- లారీని కారు ఢీకొని ముగ్గురి దుర్మరణం
చెన్నై: అయ్యప్ప మాల ధరించిన తండ్రీకొడుకు లతో పాటు మరొకరు.. శబరి మలై వెళ్లివస్తూ పరలోకాలకు మరలిపోయారు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటారనగా రోడ్డుప్రమాదం వారిని బలితీసుకుంది. కారు లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలిలా వున్నాయి... స్థానిక మొగలి వాక్కం ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ శంకర్ (60), సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆయన కుమారుడు మహేష్ (30), వారి ఇంట్లో అద్దెకుంటున్న సేలంకు చెందిన చిన్నరాజు ఇటీవల అయ్యప్పమాల వేసుకున్నారు. ఇటీవల ఈ ముగ్గురు మరో స్నేహితుడితో కలిసి కారులో శబరిమలైకి వెళ్ళారు. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నలుగురూ తిరుగుముఖం పట్టారు. కారును మహేష్ నడిపాడు. మంగళవారం వేకువజాము 3 గంటలకు తాంబరం వద్ద స్నేహితుడిని దింపివేసి, ట్రంక్‌రోడ్డులో ముగ్గురూ పయనమయ్యారు. ఆ సమయంలో కారు అదుపు తప్పి గోపాలకృష్ణ థియేటర్ ఎదురుగా రోడ్డు పక్కనే నిలిచివున్న లారీని ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన శంకర్, చిన్నరాజు అక్కడికక్కడే కన్ను మూశారు. తీవ్రంగా గాయపడిన మహేష్‌ను చికిత్స నిమిత్తం రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక అతను కూడా ప్రాణాలు విడిచాడు. పూందమల్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి