నెత్తురోడుతున్న రహదారులు

ABN , First Publish Date - 2022-05-29T04:06:09+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిత్యం రక్తమోడుతున్న రహదారులు ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి.. జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకోవడం కలవర పెడుతోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. అతి వేగం, నిబంధనలు పాటించకపోవడం, వాహనదారుల నిర్లక్ష్యం, రహదారులు గుంతలమయంగా ఉండడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

నెత్తురోడుతున్న రహదారులు
ఇందారం చెక్‌పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ కింద దంపతుల మృతదేహాలు (ఫైల్‌)

నాలుగు నెలల్లో 152 రోడ్డు ప్రమాదాలు

61 మంది మృత్యువాత 

కలవర పెడుతున్న రోడ్డు ప్రమాదాలు

చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు 

బెల్లంపల్లి, మే 28: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిత్యం రక్తమోడుతున్న రహదారులు ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి.. జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకోవడం కలవర పెడుతోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. అతి వేగం, నిబంధనలు పాటించకపోవడం, వాహనదారుల నిర్లక్ష్యం, రహదారులు గుంతలమయంగా ఉండడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 

నాలుగు నెలల్లో ప్రమాదాలు ఇలా.. 

జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులు ఉండడంతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. సింగరేణితోపాటు పలు పరిశ్రమలు ఉండడం, కార్మికుల సంఖ్య అధికంగా ఉండడంతో నిత్యం రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఎన్‌హెచ్‌63 రహదారి శ్రీరాంపూర్‌ నుంచి తాండూర్‌ మండలంలోని రేపల్లెవాడ వరకు దాదాపు 40 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. జాతీయ రహదారి కావడంతో నిత్యం ఈ రహదారిపై వేలాది గూడ్స్‌ లారీలు ప్రయాణిస్తుంటాయి. అదే విధంగా ఇందారం ఎక్స్‌రోడ్డు నుంచి జైపూర్‌, చెన్నూరు మీదుగా మహారాష్ట్రకు వెళ్లే విధంగా ప్రధాన రహదారి సైతం ఉంది. ఈ రహదారి గుండా ఎక్కువ శాతం బొగ్గు, ఇసుక లారీలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి. అంతేకాకుండా శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో ఓపెన్‌కాస్టులతోపాటు బొగ్గు గనులు ఉండడంతో బొగ్గు రవాణా చేసే టిప్పర్లు ఎక్కువ సంఖ్యలో రహదారి గుండా వెళ్తుంటాయి. జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి సబ్‌ డివిజన్‌ల పరిధిలో రహదారులపై  నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ద్విచక్ర వాహనాల కారణంగా జరిగేవే అధికంగా ఉంటున్నాయి. అంతేకాకుండా లారీల డ్రైవర్లు జాతీయ రహదారిపై అతి వేగంగా, నిద్రమత్తులో, మద్యం సేవించి నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 

జనవరిలో 35 రోడ్డు ప్రమాదాలు జరగగా 13 మంది మృతిచెందగా 34 మంది గాయాలపాలయ్యారు.

ఫిబ్రవరిలో 33 రోడ్డు ప్రమాదాలు జరగగా 13 మంది మృతిచెందారు.  25 మంది గాయపడ్డారు.

మార్చిలో 44 రోడ్డు ప్రమాదాలు జరగగా 21 మంది మృతి చెందగా 28 మంది గాయాలపాలయ్యారు. 

ఏప్రిల్‌లో 40 రోడ్డు ప్రమాదాలు జరగగా 14 మంది మృతి చెందారు. ఇందులో 28 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 

మొత్తం 152 రోడ్డు ప్రమాదాలు జరగగా  61 మంది మృతిచెందగా,  115 మంది తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలో ఎక్కువ శాతం ప్రమాదాలు జైపూర్‌-ఇందారం, దండేపల్లి, శ్రీరాంపూర్‌, సీసీ, నస్పూర్‌, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్‌లలో చోటు చేసుకుంటున్నాయి. మరణించిన వారిలో యుక్త, మధ్య వయస్కులే అధికంగా ఉండడం గమనార్హం. రహదారులపై పోలీసులు పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ హెచ్చరిక బోర్డులపై రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులకు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. 

చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు 

జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వాహనదారుల అతి వేగం, నిర్లక్ష్యంతోనే చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు పాడైపోవడంతో ఆ ప్రాంతాల్లో సూచిక బోర్డులు లేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణ పనులు శ్రీరాంపూర్‌ నుంచి చెన్నూరు వరకు, మంచిర్యాల నుంచి రేపల్లెవాడకు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోపాటు ఒక సైడ్‌లో వాహనాలు ప్రయాణిస్తుండడంతో వాహనదారులు గమనించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరికొందరు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్‌, త్రిపుల్‌ రైడింగ్‌, అతి వేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో యువకులు, ఇంటి పెద్దలు మృత్యువాత పడుతుండడంతో బాధిత కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. 

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం

 - ఎడ్ల మహేష్‌, ఏసీపీ, బెల్లంపల్లి  

రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం. వాహనదారులు తమ వాహనాలను నిర్లక్ష్యంగా నడపకుండా గమ్యాన్ని చేరుకోవాలి. అదే విధంగా మద్యం సేవించి, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేయరాదు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ లేకుండా వాహనాన్ని నడిపి తలకు దెబ్బ తగలడంతో మృత్యువాత పడుతున్నారు. హెల్మెట్‌ ధరించి ద్విచక్రవాహనాలు నడపాలి.  రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం.  

Updated Date - 2022-05-29T04:06:09+05:30 IST