రోడ్డు మార్జినపై నేతల కన్ను

ABN , First Publish Date - 2021-10-27T05:19:29+05:30 IST

రోడ్డు మార్జినపై వైసీపీ నేతల కన్ను పడింది. అక్కడ అనధికార రైతు బజార్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైనట్టు తెలుస్తోంది.

రోడ్డు మార్జినపై నేతల కన్ను
టీజేపీఎస్‌ కళాశాల నుంచి బ్రాడీపేట వైపు వెళ్లే రోడ్డు మధ్యలో తోపుడు బండ్ల కోసం ఇచ్చిన మార్కింగ్‌

షెడ్లు వేసి అనధికార రైతుబజారుకు సన్నాహాలు

తోపుడు బండ్ల ముసుగులో లక్షల్లో వసూలుకు పథకం

ఇప్పటికే 45 షాపులకు మార్కింగ్‌ పూర్తి

షాపు కేటాయింపునకు రూ.50 వేలు... నెలకు రూ.6 వేలు

అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కార్పొరేటర్‌

 

గుంటూరు, అక్టోబరు 26: రోడ్డు మార్జినపై వైసీపీ నేతల కన్ను పడింది. అక్కడ అనధికార రైతు బజార్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. కార్పొరేషనకు చెందిన రోడ్డు మార్జిన స్థలంలో ఏకంగా షెడ్లువేసి రైతుల ముసుగులోని దళారులకు కేటాయించి పెద్దఎత్తున వసూలు చేయాలని నిర్ణయించినట్టు ఆరోపణలొస్తున్నాయి. వివరాల్లో వెళితే..

నగరంలోని టీజేపీఎస్‌ కళాశాల మెయిన గేటు వద్ద నుంచి కంకరగుంట్ల ఫ్లైవోవర్‌ పక్కన రోడ్డు మార్జినలో తోపుడు బండ్లు పెట్టించాలని నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. అయితే అక్కడ పర్మినెంట్‌ షెడ్లు వేసి రైతుబజారుకు ఇద్దామని కొందరు కార్పొరేటర్లు ప్రతిపాదించారు. రోడ్డు మార్జినలో శాశ్వత షెడ్లు వేస్తే భవిష్యతలో ఇబ్బంది అవుతుందని భావించిన కమిషనర్‌ అందుకు నిరాకరించారు. దీంతో అక్కడ తాత్కాలికంగా టెంట్లు వేసి తోపుడుబండ్ల కోసం షాపులు కేటాయించాలని వైసీపీ నాయకులు పథకం వేసినట్టు ఆరోపణలొస్తున్నాయి.  ఇప్పటికే పదడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పులో సుమారు 45 షాపులకు మార్కింగ్‌ కూడా పూర్తి చేశారు. టీజేపీఎస్‌ కళాశాల వద్ద నుంచి పట్టాభిపురం పోలీస్‌స్టేషనకు వెళ్లే రోడ్డు వరకు 35వ డివిజనలోకి వస్తుంది. అక్కడి నుంచి కృష్ణాశ్రమం గోడ పక్కన బ్రాడీపేట రైస్‌ మిల్లుకు వెళ్లే రోడ్డు వరకు ఉన్న స్థలం 34వ డివిజన పరిధిలోకి వస్తుంది. అయితే తన డివిజన పరిధిలో ఆయా షాపులు ఇవ్వడానికి వీలులేదని, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే తన డివిజనలో ఉన్న నిరుపేద తోపుడుబండ్ల వ్యాపారులకే కేటాయించాలని, అలాకాకుండా అనధికార రైతుబజారు ఏర్పాటు చేయిస్తానంటే ఒప్పుకునేదిలేదని కార్పొరేటర్‌ వరప్రసాద్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే గడచిన నాలుగైదు రోజులుగా మార్కింగ్‌ ఇచ్చిన స్థలాల్లో నగరంలోని తోపుడుబండ్ల వ్యాపారులతో సంబంధం లేకుండా అనధికార రైతుబజారును ఏర్పాటు చేయించేందుకు కొందరు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పట్టాభిపురం రైతుబజారులో ఎస్టేట్‌ ఆఫీసర్‌గా పనిచేసి సస్పెన్షనకు గురైన హమీద్‌ను కొందరు కార్పొరేటర్లు రంగంలోకి దించినట్టు తెలిసింది. ఆయనకు గతంలో ఉన్న పరిచయాల ఆధారంగా పాత రైతుబజారులోని షాపుల నిర్వాహకులను గుర్తించి వారితో మాట్లాడి వారికి ఆయా షాపులు కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.  ఇక్కడ ముందుగా తోపుడుబండ్లకు అవకాశం ఇచ్చి కాలక్రమేణా వాటిని షాపుల తరహాలో మారుస్తామని కూడా ఆయా రైతులకు భరోసా ఇస్తున్నట్టు సమాచారం. ఇక్కడ మార్కింగ్‌ ఇచ్చిన స్థలంలో షాపు కేటాయిస్తే రూ.50 వేలు, ఆ తర్వాత నెలకు రూ.6 వేల అద్దె చొప్పున తమకు ఇవ్వాలని కొందరు కార్పొరేటర్లు తేల్చి చెప్పినట్టు ఆరోపణలొస్తున్నాయి. ప్రస్తుతం 45 షాపులకు మార్కింగ్‌ ఇవ్వగా అవసరమైతే ఒక్కో షాపు వైశాల్యం తగ్గించి 60 షాపులు పెంచి పెద్ద మొత్తంలో వసూలు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. దీనిపై నగరపాలక సంస్థ అధికారులు స్పందించి తోపుడుబండ్ల వారికి అవకాశం కల్పించాలనుకుంటే అర్హులైన వారిని ఓపెన ప్రాతిపదికన గుర్తించాలని, అంతేగాక వారి నుంచి చార్జీల రూపంలో వసూలు చేయాలనుకుంటే అది కూడా అధికారికంగానే ఉండాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నేతలు ఎలా అద్దెకు ఇచ్చుకుంటారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.  ఈ వ్యవహారంపై నగరపాలక సంస్థ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ ప్రాంతం మెయిన రోడ్డు పక్కన ఉండటంతో  ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందని, దీనిపై ట్రాఫిక్‌ పోలీసులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

  

Updated Date - 2021-10-27T05:19:29+05:30 IST