మనవడి చివరి చూపుకొచ్చి కడతేరిపోయారు!

ABN , First Publish Date - 2020-07-04T11:09:54+05:30 IST

రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను కబళిస్తాయన్న చేదు నిజం పీలేరు, కలకడ మండలాల్లో శుక్రవారం మరోమారు

మనవడి చివరి చూపుకొచ్చి కడతేరిపోయారు!

కుటుంబాన్ని కబళించిన రోడ్డు ప్రమాదాలు 

ఒకే రోజు ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి 

ఆటోను ఢీకొన్న ఐషర్‌ వాహనం 

ఐదుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు 

ఉదయం మనవడు...రాత్రి అవ్వాతాతలు, మేనత్త, మరో బంధువు దుర్మరణం 

పీలేరు, కలకడలో విషాద ఛాయలు 


పీలేరు/పీలేరు టౌన్‌/కేవీపల్లె/కలకడ, జూలై 3: రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను కబళిస్తాయన్న చేదు నిజం పీలేరు, కలకడ మండలాల్లో శుక్రవారం మరోమారు రుజువైంది. తల్లి వర్ధంతి సందర్భంగా ఆమె సమాధి సందర్శనకు వెళ్లిన కుమారుడు ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని చివరి చూపుకొచ్చిన అవ్వలు, తాత, మేనత్త, మరో బంధువు కడతేరిపోయిన సంఘటన శుక్రవారం పీలేరు, కలకడ మండలాల్లో చోటు చేసుకుంది. పీలేరు, కేవీపల్లె, కలకడ మండలాల్లో విషాద ఛాయలు నింపిన ఈ సంఘటనల వివరాలిలా ఉన్నాయి.


కలకడ మండలం బాటవారిపల్లె పంచాయతీ కొత్తగాండ్లపల్లెకు చెందిన ఆదినారాయణ పీలేరులో బోర్‌ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ప్రభావతమ్మ ఏడేళ్ల క్రితం కాలం చేసింది. శుక్రవారం ప్రభావతమ్మ వర్ధంతి కావడంతో ఆమె సమాధిని సందర్శించడానికి ఆదినారాయణ తనయుడు మహేశ్‌(20) తన ద్విచక్ర వాహనంలో కొత్తగాండ్లపల్లెకు వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో బాటవారిపల్లె వద్ద అతని ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్లాపడడంతో తలకు తీవ్ర గాయాలై అతను అక్కడిక్కడే మరణించాడు. తిరుపతి సమీపంలోని శ్రీ విద్యానికేతన్‌లో మహేశ్‌ బాబు బీటెక్‌ అభ్యసిస్తున్నాడు. 


కేసు నమోదు చేసుకున్న కలకడ పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రమాద సమాచారాన్ని బంధువులకు తెలియజేశారు. మహేశ్‌ మృతి వార్త తెలుసుకున్న అతని తాత, తిరుపతి కొర్లగుంట మారుతీ నగర్‌లో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహించుకునే ఆర్‌.వెంకటరమణ(65), అతని భార్యలు ఆర్‌.పార్వతమ్మ(55), సుజన కుమారి(50), మేనత్త రెడ్డి గోవర్దిని తమ సమీప బంధువైన కలకడ మండలం దేవలంపల్లెకు చెందిన దామోదర్‌(28) ఆటోలో తిరుపతి నుంచి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ మహేశ్‌ మృతదేహాన్ని చూసుకున్న వీరు అతని అంత్యక్రియల ఏర్పాట్లు కోసం తమ సమీప బంధువులైన నీలావతి(38), ఆమె కుమార్తె పుష్పలత(15)లతో కలిసి  శుక్రవారం రాత్రి అదే ఆటోలో కొత్త గాండ్లపల్లెకు బయలుదేరారు.


మార్గమధ్యంలో కేవీపల్లె మండలం సొరకాయలపేట చెరువు కట్ట మీద వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఐషర్‌ వాహనం ఢీకొంది. అతివేగంతో వచ్చిన ఐషర్‌ వాహనం ఆటోను ఢీకొనడంతో ఆటో నుజ్జు నుజ్జు కాగా అందులోని వెంకటరమణ, పార్వతమ్మ, సుజన కుమారి, రెడ్డిగోవర్దిని అక్కడిక్కడే మరణించారు. మిగిలిన దామోదర్‌, నీలావతి, పుష్పలతను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ దామోదర్‌ కన్నుమూశాడు. తీవ్రంగా గాయపడిన నీలావతి, పుష్పలతలను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న బంధువులు పెద్ద సంఖ్యలో పీలేరు ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి ఆర్తనాదాలతో ఆసుపత్రి ప్రాంగణం శోకసంద్రమైంది. మదనపల్లె డీఎస్పీ రవి మనోహచారారి, పీలేరు, వాల్మీకిపురం సీఐలు సాధిక్‌ అలీ, శివభాస్కరరెడ్డి, ఎస్‌ఐలు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువులను ఓదార్చారు. 


వర్ధంతి రోజునే మరో ఆరు చావులు 

వర్ధంతి నాడే ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు విగత జీవులైన సంఘటన పలువురిని కలిచి వేసింది. తల్లి సమాధి సందర్శనకు వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం, అతనిని చూడడానికి వచ్చిన తాత, అవ్వలు, మేనత్త, మరో బంధువు ప్రాణాలు పోగొట్టుకోవడం చూసి వారి బంధువులు గుండెలవిసేలా రోదించారు.


ముక్కు పచ్చలారని మహేశ్‌ మృతదేహాన్ని చూసి బరువెక్కిన గుండెలతో ఉన్న వారి బంధువులు మరో ఐదుగురిని విగత జీవులుగా పడి ఉండడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఉన్నత చదువులు చదువుకుంటున్న మహేశ్‌ బాబు, రెడ్డిగోవర్దిని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన వారు అర్ధాంతరంగా తనువులు చాలించి చలనం లేకుండా పడి ఉండడం చూసి నిశ్ఛేష్టులయ్యారు. బంధువులు, గ్రామస్తుల రోధనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదాలు మృతుల స్వగ్రామం, పీలేరులోనూ తీవ్ర విషాదాన్ని నింపాయి. 

Updated Date - 2020-07-04T11:09:54+05:30 IST