Road తవ్వితే వాలిపోతారు.. ఇదో రకం దోపిడీ.. బెదిరించి మరీ వసూళ్లు!

ABN , First Publish Date - 2021-11-30T14:01:38+05:30 IST

Road తవ్వితే వాలిపోతారు.. ఇదో రకం దోపిడీ.. బెదిరించి మరీ వసూళ్లు!

Road తవ్వితే వాలిపోతారు.. ఇదో రకం దోపిడీ.. బెదిరించి మరీ వసూళ్లు!

  • జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్రమార్జన
  • వాటర్‌బోర్డు సిబ్బందితో సమన్వయం
  • సంస్థ ఖజానాకు భారీగా గండి

హైదరాబాద్‌ సిటీ : ముషీరాబాద్‌ బాకారంలో డ్రైనేజీ పైపులైను మార్చేందుకు ఓ వ్యక్తి రోడ్డు తవ్వాడు. ఇది గమనించిన జీహెచ్‌ఎంసీ క్షేత్రస్థాయి సిబ్బంది కొందరు అక్కడికి వచ్చి నానా హంగామా చేశారు. ఇంటి యజమాని, వారి కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడడమే కాకుండా పరికరాలు తీసుకెళ్లారు. గంట తర్వాత మరో ఇద్దరు రంగప్రవేశం చేశారు. ‘అనుమతి లేకుండా రోడ్డు తవ్వుతున్నారు. పునరుద్ధరణకు రూ.12 వేలు చెల్లించాలి’ అని డిమాండ్‌ చేశారు. తెలిసిన వారి ద్వారా ఫోన్‌ చేయిస్తే డీడీ నిమిత్తం రూ.3 వేలు, మరో రూ.2 వేలు తీసుకుని వెళ్లిపోయారు. 


రామంతాపూర్‌ శ్రీనివాసపురం కాలనీలో కూడా రోడ్డు తవ్విన ఓ ఇంటి యజమానికి జరిమానా వేస్తామని, పోలీస్‌ కేస్‌ అవుతుందని భయపెట్టారు. రూ.3 వేలు తీసుకొని వెళ్లిపోయారు. రహదారుల తవ్వకాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది కొందరు అక్రమార్జన వనరుగా మార్చుకుంటున్నారు. గ్రేటర్‌లోని చాలా ప్రాంతాల్లో నిత్యం ఈ తరహా తతంగాలు జరుగుతున్నాయి. అనుమతి తీసుకోవాలనే విషయం తెలియక కొందరు, తెలిసినా ఏమవుతుందన్న ఉద్దేశంతో మరి కొందరు పౌరులు యథేచ్ఛగా రోడ్లు తవ్వుతున్నారు. అదే అదనుగా క్షేత్రస్థాయి సిబ్బంది వారిని భయాందోళనకు గురి చేసి అందినంత దోచుకుంటున్నారు. డీడీ చెల్లిస్తే ఇంతవుతుంది, అంతవుతుందని లెక్కలేసి అందులో సగమిస్తే ఓకే అని జేబులు నింపుకుంటున్నారు.


ఏటా రూ. 50 కోట్ల ఖర్చు..

పునరద్ధరణకు నిర్ణీత మొత్తం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పేరిట డీడీ చెల్లించిన తర్వాతే రోడ్డు తవ్వకానికి అధికారులు అనుమతి ఇస్తారు. పైపులైన్ల కోసం ఎక్కువగా తవ్వకాలు చేపడుతోన్న నేపథ్యంలో రన్నింగ్‌ మీటర్‌ లెక్కన పునరుద్ధరణ చార్జీలు లెక్కిస్తారు. బీటీ రోడ్డయితే రన్నింగ్‌ మీటర్‌కు రూ.4320, సీసీ రోడ్లయితే రూ.2430 తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సర్కిళ్లలో క్షేత్రస్థాయిలో ఉండే కామాటి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇతర సిబ్బంది మెజార్టీ రోడ్ల తవ్వకాలకు సంబంధించి డీడీలు తీసుకోకుండా డబ్బులు తీసుకుని జేబులో వేసుకుంటున్నారు. దీంతో సంస్థ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఏటా తవ్విన రహదారుల పునరుద్ధరణకు జీహెచ్‌ఎంసీ రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 


డీడీల రూపంలో వాటిలో 60 శాతంలోపే వసూలవుతున్నాయి. కేబుల్‌, పైపులైన్‌, ఇతరత్రా పనుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు నిర్ణీత రుసుము చెల్లించి అనుమతి తీసుకుంటుండగా.. కాలనీలు, బస్తీల్లోని ఇళ్ల వద్ద తవ్వుతోన్న వారి నుంచే కొందరు సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సాధారణ పనుల్లో జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు ఉద్యోగుల మధ్య లేని సమన్వయం వసూళ్ల దగ్గర స్పష్టంగా కనిపిస్తోంది. మొదట ఓ విభాగం వాళ్లు వసూలు చేస్తే.. కొన్ని గంటల్లోనే మరో విభాగం వాళ్లు అక్కడ వాలిపోతున్నారు


నిషేధం ఎత్తివేయడంతో..

వర్షాకాలం నేపథ్యంలో జూన్‌ నుంచి అక్టోబర్‌ 31 వరకు నగరంలో రోడ్ల తవ్వకాలపై జీహెచ్‌ఎంసీ నిషేధం విధించింది. అత్యవసర పనులు మినహా ఇతరత్రా తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు. ఈ నెల ఒకటి నుంచి నిషేధం ఎత్తివేసింది. వివిధ పనుల కోసం పునరుద్ధరణ చార్జీలు చెల్లించి సంబంధిత అధికారి అనుమతి పొంది రహదారులు తవ్వుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో నాలుగు వారాలుగా నగరంలో రోడ్ల తవ్వకాలు విరివిగా జరుగుతున్నాయి. తాగునీరు, సివరేజీ పైపులైన్‌ అనుసంధానం కోసమే ఎక్కువగా రహదారులు తవ్వుతారు. అనుమతి తీసుకుని చాలా మంది ఈ పనులను రాత్రి వేళలోనో, ఆదివారమో చేస్తుంటారు.

Updated Date - 2021-11-30T14:01:38+05:30 IST