వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

ABN , First Publish Date - 2022-08-10T06:01:40+05:30 IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన మండల కేంద్రమైన దుర్గిలో మంగళవారం చోటుచేసుకుంది.

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
బాలు ,కాకి మరియమ్మ. రాచుమల్లు సాయిలక్ష్మి(ఫైల్‌ ఫోటో)

దుర్గి, ఆగస్టు 9: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన మండల కేంద్రమైన దుర్గిలో మంగళవారం చోటుచేసుకుంది. దుర్గికి చెందిన తిరుమలశెట్టి బాలు(40) మాచర్ల పట్టణంలోని ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తుంటాడు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఆదర్శ పాఠశాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన బాలు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య సీత, ఇరువురు కుమారులు ఉన్నారు. ఎస్‌ఐ బాలరవీందర్‌ కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


తల్లి కళ్లెదుటే కుమార్తె మృతి

యడ్లపాడు: రోడ్డుపై నిలిపి ఉంచిన బస్సును స్కూటీపై వెళుతున్న తల్లీకూతుళ్ళు ఢీకొనడంతో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా.. తల్లి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యడ్లపాడులోని నక్కవాగు సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని పద్మశాలిపేటలో రాచుమల్లు నాగలక్ష్మి, కుమార్తె సాయిలక్ష్మి(30) నివాసం ఉంటున్నారు. సాయిలక్ష్మి భర్త చనిపోవడంతో తల్లివద్దనే ఉంటూ ఆధార్‌ సెంటర్‌లో పనిచేస్తోంది. ఇటీవలఆమెకు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్ళి కుదిరింది. ఈ నేపఽథ్యంలో మొక్కు తీర్చుకునేందుకు తల్లితో కలసి బోయపాలెంలోని పార్వతీదేవి అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. నక్కవాగు సమీపంలోకి రాగానే ఆగి ఉన్న బస్సును ఢీకొట్టారు. ఈ ఘటనలో సాయిలక్ష్మి బస్సు వెనుక భాగంలో స్కూటీతో సహా ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందింది. నాగలక్ష్మిని 108 సిబ్బంది గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యడ్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సాయిలక్ష్మి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు. 


కారు ఢీకొని.. మహిళ...

యడ్లపాడు: మండలంలోని తిమ్మాపురం చర్చి సమీపంలో మంగళవారం ఉదయం 6.30గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. తిమ్మాపురం ఎస్సీ కాలనీకి చెందిన కాకి మరియమ్మ(38) పాల ప్యాకెట్టు కోసం హైవే రోడ్డు దాటుకుని ఆవలి వైపునకు వెళ్లింది. పాల ప్యాకెట్టు తీసుకుని తిరిగి రోడ్డు దాటేందుకు వస్తుండగా గుంటూరు వైపు వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఢీకొట్టిన కారు బోయపాలేనికి చెందిన ఓ వైసీపీ నాయకుని బంధువుకు చెందినదిగా పోలీసులు వెల్లడించారు. 


రోడ్డు ప్రమాదంలో మహిళ...

 తెనాలి క్రైం: తెనాలి - మంగళగిరి ప్రధాన రహదారి వెంట ఉన్న నందివెలుగు కూడలి వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీ కొట్టిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ తీవ్రగాయాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం చింతలపూడిలో నివాసముంటున్న మాణికల నాగులు, లక్ష్మి(32) దంపతులు, లక్ష్మి తమ్ముడు బండిచెంచయ్య, మరదలు ధనమ్మ నందివెలుగులో చికెన్‌ కొనుగోలు చేసేందుకు ఒకే ద్విచక్రవాహనంపై బయలు దేరారు. ప్రధాన రహదారిపైకి రాగానే విజయవాడ నుంచి తెనాలి వస్తున్న ఆర్టీసీ బస్సు వారి ద్విచక్రవాహనాన్ని వెనుకనుండి ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై నుంచి నలుగురు కింద పడ్డారు. ఘటనా స్థలంలోనే లక్ష్మి మృతి చెందగా మిగిలినవారికి గాయాలయ్యాయి. మృతురాలు, ఆమె భర్త గ్రామంలోని చెత్తసేకరణ విధులు నిర్వహిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-08-10T06:01:40+05:30 IST