Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వివాహం.. విషాదం..

twitter-iconwatsapp-iconfb-icon

హృదయవిదారకంగా కాసానగర్‌ రోడ్డు ప్రమాదం

ప్రమాద విషయం దాచి పెళ్లి జరిపించిన పెద్దలు

ఆనక విషయం తెలుసుకుని రోదించిన వధూవరులు

పచ్చటి పెళ్లింట కలచివేసిన దృశ్యాలు

ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

చాలామందికి గాయాలు

శోకసంద్రంలో చింతలమడ దళితవాడ

డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే..


అటు పెళ్లిబాజాలు.. ఇటు ఆర్తనాదాలు.. అక్కడ సంతోష క్షణాలు.. ఇక్కడ కన్నీటి కేకలు.. ఆవైపు అవధుల్లేని ఆనందం.. ఈవైపు అంతులేని విషాదం.. నాగాయలంక రోడ్డులోని అమరస్థూపం సమీపంలో గురువారం జరిగిన ప్రమాదంలో హృదయవిదారక దృశ్యాలు.  ఐదుగురు మృతిచెందిన విషయాన్ని బయటకు రానీయకుండా పెద్దలు వివాహం జరిపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సరిగ్గా వివాహ సమయంలో జరిగిన ఈ ప్రమాదాన్ని వధూవరులకు తెలియనీయకుండా పెద్దలు పెళ్లి ముగించినా, ఆనక ప్రమాదాన్ని తలచుకుని రోదించిన దృశ్యాలు పచ్చటి పెళ్లింటిని దుఃఖసాగరంలో ముంచేశాయి. - చల్లపల్లి


గురువారం ఉదయం 11.30 గంటలు.. మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలోని కల్యాణ వేదిక.. వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. కానీ, ఏ ఒక్కరిలో ఆనందం లేదు. వధూవరులు మాత్రమే సంతోషంగా చిరునవ్వులు చిందిస్తున్నారు. మిగతా వారంతా కన్నీళ్లు దిగమింగుతూ పక్కనే నిలుచున్నారు. అసలు విషయం తెలియని వధూవరులు సంతోషంగా వివాహ తంతును ముగించుకుని నిలబడ్డారు. కాసేపటికే కల్యాణ మండపమంతా ఖాళీ అయిపోయింది. మోపిదేవి మండలం పెదప్రోలు పంచాయతీ శివారు కాసానగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తమవారు చనిపోయారన్న విషయాన్ని దాచి పెద్ద మనసుతో పెళ్లి జరిపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.


గురువారం ఉదయం 11.30 గంటలు.. కాసానగర్‌ వద్ద జరిగిన ప్రమాద స్థలి. ముగ్గురు కుమారులున్నా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్న 70 ఏళ్ల వయసు కలిగిన కోన వెంకటేశు ఊపిరి ఆగిపోయింది. భర్తను కోల్పోయి, ముగ్గురు కుమారులను సాకుతున్న బూరేపల్లి వెంకటేశ్వరమ్మ విగతజీవిగా మారిపోయింది. మృతులెక్కడో, క్షతగ్రాతులెక్కడో తెలియని భీతావహ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. అప్పటి వరకు పెళ్లికి వెళ్తున్నామన్న ఆనందమంతా భరించలేని దుఃఖమైపోయింది. బంధువులు, చుట్టుపక్కల వారి రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదకరంగా మారిపోయింది. 

కాపాడిన హోర్డింగ్‌

డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా మినీ వ్యాన్‌ పల్టీకొట్టి కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి హోర్డింగ్‌ యాంగ్లర్‌ను పట్టుకుని ఆగింది. హోర్డింగే లేకుంటే మరింత ప్రమాదం జరిగి ఉండేదని తెలుస్తోంది. వాహనం పల్టీ కొట్టడంతో అందులో ఉన్న పెళ్లి బృందమంతా చెల్లాచెదురుగా పడిపోయారు. నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా, ప్రాణాలొదిలారు. చాలామందికి తీవ్రగాయాలయ్యాయి.

రెండు కిలోమీటర్లు దాటితే..

లక్ష్మీపురం శివారు చింతలమడ దళితవాడ నుంచి వ్యానులో బయల్దేరిన ఈ పెళ్లి బృందం మరో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే పెళ్లింటికి చేరుకునేది. ఈలోపే ఈ ఘటన జరిగిపోయింది. మృతిచెందిన వారంతా వ్యవసాయ కూలీలు, రైతులే. డ్రైవర్‌ నిర్లక్ష్యం ఇంతమంది కుటుంబాలను విషాదంలోకి నెట్టిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 

జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బాధితులకు చికిత్స

మచిలీపట్నం టౌన్‌ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంచర్ల ప్రభావతి, పల్లి భాగ్యం, బండారు కోటేశ్వరమ్మ, చిగురుపాటి నాగమల్లి, పాలడుగు గంగా భవానీ, లింగం మనీషా, లింగం మానసి, బండారు విజయలక్ష్మి, గడ్డం వెంకటేశ్వరమ్మ, బూరేపల్లి శివాజీ, గడ్డం గొంతెమ్మ ఇక్కడ చికిత్స పొందుతున్నారు. మచిలీపట్నం ఆంధ్రా ఆసుపత్రిలో, చిన్నాపురం ఆసుపత్రిలో కూడా ముగ్గురిని చేర్పించారు. మద్దాల మాధవరావు, పల్లి సుస్మిత, పల్లి నాంచారమ్మ, కంచర్ల సుప్రియ పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఎంపీ, ఎమ్మెల్యే పరామర్శ

చికిత్స పొందుతున్న వారిని ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌, అవనిగడ్డ డీఎస్పీ మెహబూబ్‌ బాషా పరామర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గాయపడిన వారికి సరైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూపరింటెండెంట్‌ జయకుమార్‌, వైద్యబృందం దగ్గరుండి సేవలందించారు.

వివాహం.. విషాదం..


వివాహం.. విషాదం.. హోర్డింగ్‌కు తగిలి ఆగిపోయిన మినీ వ్యాన్‌


వివాహం.. విషాదం..


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.