Abn logo
Feb 21 2020 @ 08:31AM

నెత్తురోడిన రహదారులు.. 28 మంది దుర్మరణం

రెండు ప్రమాదాల్లో 28 మంది దుర్మరణం

తిరుప్పూరులో కంటైనర్‌-బస్సు ఢీ

21 మంది మృతి

సేలంలో ఏడుగురు నేపాలీయులు మృత్యువాత


శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని నానుడి. ఎవరి ఆజ్ఞ అయిందో కానీ శివరాత్రి ముందురోజే వారంతా శివైక్యం అయ్యారు. తెల్లారితే గమ్యస్థానానికి చేరుకోవాల్సినవాళ్లు ఒక కుదుపుతో కుదేలైపోయారు. వేగంగా దూసుకుపోతున్న లగ్జరీ బస్సులో ఆదమరచి నిద్రపోతున్న ప్రయాణీకులకు ఎదురుగా వచ్చిన కంటైనర్‌ మృత్యు శకటంలా మారింది. తిరుప్పూరు జిల్లా అవినాశి వద్ద గురువారం వేకువజామున సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది దుర్మరణం చెందారు. మృతులంతా కేరళవాసులే కాగా.. అదే సమయంలో సేలం జిల్లా ఓమలూరు వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఏడుగురు నేపాలీయులు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారులపై జరిగిన ఈ ప్రమాదాల కారణంగా క్షతగాత్రుల ఆర్తనాదాలతో వాహనచోదకులు, స్థానికులు హుతాశయులయ్యారు. మృతుల్లో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. 40 మందికిపైగా బస్సు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.


చెన్నై : రెండు ఘోర ప్రమాదాలు 28 మంది ప్రాణాలను బలిగొన్నాయి. తెల్లవారు జాగురువారం వేకువజామున అదుపుతప్పిన కంటైనర్‌ లగ్జరీ బస్సును ఢీకొనగా 21 మంది దుర్మరణం చెందారు. అదేసమయంలో సేలం జిల్లా ఓమలూరు వద్ద రెండు ఆమ్నీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఏడుగురు నేపాలీయులు అసువులు బాశారు. ఈ రెండు దుర్ఘటనల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు.. బెంగళూరు నుంచి 40మందికిపైగా ప్రయాణికులతో కేరళ ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన స్లీపర్‌ లగ్జరీ బస్సు ఎర్నాకులంకు బుధవారం రాత్రి బయలుదేరింది. ఆ బస్సు గురువారం వేకువజాము 3.30 గంటల సమయంలో తిరుప్పూరు జిల్లా అవినాసి రాక్కియాపాళయం వద్ద వెళుతుండగా కేరళలోని కొచ్చిన్‌ నుంచి సేలం నగరానికి టైల్స్‌లోడుతో వస్తున్న కంటైనర్‌ ముందు టైరు పంక్చరై అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను దాటుకుని బలంగా ఢీకొట్టింది. కంటైనర్‌  బస్సువాటున చొరబడి దానిని చాలా దూరం వరకూ లాక్కెళ్లింది. దీంతో  కంటైనర్‌ వేరుగా, ఇంజిన్‌ కేబిన్‌ వేరుగా విడిపోయాయి. 


ఇక కేరళ బస్సు ముందుభాగం, కుడివైపు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కేరళ బస్సు డ్రైవర్‌ బైజో, ప్రయాణికులు ఐశ్వర్య, మానసా మణికంఠన్‌ రోసనా (61), మరో డ్రైవర్‌ గిరీష్‌ (29), ఇగ్నీరఫేల్‌ (29), కిరణ్‌కుమార్‌ (33), హనీష్‌ (25), శివకుమార్‌ (35), రాకేష్‌ (35), జిస్మాన్‌ సాజు (24), నజీబ్‌ మహమ్మద్‌ అలీ (24), ఏసుదాసు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా పాలక్కాడు, త్రిసూరు ఎర్నాకులం జిల్లాలకు చెందినవారని పోలీసులు గుర్తించారు. 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు వెనుకసీటులోని ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి బస్సు శిథిలాల మఽధ్య చిక్కుకున్న మృతదేహాలను, గాయపడినవారిని వెలికి తీశారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం తిరుప్పూరు, కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  తిరుమురుగన్‌ పూండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పరారైన కంటైనర్‌ డ్రైవర్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా కోయంబత్తూరు- సేలం జాతీయ రహదారిలో మూడు గంటలకు పైగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


