాత్రి వేళల్లో విద్యుత్‌ లైటింగ్‌ లేక నానా అవస్థలు పడేవారు. పలువురు ప్రజా ప్రతినిధులకు రోడ్డు వేయించాలని ప్రజలు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. కొన్ని నెలల నుంచి నవభారత్‌ ప్లాంట్‌ లారీలు రైల్వే స్టేషన్‌కు వస్తున్నాయి. గూడ్సు రైలు ద్వారా వచ్చే బొగ్గును బోనకల్‌ రైల్వే స్టేషన్లో అన్‌లోడ్‌ చేసి లారీలకు లోడింగ్‌ ద్వారా పంపిస్తున్నారు. అదిక లోడ్‌ ఉండటంతో రహదారిలో పెద్ద గుంతలు పడ్డాయి. వర్షకాల సీజన్‌ కావడంతో నీరు లిలిచి వాహనాలు దిగబడి నిలిచి పోతున్నాయి. కనీసం ప్రయాణీకులు నడిచి వెళ్లేందుకు కాలిబాట కూడా లేకపోవడంతో రైల్వే ట్రాక్‌ పక్క నుంచి నడుచుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. రహదారి కేంద్ర ప్రభుత్వ పరిధిలో రోడ్డు ఉండటంతో దానికి మరమ్మతులు జరిపించాలన్నా రైల్వేశాఖ నుంచి ఉత్తర్వులు రావాలి. అది ఇప్పట్లో జరిగే పని కాదని ప్రజలు అంటున్నారు. కనీసం లారీలతో బొగ్గును తరలిస్తున్న కంపెనీదారులైనా తమ ల అవస్థలను దృష్టిలో ఉంచుకొని రోడ్డు వేసి మానవత్వం చాటుకోవాలని పలువురు కోరుతున్నారు. ఓవర్‌ లోడ్‌ లారీల రద్దీ వల్ల రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు శబ్ద, వాయు కాలుష్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రయాణికుల కోసం రోడ్డు వేయాలి

యార్లగడ్డ రాఘవ, ఉప సర్పంచ్‌, బోనకల్‌

ప్రయాణికుల కోసం రోడ్డు వేయాలి. ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీల వల్ల రహదారి అధ్వానంగా మారింది. రాత్రి వేళల్లో ప్రయాణికులు రైల్వే స్టేషన్‌ నుంచి ఇళ్లకు వచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కంపెనీ ప్రతినిధులు రోడ్డు వేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలి.

దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నాం

సుగ్గుల బ్రహ్మం, వ్యాపారి, బోనకల్‌

రైల్వే స్టేషన్‌కు ఎక్కువగా లారీలు వెళ్తుండటం వల్ల దుమ్ము లేచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అదిక లోడ్‌తో లారీలు వెళ్తున్నందున రైల్వే స్టేషన్‌ దారి పూర్తిగా దెబ్బతిన్నది. రహదారికి మరమ్మతులు చేయడంతో పాటు దుమ్ము రాకుండా ఎప్పటికప్పుడు రోడ్ల పై నీళ్లు చల్లించాలి.

Updated Date - 2022-08-05T03:56:14+05:30 IST