Road Construction : ఇష్టారాజ్యం.. ఐఆర్‌సీ ప్రమాణాలకు తిలోదకాలు.. తూతూమంత్రంగా మిల్లింగ్‌

ABN , First Publish Date - 2022-01-08T16:00:42+05:30 IST

రహదారుల నిర్మాణం అశాస్ర్తీయంగా జరుగుతోంది. రోడ్ల ఎత్తు పెరగకుండా...

Road Construction : ఇష్టారాజ్యం.. ఐఆర్‌సీ ప్రమాణాలకు తిలోదకాలు.. తూతూమంత్రంగా మిల్లింగ్‌

  • రహదారుల నిర్మాణంలో అదే అశాస్ర్తీయత 
  • మూడున్నర అంగుళాల మేర రోడ్డు
  • వాహనదారులకు ప్రాణ సంకటం 
  • వరద ప్రవాహానికి ఆటంకం

హైదరాబాద్‌ సిటీ : రహదారుల నిర్మాణం అశాస్ర్తీయంగా జరుగుతోంది. రోడ్ల ఎత్తు పెరగకుండా మిల్లింగ్‌ చేయాల్సి ఉండగా, ప్రైవేట్‌ ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు. ‘ప్రైవేట్‌ సంస్థలు చేసిందే మిల్లింగ్‌, వేసిందే రోడ్డు అన్నట్టుగా’ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎప్పటిలానే రహదారుల ఎత్తు క్రమేణా పెరుగుతోంది. ఇది వరద ప్రవాహ వ్యవస్థకు ఆటంకంగా మారడంతో పాటు, మ్యాన్‌హోళ్ల మూతలు కనిపించకుండా పోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు, డివైడర్లకు సమానంగా, అంతకంటే ఎక్కువ ఎత్తులో రోడ్లు ఉంటుండడం  ప్రమాదాలకు కారణమవుతోంది. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) ప్రమాణాల ప్రకారం రహదారులు నిర్మించేందుకు ఉద్దేశించిన మిల్లింగ్‌ నామ్‌ కే వాస్తేగా మారింది. అర అంగుళం మేర రహదారిని తొలగించి.. మూడు, మూడున్నర అంగుళాల మేర రోడ్డు నిర్మిస్తున్నారు.


ఫ్లై ఓవర్‌ను తాకుతూ..

 మహా నగరంలోని చాలా ప్రాంతాల్లో రహదారుల ఎత్తు అనూహ్యంగా పెరుగుతోంది. తెలుగు తల్లి వంతెన వద్ద రోడ్డు ఎత్తు పెరిగి ట్రక్కులు, భారీ వాహనాలు ఫ్లై ఓవర్‌ పై భాగాన్ని తాకుతున్నాయి. దీంతో ఆ వంతెన నిర్మాణ స్థిరత్వంపై ప్రభావం పడుతోంది. ఐఆర్‌సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రోడ్డుకూ కేంబర్‌(రోడ్డు మధ్యలో ఎత్తుగా ఉండడం) ఉండాలి. అక్కడి భౌగోళిక పరిస్థితిని బట్టి కేంబర్‌ ఎలా, ఎంత ఉండాలన్నది అంచనా వేసి.. దాని ఆధారంగా రోడ్డు డిజైన్‌ చేస్తారు. నగరంలో ఆ పరిస్థితి లేదు. 


ప్రైవేట్‌కు ఇచ్చినా.. 

గ్రేటర్‌లో 9013 కి.మీల మేర రహదారులున్నాయి. ఇందులో బీటీ రోడ్లు 2846 కి.మీలు కాగా, సీసీ రహదారులు 6167 కి.మీలు. కాంప్రహెన్సీవ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ)లో భాగంగా 709.49 కి.మీల మేర రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారు. ఐదేళ్ల కాల వ్యవధికి రూ.1839 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. రోడ్ల నిర్మాణంతోపాటు ఆయా మార్గాల్లో పారిశుధ్యం, సివరేజీ, ఫుట్‌పాత్‌ల నిర్వహణ బాధ్యతా ఆయా సంస్థలదే. ఈ క్రమంలో గ్రేటర్‌లోని ప్రధాన రహదారుల పునర్నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టారు. 