వేగమే ప్రాణం తీసింది

కంటైనర్‌ను పరిమితికి మించి అత్యంత వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాణగండం నుంచి తప్పించుకున్న ముగ్గురు ప్రయాణికులు తెలిపారు. అలెన్‌ అనే యువకుడు మాట్లాడుతూ, వేకువజాము 3.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పక్క రోడ్డులో వెళుతున్న కంటైనర్‌ టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి తమ బస్సు వెళుతున్న రోడ్డుపై పడి ఢీకొట్టిందని తెలిపారు. డ్రైవర్‌ సీటు వెనుక కూర్చుని ప్రయాణించి తృటిలో ప్రాణగండం నుంచి బయపడ్డ జెమిన్‌ జార్జ్‌ మాట్లాడు తూ, ప్రయాణికులంతా ఆదమరచి నిద్రిస్తున్న సమయం లో ఉన్నట్టుండి పెద్ద శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి లే చామని, అప్పటికే బస్సు ముందు భాగం, ఎడవైపు భాగం పూర్తిగా ధ్వంసమై గావుకేకలు వినిపించాయని తెలిపారు.  


ఘటనా స్థలికి కేరళ మంత్రులు

ఈ ప్రమాదంలో కేరళ రాష్ట్రీయులు మృతి చెందటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌ సంఘటన స్థలానికి ఇద్దరు మంత్రులను పంపుతున్నట్లు ప్రకటించారు. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సునీల్‌కుమార్‌, రవాణా శాఖ మంత్రి ఏకే శశీంద్రన్‌ తిరుప్పూరుకు ఆగమేఘాలపై చేరుకుని ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.  మృతులకు కేరళ ప్రభుత్వం పరిహారం కూడా ప్రకటించింది. 


మరో ప్రమాదంలో నేపాలీయుల బలి

సేలం జిల్లా ఓమలూరు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో తీర్థయాత్ర సాగిస్తున్న ఏడుగురు నేపాలీయులు దుర్మరణం చెందారు. నేపాల్‌లోని ఖాట్మండు ప్రాంతానికి చెందిన బీర్‌బహదూర్‌షా (26), పిక్కారామ్‌ (31), బుల్హరీ చౌద్రీ (34) గోపాల్‌ థామస్‌ సహా 33 మంది దేశంలో తీర్థయాత్ర చేపట్టారు. ఆమ్నీ బస్సులో బుధవారం ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారికి వెళ్ళారు. ఆ చోట వివేకానంద స్మారక మండటం, గాంధీ స్మారక మండపం, తిరువళ్లువర్‌ విగ్రహం, భగవతి అమ్మన్‌ ఆలయం తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆ తర్వాత వారందరూ రాజస్థాన్‌కు ఆమ్నీ బస్సులో బయలుదేరారు. ఆ బస్సు గురువారం వేకువజాము ఒంటిగంటకు సేలం- బెంగళూరు జాతీయ రహదారిలోని ఓమలూరు నరిపల్లం ప్రాంతంలో వెళుతుండగా ప్రయాణికులంతా అక్కడికి చేరువగా ఉన్న మారియమ్మన్‌ ఆలయంలో బసచేసి ఉదయం ప్రయాణాన్ని కొనసాగించాలని తెలిపారు. వారి కోరిక మేరకు బస్సు డ్రైవర్‌ బస్సును నరిపల్లం జాతీయ రహదారిలో యూ టర్న్‌ చేశాడు. అదే సమయంలో బెంగళూరు నుంచి కేరళకు వేగంగా వస్తున్న మరో ఆమ్నీ బస్సు ఢీకొంది. దీంతో నేపాల్‌ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు మధ్యభాగంలో కేరళ ఆమ్నీ బస్సు దూసుకెళ్ళింది. 


నేపాలీయులున్న బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బీర్‌ బహదూర్‌షా, (26), పిక్కారామ్‌ (31), బుల్హరీ చౌదరి (34) గోపాల్‌ థామస్‌ అనే నలుగురు తీవ్రంగా గాయపడి ఆ స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అంబులెన్స్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని బస్సు శిథిలాల మధ్య చిక్కుకుని గాయపడినవారిని వెలికి తీశారు. వీరిని చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బోధిని అనే మహిళ, విష్ణుడంగ్‌ అనే యువకుడు, మరో వ్యక్తి మృతి చెందారు.  దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాదం కారణంగా  గంటకు పైగా సేలం - బెంగళూరు జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు  తీవ్ర అంతరాయం కలిగింది. ఓమలూరు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ భాస్కర్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement