ఆమ్నీ బస్సు బోల్తా: డ్రైవర్‌ సహా ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-06-16T15:01:11+05:30 IST

తూత్తుకుడి జిల్లా కయిత్తారు సమీపంలో బుధవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆమ్నీ బస్‌ డ్రైవర్‌ సహా ముగ్గురు మృ

ఆమ్నీ బస్సు బోల్తా: డ్రైవర్‌ సహా ముగ్గురి మృతి

చెన్నై, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): తూత్తుకుడి జిల్లా కయిత్తారు సమీపంలో బుధవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆమ్నీ బస్‌ డ్రైవర్‌ సహా ముగ్గురు మృతి చెందారు. పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కన్నియాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌ వడచేరి నుంచి మంగళవారం రాత్రి ఆమ్నీ బస్సు చెన్నైకి బయలుదేరింది. 28 మంది ప్రయాణికులతో ఉన్న ఆ బస్సును విరుదునగర్‌ జిల్లా సోమనాథపురానికి చెందిన పాండి (32) అనే డ్రైవర్‌ నడిపారు. అర్ధరాత్రి దాటాక తూత్తుకుడి జిల్లా కయిత్తారు సమీపం అరసన్‌కుళం ప్రాంతంలో బస్సు ముందు టైర్‌ పంక్చరైంది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్త్తాపడటంతో ప్రయాణికులంతా హాహాకారాలు చేసారు. సమాచారం తెలుసుకున్న, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని బస్సులో చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో గాయపడిన వారిని వెలికి తీయడానికి అగ్నిమాపక సిబ్బంది అవస్థలు  పడ్డారు. ఈ ప్రమాదంలో కన్నియాకుమారి జిల్లా తిరువట్టార్‌ సమీపం పుత్తన్‌కడై ప్రాంతానికి చెందిన జీసస్‌ రాజన్‌  (47), నాగర్‌కోవిల్‌ సమీపం కీళ్‌వన్నాన్‌విలై ప్రాంతానికి చెందిన శివరామన్‌ (28) తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మరణించారు. బస్‌ డ్రైవర్‌ పాండి కాళ్లు, చేతులు బస్సులోని కమ్మీల మధ్య చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. పాండిని అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద బయటకు తీసి అంబులెన్స్‌లో తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన కాసేపటికి పాండి మృతి చెందారు. ఇక ప్రమాదంలో గాయపడిన పదిమంది ప్రయాణికులను చికిత్స కోసం కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-06-16T15:01:11+05:30 IST