రోడ్డు ప్రమాదంలో యువ క్రీడాకారుడి మృతి

ABN , First Publish Date - 2022-04-19T13:42:58+05:30 IST

రాష్ట్రానికి చెందిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు విశ్వా దీనదయాళన్‌ (18) ఆదివారం సాయంత్రం మేఘాలయలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానిక లయోలా

రోడ్డు ప్రమాదంలో యువ క్రీడాకారుడి మృతి

                  - షిల్లాంగ్‌ పోటీలకు వెళ్తుండగా దుర్ఘటన 


చెన్నై: రాష్ట్రానికి చెందిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు విశ్వా దీనదయాళన్‌ (18) ఆదివారం సాయంత్రం మేఘాలయలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానిక లయోలా కాలేజీ లో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న విశ్వా జూనియర్‌, సబ్‌జూనియర్‌ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించాడు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో సోమవారం ప్రారంభమైన 83వ జాతీయ సీనియర్‌, అంతరాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో పాల్గొనేందుకు విశ్వా, సంతోష్ కుమార్‌, కిశోర్‌కుమార్‌, అభినాష్ తో కలసి వెళ్ళాడు. ఆదివారం సాయంత్రం అసోం రాజధాని గౌహతి నుంచి తోటి కీడ్రాకారులతో కలిసి షిల్లాంగ్‌కు కారులో బయలుదేరాడు. మార్గమధ్యంలో అదుపుతప్పిన ఓ లారీ ఆ కారును ఢీకొనడంతో ముందుసీటులో కూర్చున్న విశ్వా దీనదయాళన్‌, డ్రైవర్‌ దీబా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణించిన క్రీడాకారులు సంతోష్ కుమార్‌, కిశోర్‌కుమార్‌, అభినాష్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోస్టుమార్టం అనంతరం విశ్వా మృతదేహాన్ని గౌహతి నుంచి  విమానంలో సోమవారం ఉదయం చెన్నై తీసుకువచ్చారు. స్థానిక అన్నానగర్‌లోని నివాసంలో విశ్వా దీనదయాళన్‌ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనకు ఉంచారు. నగరానికి చెందిన టీటీ క్రీడాకారులు, నగర ప్రముఖులు భౌతికకాయానికి నివాళులర్పించారు.


ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్ర్భాంతి...

నగరానికి చెందిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు విశ్వా దీనదయాళన్‌ మృతి చెందాడనే వార్త విని దిగ్ర్భాంతికి గురయ్యానని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఓ సంతాప సందేశంలో వర్థమాన క్రీడాకారుడిగా తన ప్రతిభాపాటవాలను చాటుకుంటూ వస్తున్న విశ్వా భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటారని తనతోపాటు అందరూ అతడిపై ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. విశ్వా మృతి కుటుంబీకులకే గాకుండా స్నేహితులకు, తోటి క్రీడాకారులకు తీరని లోటన్నారు. శోకతప్తులైన కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.10లక్షలను ఆర్థికసాయంగా ప్రకటిస్తున్నానని స్టాలిన్‌ తెలిపారు. ఇదిలా ఉండగా టెన్నిస్‌ క్రీడాకారుడు విశ్వా దీనదయాళన్‌కు సోమవారం ఉదయం శాసనసభలో సంతాపం ప్రకటించారు. విశ్వా మృతికి సంతాపసూచకంగా సభ్యులందరూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఇదే విధంగా అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి, డీఎంకే ఎంపీ కనిమొళి, తెలంగాణా, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తదితరులు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇదిలా ఉండగా విశ్వాకుటుంబీకులకు ఆలిండియా టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య రూ.5లక్షల సాయంగా అందజేయనున్నట్లు సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2022-04-19T13:42:58+05:30 IST