పైపై మెరుగులు..నాసిరకం పనులు

ABN , First Publish Date - 2021-05-17T04:49:16+05:30 IST

మండలంలోని తూర్పురొంపిదొడ్ల మీదుగా ఇటీవల చేపట్టిన ఆర్‌ అండ్‌ బీ రోడ్డు మార్జిన్‌ పనులు నాసిరకంగా జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

పైపై మెరుగులు..నాసిరకం పనులు
నాసిరకంగా చేపట్టిన రోడ్డు మార్జిన్‌ పనులు

ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్జిన్‌పై విమర్శలు

వరికుంటపాడు, మే 16: మండలంలోని తూర్పురొంపిదొడ్ల మీదుగా ఇటీవల చేపట్టిన ఆర్‌ అండ్‌ బీ రోడ్డు మార్జిన్‌ పనులు నాసిరకంగా జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. నాణ్యత గల గ్రావెల్‌ కాకుండా సమీపంలోని నాసికరం మట్టితోనే పైప మెరుగులు దిద్దారు. పటిష్టంగా ఉండాల్సిన రోడ్డు మార్జిన్‌ పనులు నాసిరకంగా చేయడంతో ప్రతినిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో గుత్తేదారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి రోడ్డు పక్కనే ఉన్న మట్టిని ఎక్స్‌కవేటర్‌తో తీయించి అక్కడే పోసి చదును చేశారు. దారి పొడవునా పెద్ద పెద్ద రాళ్లు కూడా ఉండడంతో ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు రోడ్డు దిగాలంటే ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుందని బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాకుండా అటుగా వెళ్లాలంటే దుమ్ముధూళితో నిండిపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. అసలే సింగిల్‌రోడ్డుకు తోడు ప్రమాదకర మలుపులు ఉండడంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చే సమయంలో నానాయాతన అనుభవించక తప్పడంలేదు. తూతూమంత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకు న్నారే తప్ప ప్రయాణికుల శ్రేయస్సును ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అఽధికారులు దృష్టిసారించి రోడ్డుమార్జిన్‌ పనుల్లో నాణ్యత పాటించి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2021-05-17T04:49:16+05:30 IST