ఎత్తు పెరిగి ప్రమాదాలు..

 ఒప్పందం ప్రకారం ప్రైవేట్‌ సంస్థలు మిల్లింగ్‌ చేసి రోడ్లు నిర్మించాలి. మరమ్మతు పనులూ శాస్ర్తీయంగా చేపట్టాలి. అంతకుముందున్న బీటీ పొరను రెండంగుళాల మేర, తద్వారా ఉత్పన్నమైన వ్యర్థాలు, దుమ్ము, ధూళి తొలగించి రహదారి నిర్మించాలి. మెజార్టీ మెయిన్‌ రోడ్లలో తూతూమంత్రంగా మిల్లింగ్‌ జరుగుతోంది. అంగుళంలోపు మాత్రమే పై పొర తొలగిస్తుండగా, కార్పెటింగ్‌తో రహదారి ఎత్తు మూడు నుంచి మూడున్నర అంగుళాల మేర పెరుగుతోంది. దీంతో రోడ్డు అంచుల్లో ఎత్తు పెరిగి.. వాహనదారులు అదుపు తప్పి కింద పడుతున్నారు. డిసెంబర్‌ 31న ఓ యువతి సికింద్రాబాద్‌లో రోడ్డు, ఫుట్‌పాత్‌ మధ్య గ్యాప్‌లోకి ద్వి చక్ర వాహనం వెళ్లడంతో కింద పడగా తలకు గాయాలయ్యాయి.


కొన్ని చోట్ల రోడ్లు ఫుట్‌పాత్‌లకు సమానంగా, అంతకంటే ఎక్కువగా ఉంటున్నాయి. డివైడర్ల ఎత్తు వరకు రోడ్లు ఉండడంతో వాహనదారులు ఓ వైపు నుంచి మరో వైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు పట్టించుకోక పోవడం వల్లే ప్రైవేట్‌ సంస్థలు తోచిన విధంగా పని చేస్తున్నాయని, అంతిమంగా రహదారుల వ్యవస్థ దెబ్బతినడంతోపాటు, పౌరులకు ఇబ్బందులు తప్పడం లేదని నిపుణులు చెబుతున్నారు. రూ.1800 కోట్ల పైచిలుకు ప్రజాధనాన్ని ప్రైవేట్‌ సంస్థలకు ఇస్తున్నప్పుడు, కనీస బాధ్యతగా అధికారులు వ్యవహరించకపోవడంపై విమర్శలు వ్యక్తవుతున్నాయి.


అదేం మిల్లింగ్‌..?

 రోడ్డు స్థితి ఎలా ఉందన్నది ముందు గుర్తించి ఎంత మేర మిల్లింగ్‌ చేయాలన్నది నిర్ణయించాలి. రహదారి సాంద్రత, బలం, భౌగోళిక స్వరూపం ఎలా ఉందన్నది పరిశీలించాలి. వరద, మురుగు నీటి వల్ల రోడ్డు ఎంత మేర పాడైందన్నది చూడాలి. ఆయా అంశాల పరిశీలన అనంతరం ఎంత మేర మిల్లింగ్‌ చేయాలన్న దానిపై ఒక అంచనాకు రావాలి. కానీ నగరంలో మిల్లింగ్‌ అలంకార ప్రాయంగా మారింది. శాస్ర్తీయంగా రహదారి నిర్మాణాలు చేపడితేనే సమస్యకు పరిష్కారం. - ప్రొ. లక్ష్మణ్‌రావు, జేఎన్‌టీయు, రవాణా విభాగం.

Updated Date - 2022-01-08T16:00:42+05:30 IST